మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 30, 2020 , 00:10:57

కరోనా కనుమరుగయ్యేలా..!

కరోనా కనుమరుగయ్యేలా..!

  • జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు
  • అధికార యంత్రాంగానికి మంత్రి హరీశ్‌రావు దిశా నిర్దేశం
  • మూడు జిల్లాల్లో అధికారులతో సమీక్షలు, సమావేశాలు
  • టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా సలహాలు, సూచనలు
  • విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా

సంగారెడ్డి, సిద్దిపేట/ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కరోనా కట్టడి అవుతున్నది. సీఎం కేసీఆర్‌ సూచనలు, సలహాలతో మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించి కరోనా కట్టడిపై దిశా నిర్దేశం చేశారు. ఆయా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారు లతో సమీక్ష, సమావేశాలు, వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసి ప్రత్యేక నెంబర్‌ను అందుబాటులో ఉం చారు. ఇబ్బందులు ఎదురైన వారు కంట్రోల్‌ రూంకు ఫోన్‌చేస్తే అదికారులు తక్షణమే స్పందిస్తున్నారు. 

జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు 

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి జిల్లా, మం డల, గ్రామ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ / ఎస్పీ, అదనపు కలెక్టర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులున్నారు. వీరు వైరస్‌ నిర్మూలన చర్యల తో పాటు కింది స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు. మండల స్థాయి కమిటీల్లో తాసిల్దార్‌, ఎంపీడీవో, వైద్యాధికారి, ఎస్‌ఐ, గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పోలీస్‌ అధికారి, ఏఎన్‌ ఎం, ఆశవర్కర్లు ఉంటారు. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్‌ను  పర్యవేక్షణ చేస్తున్నారు. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ప్రభుత్వమే నిత్యావసర సరుకులను అందిస్తుంది. 

హోం క్వారంటైన్‌పై ప్రత్యేక నిఘా

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 307 మందిని ఇతర దేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. 79 మంది క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. మిగతా వారిపై అధికారులు నిఘా కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లాకు ఇతర దేశాల నుంచి 458 మంది వరకు వచ్చారు. వీరిలో 239 మంది క్వారంటైన్‌లో 14 రోజులు పూర్తి చేసుకొని వారి వారి ఇండ్లలోకి పంపించారు. మిగిలిన 219 మంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెదక్‌ జిల్లాకు ఇతర దేశాల నుంచి 125 మంది వరకు వచ్చినట్లు గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. 

ప్రతి రోజు మూడు సార్లు.. 

ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో  మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిన్నారు.  ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డివిజన్‌ స్థాయి అధికారులతో, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కలెక్టర్‌, పోలీసు కమిషనర్లు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. 

మాస్క్‌లు, శానిటైజర్లు, బ్లీచింగ్‌ పౌడర్స్‌

కరోనా వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు మాస్క్‌లు, శానిటైజర్లు, బ్లీచింగ్‌ పౌడర్‌ పంపిణీ చేశారు. కూరగాయల మార్కెట్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచుతూ, ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. మున్సిపల్‌ కార్మికులకు, జవాన్లకు శానిటైజర్లు ఇచ్చి రోజుకు 3 సార్లు చేతులు కడుక్కు నేలా అవగాహన కల్పిస్తున్నారు. ఫైరింజన్లతో రహదారులను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. 

సామాజిక దూరం పాటిస్తూ...

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించేలా కిరాణ షాపులు, మెడికల్‌ షాపులు, కూరగాయల మార్కెట్ల ఎదుట సున్నంతో ప్రత్యేకంగా డబ్బాలను గీసి పెడుతున్నారు. ఒక డబ్బాకు మరో డబ్బాకు ఒక మీటరు ఉండేలా చూశారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వారు గ్రామ పొలిమెరలోనే చేతులు కడుక్కున్నాకే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. గ్రామాల పొలిమేరల్లో కంచెలు ఏర్పాటు చేసి గ్రామస్తులు కాపలా కాస్తున్నారు. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు గ్రామానికి ఒక పోలీస్‌ అధికారి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏ, ఆశవర్కర్లు గ్రామాల్లో తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. గుంపులు, గుంపులుగా ఉండే వారికి పోలీసులు లాఠీ దెబ్బలు రుచిచూపిస్తున్నారు. 

రైతులకు ప్రత్యేక పాసులు జారీ

కూరగాయలు, పాలు అమ్ముకోవడం కోసం అధికారులు రైతులకు ప్రత్యేక పాసులు అందించారు. పాసు లు ఉన్న రైతులు తమ కూరగాయలను పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి అమ్ముకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వారంలో 3 రోజులు ఆది, బుధ, శుక్రవారం రోజు తాత్కాలిక మార్కెట్లు నడిపించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రైతులకు ఎరువులు, ఇతర మందులకు ఇబ్బంది కాకుండా ప్రతి మండల కేంద్రంలో మూడు నుంచి నాలుగు దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేశారు. పాడి, పౌల్ట్రీ, ఇతర రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వడ్లు, ఇతర పంట దిగుబడులు కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ తరఫున జిల్లా అధికార యంత్రం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలనిస్తుండడంతో ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.


logo