గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 27, 2020 , 00:31:22

అదుపులో ‘హద్దులు’

అదుపులో ‘హద్దులు’

  • కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పటిష్ట చర్యలు
  • ఇతరులను రానివ్వకుండా కట్టుదిట్టం
  • మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తం

సంగారెడ్డి ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సరిహద్దులో ఉన్న తెలంగాణ పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో పల్లె ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇతరులెవ్వరినీ తమ గ్రామాలకు రాకుండా పకడ్బందీగా కట్టడి చేస్తున్నారు. రోడ్లు, పిల్లబాటలు తవ్వి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గ్రామానికి వచ్చే ప్రధాన రోడ్డు వద్ద గ్రామస్తులు కాపలా ఉంటున్నారు. అత్యవసరం అనుకుంటేనే అనుమతి ఇస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. 

రెండు రాష్ర్టాల సరిహద్దుల్లో 31 గ్రామాలు...

కర్ణాటక సరిహద్దులో సంగారెడ్డి జిల్లాలో 31 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కర్ణాటక సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో 31 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలో గౌసాబాద్‌ తండా, ధనసిరి, మాడ్గి, అరంగా నగర్‌, జాడి మల్కాపూర్‌, జహీరాబాద్‌ మండలం లో సత్వార్‌, చిరాగ్‌పల్లి, బుర్ధిపాడ్‌, బూచినెల్లి, కోహీర్‌ మండలంలో సిద్దాపూర్‌ తండా, మనియార్‌పల్లి న్యాల్‌కల్‌ మండలంలో శంషాల్‌పూర్‌, రాజోల, మాల్గి, హుస్సేన్‌నగర్‌, నత్నాపూర్‌, గణేశ్‌పూర్‌, మిర్గాపూర్‌ గ్రామాలున్నాయి. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో అవదత్‌పూర్‌, గౌడ్‌గావ్‌ జనవాడ, కరస్‌గుత్తి, ఏస్గి, కారముంగి, షాపూర్‌, శాంత్‌నగర్‌ తండా, కంగ్టి మండలంలో దెగుల్‌వాడి, చందర్‌తండా, సిద్దాన్‌గిర్గా, నాగూర్‌ కె గ్రామాలున్నాయి. కర్నాటకలోని ఔరంగాబాద్‌ తాలూకాలోని నాగన్‌పల్లి, చింతాకి, సుందాల్‌, ఉజని, సుంకనాల్‌ తదితర గ్రామాలు మనకు సమీపంలో ఉన్నాయి. 

రోడ్లు తవ్వారు..రాకపోకలు నిలిపివేశారు..

సరిహద్దు గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నారు. ఆయా గ్రామాలకు ఇతరులను అనుమతించడం లేదు. ఊర్లోకి రాకుండా రోడ్లు తవ్వడంతో పాటు కట్టెలు, రాళ్లు, ముండ్ల పొదలు అడ్డం పెట్టి కాపలా ఉంటున్నారు. ప్రత్యేక అధికారులను నియమించగా వారు నిత్యం గ్రామాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆశ వర్కర్లు, ఇతర సిబ్బంది గ్రామాలు, తండాలకు ఎవరు వచ్చినా గుర్తించి తిరిగి పంపిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వచ్చిన వారిని స్వీయ నిర్బంధంతో ఇంటికి పరిమితం చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దు మాడ్గి వద్ద, శంషెల్లాపూర్‌, గౌసాబాద్‌ తండా, మునిగార్‌పల్లి, జాడిమల్కాపూర్‌, హుస్సెల్లి, మిర్గాపూర్‌ ఇతర గ్రామాల వద్ద రోడ్లను తవ్వడంతో పాటు ఎవ్వరూ రాకుండా పటిష్టంగా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, వ్యవసాయ అవసరాల నిమిత్తం వచ్చి, పోయే వారికి అక్కడ కాపలా ఉంటున్నవారు సహకరిస్తున్నారు. 

అధికారులు, ప్రజాప్రతినిధులతో వాట్సాప్‌ గ్రూపు

సరిహద్దు గ్రామాలకు ఎవ్వరూ రాకుండా, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు సూచనలతో ఆయా మండలాల ఎంపీడీవో, 31 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, వీఆర్వోలతో కూడిన వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుతో   కలెక్టర్‌ హనుమంతరావు ఐదు  రోజులకు ఓ సారి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. కాగా కొత్త వారు  ఏ గ్రామానికి వచ్చినా సర్పంచ్‌ లేదా కార్యదర్శులు గ్రూపులో సమాచారం పెడుతున్నారు. దీంతో తక్షణమే వైద్య, ఇతర సిబ్బంది వారిని తిరిగి పంపిస్తున్నారు.. లేదా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. మొదట గ్రామంలోకి రానివ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. పల్లెలకు రానివ్వడం లేదని తెలిసి కొద్ది రోజులుగా ఇతరులు గ్రామాలకు రావడం లేదు కూడా.. దీంతో సరిహద్దు గ్రామాలన్నీ ప్రస్తుతం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నాయి. పాలు, కూరగాయలు గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడానికి అధికారులు రైతులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. 

చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు

మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుండడంతో సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది ఉండి ప్రయాణికులతో వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. గూడ్స్‌ వాహనాలకు అనుమతిస్తున్నప్పటికీ డ్రైవర్లు, క్లీనర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై చిరాగ్‌పల్లి, కరస్‌గుత్తి, గంగ్వార్‌, గౌసాబాద్‌, గొటిగార్‌పల్లి, మనియార్పల్లి, మోర్గి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ విధంగా సరిహద్దుల్లో పకడ్బందీ చర్యలతో కరోనాను కట్టడి చేస్తున్నారు.


logo