శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 28, 2020 , 02:29:42

ఆపదలో ఆదుకుందాం..

ఆపదలో ఆదుకుందాం..

మెదక్‌ ప్రతినిధి/ నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ/ చిన్నశంకంరంపేట/ కౌడిపల్లి/ కొల్చారం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారిని అన్నిరకాలుగా      ఆదుకుందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలో పలుచోట్ల నిర్వహించిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొని సరుకులు పంపిణీ చేశారు.  సాయి బాలాజీ గార్డెన్‌ నాయీ బ్రాహ్మణులకు, ద్వారకా గార్డెన్‌లో పాస్టర్లకు మంత్రి  నిత్యావసర వస్తువులు  అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వలస కూలీలతో సహా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఆదుకోవాలని సూచించారు. మెదక్‌ జిల్లాలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకొని కరోనాను సమర్థవంతంగా నియంత్రిం చారన్నారు. లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మాస్కులు లేకుండా ప్రజలు బయటకు రావొద్దని, శుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వీయనియంత్రణ పాటించి ఇండ్ల నుండి ప్రజలు బయటకు రావొద్దని, మరికొద్ది రోజులు ఓపికగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు సంతోషాన్నిస్తున్నాయని, పేదవారి పై ముఖ్యమంత్రి ఉదారతతో వ్యవహరించి రూ.1500, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డితో పాటు సింగిల్‌ విండో చైర్మన్‌ హనుమంత్‌ రెడ్డి, కౌన్సిలర్లు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పోలీస్‌ అధికారులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అంతకు ముందు చిన్నశంకరంపేటలోని శ్రీనివాస గార్డెన్‌లో గ్రామ పంచాయతీ కార్మికులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు నిత్యావసర వస్తువులు,  శానిటైజర్లను పంపిణీ చేశారు.  వడియారం బైపాస్‌ రోడ్డుపై మంత్రి హరీశ్‌రావు కారును ఆపి అక్కడ వలస కార్మికులకు పంపిణీ చేస్తున్న ఆహారాన్ని పరిశీలించి దాతలను అభినందించారు. అనంతరం రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌, మండల పార్టీ అధ్యక్షుడు పల్లె జితేందర్‌గౌడ్‌ సీఎం కేసీఆర్‌ చిత్రపటంతో ఉన్న వెయ్యి గులాబీ మాస్క్‌లు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు.  నర్సాపూర్‌తో పాటు కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో పేద ప్రజలకు, ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,  స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి,మాజీ మంత్రి సునీతారెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.

పెండింగ్‌ పనులపై దృష్టి సారించండి...

జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు  సూచించారు. సోమవారం మెదక్‌ జిల్లా కేంద్రంలోని అతిథిగృహంలో జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీర్లు, సొసైటీ చైర్మన్లు, రైస్‌మిల్లర్లు ఇతరులతో జిల్లాలోని డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..  ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్లను సత్వరం పూర్తి చేయాలన్నారు.  నర్సరీలో మొక్కలు లేకుంటే సంబంధిత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తామని మంత్రి హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండాఉంచేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్‌ చైర్మన్లకు మంత్రి సూచించారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి వెంట వెళ్తున్న వలస కూలీలకు ఎవరైనా దాతల సహకారంతో పాదరక్షలు అందజేసేలా చూడాలని సూచించారు.  ఈ టెలీకాన్ఫరెన్స్‌లో  కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రంగౌడ్‌, కోనాపూర్‌ సొసైటీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీసీఎస్‌వో శ్రీనివాస్‌ తదితరులున్నారు. 

‘కాళేశ్వరం’ భూముల సేకరణ వేగవంతం చేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టు కింద జిల్లాలో నాలుగు ప్యాకేజీలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి కాలువల నిర్మాణం కోసం 726 ఎకరాల భూమి అవసరం ఉండగా కేవలం 226 ఎకరాల భూసేకరణ  మాత్రమే జరిగిందని మిగతా 500 ఎకరాల భూసేకరణ త్వరలో చేపట్టి కాలువల నిర్మాణ పనులు చేపట్టాలని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో పాటు ఏజెన్సీలను, కాంట్రాక్టర్లను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ రెడ్డి, మదన్‌ రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు.  కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి మెదక్‌ జిల్లాకు నాలుగు ప్యాకేజీల ద్వారా సాగునీరు అందుతుందన్నారు. రామాయంపేట, కిష్టాపూర్‌, చిన్న శంకరంపేట తదితర ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మే 15వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం సీజన్‌లో చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలలో నీటిని నింపుకుందామన్నారు. సంబంధిత ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఇఫ్కోడైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఇరిగేషన్‌ శాఖ ఈఈ యేసయ్య, సంబంధిత ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.


logo