సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 30, 2020 , 03:08:37

శ్రమకు దక్కిన గౌరవం

శ్రమకు దక్కిన గౌరవం

  • పెరిగిన జీతంతో సఫాయి  కార్మికులకు భరోసా
  • ఉమ్మడి జిల్లాలో 1,615 పంచాయతీలు
  • 5,357 మంది పారిశుధ్య కార్మికులు
  • మే నుంచి కచ్చితంగా రూ.8,500 చెల్లించాల్సిందే...
  • ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ సర్కార్‌ గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించింది. ఉదయం లేచింది మొదలు గ్రామాల్లో అన్నిరకాల సేవలు అందించే వారికి శ్రమకు తగిన వేతనం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.8,500 చెల్లించాలని, లేని పక్షంలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఆయా పంచాయతీలకు వచ్చే నిధుల నుంచే కార్మికుల వేతనాలు చెల్లించనున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 1,615 గ్రామ పంచాయతీలుండగా, 5,357 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు 1,750 మంది కార్మికులు, సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు, 1,994 మంది కార్మికులు, మెదక్‌ జిల్లాలో 469 పంచాయతీలు 1,613 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కొత్త వేతనాలు అందనున్నాయి. అయితే ఆయా పంచాయతీల్లో తక్కువ వేతనం తీసుకున్న వారు ఉదయం కొద్దిసేపు, తరువాత సొంత పనులకు వెళ్లిపోయేవారు. రూ.8,500 తీసుకుంటున్న క్రమంలో ఇక మీదట ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీల్లోనే పనులు చేయాల్సి ఉంటుంది. కాగా, వేతనాల పెంపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. 

సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం...

ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పనులు చేస్తున్న మా మీద దయజూపి జీతాలు పెంచిన సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం. సఫాయి కార్మికులుగా పనిచేస్తున్న మేము ఎంతో కష్టపడుతున్నప్పటికీ మా పనులను గత ప్రభుత్వాలు గుర్తించలే. కానీ సీఎం కేసీఆర్‌ సారు పెద్ద మనసుతో మా జీతాలు పెంచడం సంతోషంగా ఉంది.

- బేగరి లచ్చవ్వ, సఫాయి కార్మికురాలు, నిజాంపేట పంచాయతీ, నారాయణఖేడ్‌ మండలం

చాలా సంతోషంగా ఉన్నది..

సీఎం కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం. పంచాయతీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. చాలీచాలని వేతనాలతో బాధపడుతున్న మాకు నెలకు రూ.8500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.

- కొల్పుల సిద్ధిరాములు, మక్తభూపతిపూర్‌, మెదక్‌ మండలం

మా కష్టాన్ని గుర్తించిండ్రు..

ఏండ్ల నుంచి తక్కువ వేతనానికి పంచాయతీ పారిశుధ్య కార్మికురాలుగా పనులు నిర్వహిస్తున్నాను. వచ్చే నెల నుంచి రూ. 8,500 అందిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది.  

- పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు లక్ష్మి, ఝరాసంగం

తగిన గౌరవం దక్కింది

మా జీతాలు పెంచడంతో మా పనికి తగిన గౌరవం దక్కిందని అనుకుంటున్నా. ఏండ్ల నుంచి అంతంత మాత్రం జీతంతోనే సర్దుకుంటున్న. అందరి బాగోగులు పట్టించునే సీఎం సారు మా బతుకుల గురించి ఆలోచన చేసి జీతం పెంచినందుకు చేతులెత్తి దండం పెడుతున్నా. 

- రాములు, వాటర్‌మెన్‌, నిజాంపేట పంచాయతీ, నారాయణఖేడ్‌ మండలం

మా జీవితాల్లో వెలుగులు..

మా శ్రమను గుర్తిం చి జీతం పెంచి ఇస్తామని ప్రకటించడం ఎంతో సం తోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ పం చాయతీ పారిశుధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప మనుసున్న మహారాజు. 

- పంచాయతీ పారిశుధ్య కార్మికుడు బాలప్ప, సంఘం(కే)


logo