ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 19, 2020 , 00:44:43

నా జన్మ సార్థకమైంది..

నా జన్మ సార్థకమైంది..

  • రేపోమాపో రంగనాయకసాగర్‌కు గోదావరి నీళ్లు  
  • సీఎం కేసీఆర్‌ శ్రమ, ఇంజినీర్ల కృషి వల్లే కాళేశ్వరం పూర్తి 
  • జిల్లాలో ప్రతి చెరువు, కుంటను నింపుతాం.. 
  • భూసేకరణ, అసంపూర్తి పనులు పూర్తి చేయాలి
  • అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం 
  • రంగనాయకసాగర్‌ కుడికాల్వ పరిశీలన 

సిద్దిపేట కలెక్టరేట్‌,నమస్తేతెలంగాణ/నంగునూరు : ‘ఎన్నో యేండ్ల గోదావరి నీళ్ల కల త్వరలో తీరబోతున్నది..రేపోమాపో రంగనాయకసాగర్‌కు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ప్రతి చెరువు, కుంటను గోదావరి నీటితో నింపుతాం. బీడుభూములన్నింటినీ పచ్చగా మారుస్తాం. సీఎం కేసీఆర్‌ అకుంఠిత శ్రమ, ఎంతోమంది కృషి, ఇంజినీర్ల కష్టం ఫలితంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కండ్లల్లో నీళ్లు తిరిగేవి. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు తేవడంతో నా జన్మ సార్థకమైంది’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలో రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు ఎత్తిపోయనుండడంతో సాగర్‌ కుడికాల్వను శనివారం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఉదయం 6.30కి ప్రారంభమైన పర్యటన ఏకాబికిన 8 గంటలపాటు 79 కిలోమీటర్లు సాగి మధ్యాహ్నం 2.30కి ముగిసింది. అక్కడక్కడ రైతులతో ఆప్యాయంగా మాట్లాడారు. రంగనాయకసాగర్‌ ప్రధాన కుడికాల్వ సిద్దిపేట అర్బన్‌ మండలం లింగారెడ్డిపల్లి, నర్సపురం, మిట్టపల్లి, నంగునూరు మండలాల్లోని వెల్కటూరు, ముండ్రాయి, వెంకటాపూర్‌, కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, మద్దూరు మండలం దానంపల్లి గ్రామ శివారు, నర్మెట, నంగునూరు, సిద్దన్నపేట, మగ్దుంపూర్‌ గ్రామాల్లో ఎల్టీ-4 నుంచి ఎల్టీ-10 వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీ-కెనాల్స్‌(పిల్ల కాల్వలు)ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాల్వలు, పిల్ల కాల్వల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు, నీళ్లు నిండే కుంటలు, చెరువులు నింపే తూములు, పిల్ల కాల్వలపై క్షుణ్ణంగా ఇరిగేషన్‌ అధికారులతో చర్చిస్తూ ప్రతి అంశాన్ని మంత్రి స్వయంగా రాసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంగునూరు మండలంలో 208 చెరువులు ఉండగా, మొదటిదశలో 67 చెరువులు నింపుతామని, కాల్వల ద్వారా 190 చెరువులు నిండుతాయన్నారు. మండలంలో 18 చెరువులు మినహా మిగిలిన చెరువులు, కుంటలతోపాటు 23 చెక్‌డ్యాములను కాళేశ్వరం నీళ్లతో నింపుతామన్నారు. మరో 18 చెరువులను ట్యాంకుల ద్వారా నింపుతామన్నారు. ప్రధాన కుడికాల్వతో సహా నంగునూరు మండలంలో ఎల్టీ-4 నుంచి ఎల్టీ-10 వరకు 8 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ ఉన్నాయని, ఎల్టీ-10 డిస్ట్రిబ్యూటరీ కాల్వ కోసం 160 ఎకరాల్లో భూసేకరణ చేయాల్సి ఉందని, యుద్ధప్రాతిపదికన భూములను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నంగునూరు మండలంలో పెద్దవాగు, సిద్దిపేట వాగు, కానుగ ఒర్రెలపై కలిపి 23 చెక్‌డ్యాంలు నింపేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పలుచోట్ల కాల్వల మధ్య ఖాళీలు, గొలుసుకట్టు చెరువుల ఓటీలను, రోడ్డు క్రాసింగ్‌ కోసం వంతెనలను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రధాన కుడికాల్వతో జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీరందుతుందని స్పష్టం చేశారు. మంత్రి వెంట ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, ఈఈ గోపాలకృష్ణ, డీఈ రవీందర్‌, ఏఈ, మెగా ప్రతినిధి ఉమామహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఉమా వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, పురేందర్‌, మల్లయ్య, రమేశ్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి, లింగంగౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. 

నిత్యావసరాలు అందజేత : లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిద్దిపేటలోని తన నివాసంలో మంత్రి చిన్నకోడూరు మండలానికి చెందిన 65 మంది ఆటోడ్రైవర్లు, పట్టణంలోని 40 మంది డక్కలి కుటుంబాలు, 10 మంది వడ్డెర కుటుంబాలకు, నాయీబ్రాహ్మణ సమాజంలోని 15 మంది వితంతు మహిళలకు కూరగాయలు,నిత్యావసర సరుకులు అందజేశారు. 

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు : సీఎం సహాయనిధి కోసం సిద్దిపేట తానా డాక్టర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ డా.భాస్కర్‌, ఐఎంఏ సెక్రటరీ దామోదర్‌, సభ్యులంతా రూ.లక్ష, పట్టణ ప్రముఖ న్యాయవాది మంగు హరిహరరావు రూ.25 వేల చెక్కును మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. 


logo