బుధవారం 30 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 03, 2020 , 01:39:21

కరోనా.. హైరానా

కరోనా.. హైరానా

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెండురోజులుగా ఆ వ్యక్తి ఇంటి నుంచి ఒక కిలోమీటరు పరిధిలో 2600 కుటుంబాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 40 బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. కరోనా నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు మెదక్‌,నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ వెళ్లొచ్చిన 13 మందిని జిల్లా అధికార యంత్రాంగం గాంధీకి తరలించింది. ఇందులో 12 మందికి నెగెటివ్‌ రాగా, మెదక్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. అయితే ఈయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశాడు ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించి ఏడుపాయలలోని హరిత హోటల్‌కు క్వారంటైన్‌కు తరలించారు.

రెండు గ్రామాల్లో వైద్య శిబిరాలు

దుబ్బాక, నమస్తే తెలంగాణ: గజ్వేల్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ వ్యక్తి పదిరోజులుగా తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల వివరాలను సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌డెవిస్‌ వెల్లడించారు. ఆ వ్యక్తి సంచరించిన గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. దౌల్తాబాద్‌ మండలం అహ్మద్‌నగర్‌లో 10 బృందాలు, మిరుదొడ్డి మండలం మాదన్నపేటలో 5 బృందాలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆ గ్రామాలను సందర్శించి, వైద్యబృందంతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  

కొండాపూర్‌లో అప్రమత్తం 

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కొండాపూర్‌/ కొల్చారం: కొండాపూర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రతీవీధిలో రసాయనాలు పిచికారి చేయించారు. కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిశారో వివరాలు సేకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పడు సమాచారం పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని జహీరాబాద్‌ డీఎస్పీ గణపత్‌జాదవ్‌ తెలిపారు.


logo