గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - May 07, 2020 , 00:34:01

‘కాళేశ్వరం’తో రెండు పంటలు

‘కాళేశ్వరం’తో రెండు పంటలు

  • కొండపోచమ్మ సాగర్‌ నీటితో చెరువులను నింపుతాం
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
  • పలుచోట్ల కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం
  • ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి రైతులకు చెక్కుల పంపిణీ

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/చిన్నశంకరంపేట/రామాయంపేట/నిజాంపేట : ‘కాళేశ్వరం’ నీటితో ఉమ్మడి మెదక్‌ జిల్లా సస్యశ్యామలం కానున్నదని, కాలం, కరెంట్‌తో సంబంధం లేకుండా రెండు పంటలకు సాగునీరందనున్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం చిన్నశంకరంపేట మండలం కామారం, మిర్జాపల్లి గ్రామాల్లో ‘కొండపోచమ్మ’ నుంచి వచ్చే నీటి కాల్వ నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేంద్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్‌, చిన్నశంకరంపేట మండలాల సరిహద్దు గ్రామం కొర్విపల్లి శివారులోని కాల్వ పనులను కాలినడకన వెళ్లి పరిశీలించారు. కోంటూర్‌ చెరువును నింపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి సూచనలిచ్చారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురి బాధిత కుటుంబాలకు రైతుబీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్‌ నుంచి నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల మీదుగా కెనాల్‌ నుంచి అంబాజిపేట పెద్ద చెరువు, మెదక్‌ మండలం కోంటూర్‌ చెరువు, గొలుసుకట్టు చెరువులను నింపుకోవచ్చన్నారు. చిన్నశంకరంపేట మండలంలో ఇప్పటికే 18 కిలోమీటర్ల కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయని, మరో 14 కిలోమీటర్ల కాల్వ తవ్వాల్సి ఉందన్నారు. కాల్వల నిర్మాణాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇవ్వాలని, పరిహారం అందించేందుకు కలెక్టర్‌ వద్ద రూ.35కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రూ.25వేలలోపు పంట రుణాలను ప్రభుత్వం ఒకే దఫా లో మాఫీ చేయనున్నదన్నారు. రెండు రోజుల్లో రూ.1,198 కోట్లు 5 లక్షల 87 వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామన్నారు. లక్ష రూపాయల రుణం ఉన్న వారికి నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే మిర్జాపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 

మల్లయ్య, భూమయ్యలకు పరిహారం ఇవ్వాలని ఆర్డీవోకు ఆదేశం

‘కెనాల్‌ తవ్వకాల్లో భూమి కోల్పోయాం.. నష్టపరిహారం ఇప్పించండి’.. అంటూ కొరివిపల్లికి చెందిన మల్లయ్య, భూమయ్య మంత్రి హరీశ్‌రావును వేడుకున్నారు. దీంతో స్పందించిన మంత్రి వారికి నష్ట పరిహారం ఇవ్వాలని ఆర్డీవో సాయిరాంను ఆదేశించారు.  

నార్లపూర్‌లో కాల్వ నిర్మాణ పనులు ప్రారంభం

రామాయంపేట ఉమ్మడి మండలం నార్లాపూర్‌లో ‘కాళేశ్వరం’ కాల్వ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం రామాయంపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో రాయిలాపూర్‌, కోనాపూర్‌ గ్రామాల్లో కాల్వ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను, మున్సిపల్‌ కార్మికులకు సరుకులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిజాంపేటలో 5వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం గోదాంను మంజూరు చేశారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. ‘కాళేశ్వరం’ కాల్వ నిర్మాణానికి భూము లు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీవైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌పై విమర్శలు సరికాదు..

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రా ష్ర్టాల్లో రైతుల కోసం ఏమి ఉద్దరించారో చెప్పాలి... దమ్ముంటే వా రి రాష్ర్టాల్లో  తెలంగాణ ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి... అన్నదాతల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదు’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. మెదక్‌ అతిథి గృహంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్‌ ఇస్తున్నారా.. అని మంత్రి ప్రశ్నించారు. ‘రైతు బంధు’తో రైతులకు సాయం, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో మే నెలలో కూడా చెరువులు మత్తడి దుంకుతుంటే విమర్శిస్తారా? అని మంత్రి అన్నారు. కరోనా విషయంలోనూ కేంద్రం ఏ సాయం చేయలేదన్నారు.  దీక్ష పేరుతో ఇక్కడి ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపై బురుదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతుల రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 1200 కోట్లు విడుదల చేసిందన్నారు. అంతకు ముందు కరోనాపై పోరాటానికి మెదక్‌ ఐఎంఏ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి సమక్షంలో ఐఎంఏ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ సురేందర్‌ రూ.6 లక్షల చెక్కును మంత్రి హరీశ్‌రావుకు అందించారు.


logo