గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 12, 2020 , 23:49:09

పారిశుధ్యం మెరుగుపడాలి

పారిశుధ్యం మెరుగుపడాలి

  • ప్రతి రోజూ హైపో క్లోరైట్‌ స్ప్రే చేయాలి 
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి 
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: ‘సిద్దిపేటలో పారిశుధ్యం మెరుగుపడాలి.. నిత్యం తాగునీరు సరఫరా కావాలి.. కరోనా నివారణకు ప్రతి రోజు హైపో క్లోరైట్‌ స్ప్రే చేయాలి.. కోమటి చెరువు, సుభాష్‌ రోడ్లలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలి’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ ప్రతాప్‌, డీఈ లక్ష్మణ్‌, ఓఎస్‌డీ బాల్‌రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, సతీశ్‌ మున్సిపల్‌ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పారిశుధ్యం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, తాగునీటి సరఫరా, నల్లా కనెక్షన్లు తదితర అంశాలపై మంత్రి మాట్లాడారు.  ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నా పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌ తరచూ సమీక్షలు చేయాలన్నారు. రోజు 5 నుంచి 10 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు వచ్చే డంప్‌యార్డు సిద్దిపేటలో ఉందన్నారు. రెండు రోజుల్లో  చైర్మన్‌, కమిషనర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తి వివరాలను తెలుపాలని ఆదేశించారు. నిత్యం ప్రతి వీధిలో హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయాలన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. లాక్‌ డౌన్‌ పూర్తయ్యేలోపు కోమటి చెరువు అవతలి వైపు, సుభాష్‌ రోడ్డులో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు, మురుగు కాల్వల పనులు పూర్తి కావాలన్నారు. కోమటి చెరువు నెక్లెస్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని, సస్పెన్షన్‌ బ్రిడ్జికి లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.   

 నూతన ఒరవడికి మంత్రి శ్రీకారం... 

హరీశ్‌రావు అంటే కాయిన్‌ బాక్స్‌ ఎమ్మెల్యే అని.. వాట్సాప్‌ మంత్రి అని.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సందేశాలకు స్పందించే ప్రజానాయకుడని.. ఎక్కడ ఉన్నా ఒకేసారి 200 నుంచి 2000 మందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించే పొలిటికల్‌ లీడరని.. పేరున్న మంత్రి హరీశ్‌రావు మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చాటి చెబుతూ తన సెల్‌ఫోన్‌ నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇక నుంచి నియోజకవర్గం, మండలాల వారీగా ప్రజాప్రతినిధులు,  అధికారులూ ఇదే పద్ధతిని అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.


logo