ఆదివారం 07 జూన్ 2020
Siddipet - Mar 31, 2020 , 23:17:38

స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

 మెదక్‌ ఉమ్మడి జిల్లా నెట్‌వర్క్‌:  కరోనా నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉమ్మడి మెదక్‌జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేస్తున్నారు. ఉదయం కొద్దిసేపు మాత్రం నిత్యావసరాలకోసం బయటకు వస్తున్నారు. ఆ తరువాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.   

మంగళవారం సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలతో పాటు కంది, కొండాపూర్‌ మండలాలలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివుంచారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసిన మార్కింగ్‌లలో సామాజికదూరం పాటించే విధంగా దుకాణ యజమానులు చర్యలు చేపట్టారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, కంది మండల కేంద్రం, సదాశివపేట పట్టణం, వికారాబాద్‌ వెళ్లే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు. 

నర్సాపూర్‌ డివిజన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరుగుతున్నది.   ప్రజల సౌకర్యం కోసం మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ పలుచోట్ల కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేయించారు.  కొల్చారం,కౌడిపల్లి, చిలిపిచెడ్‌ మండలంలో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది.  మెదక్‌ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.  మెదక్‌-కామారెడ్డి జిల్లా సరిహద్దు పోచమ్మరాల్‌ వద్ద జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు చెక్‌పోస్టును పరిశీలించారు.  పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతుండడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి.  తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని మనోహరాబాద్‌, తూప్రాన్‌, వెల్దుర్తి, చేగుంట, రామాయంపేట, నిజాంపేటల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనాలు తిరుగకుండా  అడ్డుకుంటున్నారు. మనోహరాబాద్‌లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి శానిటేజర్‌ స్ప్రేని   పిచికారి చేశారు. రామాయంపేటలోని పలు వీధుల్లో చైర్మన్‌ జితేందర్‌ పారిశుధ్య కార్మికులతో శానిటేజర్‌  పిచికారి చేయించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ హుస్నాబాద్‌ పట్టణంతో పాటు డివిజన్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు   ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరిని బయటకు అనుమతించారు. మధ్యాహ్నం తరువాత ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కారణం లేకుండా ఒకే బైక్‌పై ఇద్దరు, ముగ్గురు వస్తున్న వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. డివిజన్‌లో ఒకే రోజు పదిహేనుకు పైగా వాహనాలను సీజ్‌ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.  గజ్వేల్‌లో 8వ రోజు లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించారు.  గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌కు కూరగాయల కోసం ఎక్కువమంది వస్తుండడంతో మార్కెట్‌ అధికారుల సహకారంతో కొందరు వ్యాపారులు  కూరగాయలను తూకం వేసి ప్యాకింగ్‌ చేసి ఆటోలో తీసుకువెళ్లి ఇంటింటికి అమ్మడం ప్రారంభించారు. అలాగే మంగళవారం ప్రజ్ఞాపూర్‌లోని ప్రధాన రహదారులలో సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు.  దుబ్బాక నియోజకవర్గంలో  లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ప్రజలకు ఇబ్బందులు తల్తేకుండా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటిస్తూ  ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.   చేర్యాల పట్టణంతో పాటు చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలలో ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.చేర్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  స్వరూపరాణి ఆధ్వర్యంలో పట్టణంలోని 12 వార్డులలో విస్తృతంగా రసాయనాలను పిచికారీ చేశారు.అలాగే సీఐ రఘు,ఎస్‌ఐ మోహన్‌బాబులు బైక్‌ల పై తిరుగుతున్న వ్యక్తులను పట్టుకొని కౌన్సిలింగ్‌ నిర్వహించారు.   సిద్దిపేటతో పాటు చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, నారాయణరావుపేట మండలాల్లోని గ్రామాల్లో నిరంతరాయంగా లాక్‌ డౌన్‌ కొనసాగింది.  సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ ఆవరణ, డిగ్రీ కళాశాల మైదానం, మల్టీపర్పస్‌ హైస్కూల్‌ ఆవరణల్లో ఏర్పాటు చేసిన తాత్కలిక మార్కెట్లలో కూరగాయలు విక్రయించారు. 


logo