శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 30, 2020 , 03:09:45

అన్నదాతకు గిట్టుబాటు

అన్నదాతకు గిట్టుబాటు

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ... దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు గడియ తీరికలేకుండా ఉన్నారు. ఇప్పుడు ఉన్నదంతా రైతన్నల రాజ్యమే అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు అక్షరసత్యాలు అవుతున్నాయి. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా కొంటాం అని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఆయా ఎమ్మెల్యేలు సామాజికదూరం పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కొండాపూర్‌లో బుధవారం ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కోహీర్‌ మండలంలోని పీచెర్యాగడిలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, హత్నూరలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మానకొండూర్‌ నియోజకవర్గంలోని బెజ్జంకి, చీలాపూర్‌, పెరుకబండ, గుండారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరిశీలించారు. మంగళవారం కురిసిన వర్షంతో రైతులు ఆందోళన పడొద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. హత్నూర, పుల్కల్‌ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకుడు జగన్‌ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మర్కూక్‌, పాములపర్తి, ఎర్రవల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్‌, తూప్రాన్‌ మండలం నాగులపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోఆపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్టార్‌ చంద్రయ్య, పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి,  వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నారాయణఖేడ్‌ మండలం సంజీవన్‌రావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి పరిశీలించారు. మనూరు మండలం పుల్‌కుర్తిని సందర్శించి యాసంగి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 69 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 

41 కిలోలు దాటొద్దు: మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోల కంటే అధికంగా తూకం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం బస్తాలను తూకం వేసి చూశారు. 

తాలు తీస్తేనే టోకెన్‌: అదనపు కలెక్టర్‌ నగేశ్‌

రైతులు తమ వరిధాన్యం తాలు తీస్తేనే టొకెన్లు ఇస్తామని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. రామాయంపేటతో పాటు మండలంలోని  హవేళీఘనపూర్‌, అక్కన్నపేట, తొనిగండ్ల, కోనాపూర్‌,కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వడ్లు ఎండిన తర్వాత ఒకటికి రెండుసార్లు రైతులు కచ్చితంగా ఎగబోయాలన్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి రైస్‌ మిల్లర్లు అదనపు హమాలీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. లారీల కొరత ఉన్నందున ధాన్యం విక్రయాలు జరిపిన రైతుల బ్యాగులు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లకు ట్రాన్స్‌పోర్టు చార్జీలను చెల్లిస్తామని ఆయన చెప్పారు. 


logo