ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - May 05, 2020 , 23:42:48

వడ్ల లోడ్‌.. వస్తూనే ఉంది

వడ్ల లోడ్‌.. వస్తూనే ఉంది

  • ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాహనాల క్యూ... 

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లతో వాహనాలు క్యూ కడుతున్నాయి. ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం క్వింటాలుకు రూ.1835 చెల్లించి వడ్లు కొనుగోలు చేస్తున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్కెట్‌ యార్డులను మూసివేసిన ప్రభుత్వం అన్నదాతలకు అందుబాటులో ఉండేలా 100 ఎకరాల్లో వరిసాగైన గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

సంగారెడ్డిప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ 

23 వేల ఎకరాల్లో వరిసాగు...

గత ఏడాది యాసంగిలో జిల్లాలో 23,563 ఎకరాల్లో వరిసాగైంది. మొత్తంగా 50 వేల మెట్రిక్‌ టన్నులకు మించి వడ్ల దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కలెక్టర్‌ హనుమంతరావు సూచనలతో జిల్లా పౌర సరఫరాల శాఖ 93 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 92 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతుండగా, రోజువారీగా పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

రూ.34.61 కోట్ల వడ్ల కొనుగోలు..

జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 18,862 మెట్రిక్‌ టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి, నూర్పిడి తరువాత బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఇప్పటి వరకు 17,509 టన్నుల వడ్లను మిల్లులకు తరలించారు. మరో 1352 టన్నుల వడ్ల తరలింపు, కొత్తగా కొనుగోలు ప్రక్రియను రోజువారీగా కొనసాగుతున్నాయి. మొత్తం 5295 మంది రైతుల నుంచి రూ.34.61 కోట్ల విలువ వడ్లు కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి 2179 మంది రైతులకు సంబంధించిన  రూ.15.28 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 

అన్ని వసతులు కల్పించాం...

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 93 వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాం. నాలుగు రోజులుగా వడ్లు కేంద్రాలకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కేంద్రాల్లో వడ్లు అమ్ముకున్న రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం. 2.41 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటాయి.

-శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి

వడ్ల పైసలొస్తున్నయి.. 

దేశమంతా కరోనా ప్రభావం ఉన్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం సంతోషకరం. ఊర్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టిండ్రు. పండించిన పంట అంతా కండ్ల ముందట అమ్ముడైతుంది. అమ్మిన నాలుగు రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో పైసలస్తున్నయి. 

- మోహీన్‌ రైతు, కొండాపూర్‌ మండలం

యాసంగి పండింది..

24గంటల కరెంటు వల్ల పంటకు సరిపోను బోర్లు నీళ్లు పోసినాయి. యాసంగి పంటను తృప్తిగా పండించినం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించినం. తాలు, తరుగు, కోతలు తీయకుండానే తూకం వేసిన్రు. పైసలు కూడా తొందరగానే వస్తయి. 

- రవీందర్‌ రావు రైతు పుల్కల్‌ మండలం logo