సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 07, 2020 , 00:05:19

ఉపాధి పనుల్లో ‘దూరం’ పాటించాలి

ఉపాధి పనుల్లో ‘దూరం’ పాటించాలి

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ/ గజ్వేల్‌ రూరల్‌/ గజ్వేల్‌ అర్బన్‌: కరోనా ఇబ్బందితో పాటు వేసవి సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో ఉపాధిహామీ పనులను ముమ్మరం చేసి పేదలకు సహాయంగా నిలవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. గజ్వేల్‌ ఐవోసీ కార్యాలయంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కూలీలు, వలస కూలీలు పస్తులుండకుండా స్థానిక ప్రజాప్రతినిధులు సహాయసహకారాలు అందించాలన్నారు. కరోనా వల్ల సామాజిక దూరం పాటిస్తూనే ఉపాధి, వ్యవసాయ పనులు జరిగేటట్లు చైతన్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం ఎదిగేటట్లు చూడాలని లేకపోతే సర్పంచ్‌లపై చర్యలు తప్పవన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టార్ఫాలిన్‌ కవర్లు తెచ్చుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, డీపీవో సురేశ్‌,  తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌  మండల పరిధిలోని దాచారంలో సోమవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన అనంతరం తిరిగి గజ్వేల్‌లో జరిగే కార్యక్రమానికి వెళ్తుండగా గ్రామం మధ్యలో మహిళ కన్పించగానే వాహనం ఆపి సంక్షేమ పథకాల అమలుపై  మంత్రి హరీశ్‌రావు  ఆమెను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి జీవనాధారం లేని మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె మంత్రికి వినతి పత్రం అందజేసింది.  

ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

సోమవారం గజ్వేల్‌ ఐవోసీలో ఇన్ఫోసిస్‌, హరేరామ హరేకృష్ణ ట్రస్టుల ఆధ్వర్యంలో 160మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసర వస్తువులను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఓ ఆటోడ్రైవర్‌ తమకు లాక్‌డౌన్‌తో ఇబ్బందులు కలుగుతున్నాయని మెసేజ్‌ పెట్టారని దానికి స్పందించి  ఈ సాయాన్ని అందించామన్నారు. 


logo