శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 10, 2020 , 02:41:30

నిరాడంబరం.. నిత్యపూజలు

నిరాడంబరం.. నిత్యపూజలు

  • వేకువజామునే తెరుచుకుంటున్న ఆలయాల ప్రధాన ద్వారాలు 
  • నిరంతరాయంగా దేవుడి సేవలు 
  • నిత్యపూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు, అభిషేకాలు యథాతథం 
  • పరిమితమందితో ఉత్సవాల నిర్వహణ 
  • వంతులవారీగా విధులు నిర్వర్తిస్తున్న పూజారులు 
  • కరోనా నశించాలని మృత్యుంజయ, ధన్వంతరీ హోమాలు 
  • భక్తుల్లేక బోసిపోతున్న ఆలయాల పరిసరాలు 
  • గోవుల రక్షణకు చర్యలు తీసుకుంటున్న యంత్రాంగం 

మెదక్‌ ప్రతినిధి/ చేర్యాల, నమస్తే తెలంగాణ/ సంగారెడ్డి మున్సిపాలిటీ/ గజ్వేల్‌ అర్బన్‌/ న్యాల్‌కల్‌/ ఝరాసంగం: ప్రజలందరినీ చల్లంగా చూసే దేవుళ్లకు భక్తుల దర్శనం లేకున్నా, నిత్య పూజలు యథావిధిగా జరుగుతున్నాయి. రోజూ భక్తుల జయజయధ్వానాలతో బారులు తీరి ఉండే ఆలయాలు కరోనా మహమ్మారి కాటుకు మూతబడ్డాయి. భక్తులు గుంపులుగుంపులుగా వస్తే వైరస్‌ వ్యాప్తి సులువు అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దేవాలయాలను మూసివేసింది. దేవాలయాలు అనునిత్యం పరిశుభ్రంగా ఉన్నా భక్తుల క్షేమం కోరి దర్శనాలు నిలిపివేసింది. భక్తులకు అనుమతి లేకున్నా స్వామి, అమ్మవార్ల నిత్య సేవలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. వేకువజామున దీపారాధన, అభిషేకాలు, నైవేద్యాలు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఆయా ఆలయాల్లో ప్రతియేటా నిర్వహించే ఉత్సవాలను కూడా పరిమితమందితో ఎలాంటి లోటు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి నశించాలని ఇటీవల అన్ని ఆలయాల్లో మృత్యుంజయ, ధన్వంతరీ హోమాలు కూడా నిర్వహించారు. 

ఏడుపాయల ఆలయం..

దట్టమైన అభయారణ్యంలో వెలిసిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం నిత్యం భక్తులతో కిక్కిరిసి ఉండేది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల అనుమతి లేకున్నా అమ్మవారికి నిత్య పూజలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రతిరోజు గర్భగుడిలో పూజలు చేసి ఆలయాన్ని మూసివేస్తారు. ఏడుగురు పూజారులు ఉండగా, రోజుకు ముగ్గురు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. 

మల్లన్న ఆలయం..  

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిత్య పూజలు, కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నాయి. స్వామివారికి నిత్య కల్యాణం, త్రీకాల పూజలు, నైవేద్య సమర్పణ తదితర వాటిని రోజువారి పూజల్లో ఎలాంటి తేడాలు లేకుండా ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు నిర్వహిస్తున్నారు. పుష్కరిణితోపాటు ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు.  

నాచగిరి ఆలయంలో.. 

గజ్వేల్‌ నియోజకవర్గంలోని నాచారం గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహుడికి వేకువజాము నుంచే నిత్య పూజలు చేస్తున్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం ఆలయంలో నారసింహ మూలమంత్ర హవనం నిర్వహించారు. 

సంగారెడ్డి వైకుంఠపురంలో  

సంగారెడ్డిలోని మహాలక్ష్మీ గోదా సమేత విరాట్‌ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం(వైకుంఠపురం)లో నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు నిత్యాన్నదానం నిలిచిపోయినా, ఆలయం లో స్వామి వారికి సేవలందించే అర్చకులకు మాత్రమే నిత్య అన్నప్రసాదం అందిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా సర్వమంగళాదేవికి ప్రతి శుక్రవారం అభిషేకం,మంగళవారం దక్షిణముఖి ఆంజనేయస్వామికి మూలమంత్ర హోమం, శనివారం వాసుదేవ, మహాలక్ష్మీ, సుదర్శన నారసింహ హోమంతోపాటు పల్లకీసేవ నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో 120 గోవులు, ఎడ్లు, 40 వరకు లేగదూడలు ఉన్నాయి. వాటికి మేత, దాణా, నీటిని యథావిధిగా అందిస్తున్నారు. గోమూత్రం కావాల్సిన వారికి ఆలయ ప్రధాన ద్వారం వద్ద డ్రమ్‌ను ఏర్పాటు చేసి అందిస్తున్నారు. 

రేజింతల్‌ సిద్ధివినాయక ఆలయం 

రేజింతల్‌ గ్రామ శివారులో స్వయంభూ వెలిసిన సిద్ధివినాయక ఆలయంలో స్వామివారికి నిత్యం పూజలు యథాతథం. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఆలయ సిబ్బంది ఎలాంటి లోటురాకుండా మేతను అందిస్తున్నారు. 

కేతకీ సంగమేశ్వరుడి సన్నిధి..  

అష్టతీర్థాలకు నిలయమై ఝరాసంగంలో వెలిసిన పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ, ఆకు పూజలు రోజుమాదిరిగా నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ కరోనా నశించాలని పూజలు నిర్వహిస్తున్నారు.


logo