ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 27, 2020 , 22:50:21

అధిక ధరలకు కళ్లెం

అధిక ధరలకు కళ్లెం

  • కూరగాయల ధరల పట్టికను నిర్ణయించిన అధికారులు
  • అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు  
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కూరగాయల మార్కెట్లు
  • మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో కదలిన యంత్రాంగం 
  • ఎక్కువ ధరలకు విక్రయిస్తే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు..  

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడుస్తుంటే మరోవైపు ఇదే అదునుగా భావించి దళారులు మార్కెట్లో కూరగాయలను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అసలే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా నిత్యావసర సరుకులతో పాటు పాలు, కూరగాయల ధరలను అమాంతం పెంచుతూ దుకాణాదారులు ప్రజల నుంచి దండుకుంటున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎవరు కూడా కూరగాయలను, ఇతర నిత్యావసర సరుకులను  అధిక ధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కరోనాని కట్టడిచేయడంలో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు కలెక్టర్‌, ఎస్పీతో పాటు ఇతర శాఖల అధికారులతో సమీక్షాసమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కూరగాయలు, ఇతర నిత్యావసర సరులకు ఎవరు కూడా అధిక ధరలకు అమ్మకూడదని దానిని సీరియస్‌గా కట్టడి చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగానే ధరలను నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

అధికారులే కూరగాయల ధరలను నిర్ణయిస్తూ ధరల పట్టికను విడుదల చేసింది. అందులో ఉన్న ధరల కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా ఆయా దుకాణా దారులకు జారీ చేశారు. అలాగే ప్రజల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా కొత్తగా కూరగాయల మార్కెట్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. పట్టణాల్లో వార్డుల వారీగా విభజించి ఐదారు వార్డులకు ఒక మార్కెట్‌ చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు అధికారుల పనితీరును హర్షిస్తున్నారు.

కూరగాయాల ధరల వివరాలు (ధర కిలోకు)..

బీట్‌రూట్‌ రూ.13, కాకరకాయ రూ.50, పొట్లకాయ రూ.15, వంకాయ రూ.19, క్యాబేజీ రూ.11, క్యాప్సికమ్‌ రూ.31, క్యారేట్‌ రూ.19, గోబీపువ్వు రూ.19, చామగడ్డ రూ.44, దోసకాయ రూ.15, దొండకాయ లోకల్‌ రూ.19, దొండకాయ పెన్సిల్‌ రూ.31, మునగ కాయలు (8-10) రూ.31, చిక్కుడుకాయ రూ.25, దొడ్డు పచ్చిమిర్చి రూ.19, పచ్చిమిర్చి రూ.31, ఉల్లిగడ్డ రూ.40, కీరా రూ.13, బెండకాయ రూ.38,  ఆలుగడ్డ రూ.38, హైబ్రిడ్‌ బీరకాయ రూ.25, లోకల్‌ బీరకాయ రూ.44, టమాట రూ.25 గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ ధరల ప్రకారమే కూరగాయలను అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు కూడా దుకాణా దారులకు జారీ చేసింది.

ప్రత్యేక కూరగాయల మార్కెట్లు ఏర్పాటు..

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాలు మండలాల్లో ప్రత్యేక కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసింది. ప్రధానంగా కూరగాయలను కొనేందుకు వచ్చే ప్రజలను గుంపులు గుంపులుగా రాకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకున్నారు. కొనుగోలుకు వచ్చిన వారి ఒక్కొషాపు వద్ద కనీస దూరం పాటించేలా గడులను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన వారందరూ చేతులు కడుక్కునే విధంగా సబ్బును, నీటి సౌకర్యాన్ని కల్పించారు. 

కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్ల వివరాలు...

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్తగా 10 కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇందులో 7 ఏరియాల మార్కెట్లలో కూరగాయల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్‌ వెనుక, తారా ప్రభుత్వ కళాశాల, ఆంథోనీ కళాశాల ప్రక్కన, కొత్తబస్టాండ్‌, బైపాస్‌రోడ్డులోని ఎస్‌బీఐ ఎదురుగా, నాల్‌సాబ్‌గడ్డ పాత జైలు వద్ద, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, సోమవారం మార్కెట్‌, రాజంపేట శివాలయంతో పాటు అంబేడ్కర్‌ స్టేడియంలో కొత్త కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. కాగా మార్కెట్‌లో కొనసాగుతున్న అమ్మకాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌లు, ఆర్డీవో నగేశ్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.


logo