గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Mar 26, 2020 , 23:33:10

నిర్మానుష్యం..

నిర్మానుష్యం..

  • నాలుగోరోజు లాక్‌డౌన్‌ విజయవంతం
  • ఉదయం పూట అత్యవసరాలకు  తప్ప బయటకు రాని ప్రజలు
  • తెరుచుకోని మిగతా దుకాణాలు
  • ఖాళీగా దర్శనమిచ్చిన రోడ్లు
  • పల్లెల్లో కొనసాగుతున్న రోడ్ల దిగ్బంధం
  • పట్టణాల్లో యథావిధిగా స్వీయ నిర్బంధం

దుబ్బాక,నమస్తే తెలంగాణ/దుబ్బాక టౌన్‌/మిరుదొడ్డి/తొగుట/ దౌల్తాబాద్‌/ రాయపోల్‌/చేర్యాల/మద్దూరు/కొమురవెల్లి :  నియోజకవర్గంలో నాలుగు రోజులుగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది.  గురువారం అన్ని గ్రామాల్లో  ప్రజలు స్వచ్ఛందంగా  స్వీయ నిర్బంధం పాటించారు.  నియోజకవర్గంలో 56 గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు.  లాక్‌డౌన్‌ పరిస్థితులను తెలుసుకున్నారు. దౌల్తాబాద్‌, తొగుట  పీహెచ్‌సీలను(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను) ఆయన సందర్శించి  వైద్యాధికారులతో మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. పక్క రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చిన వారి వివరాలను అధికారులకు తేలియజేసి ప్రభుత్వానికి సహకరించాలని  ప్రజలను కోరారు.  దుబ్బాక పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కలెక్టర్‌, సీపీ ఆదేశాల మేరకు స్థానిక పెద్ద చెరువుకట్టపై ఉన్న  రైతు బజారులో ఒకే చోట కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి మండలంలో క్వారెంటైన్‌లో ఉన్న 11 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తొగుట మండలంలో కల్లు విక్రయాలు నిలిపివేయాలని ఎస్‌ఐ సామ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో కల్లు వ్యాపారం కొనసాగిస్తున్నారని, పల్లెపహాడ్‌లో కల్లు డిపో సీజ్‌ చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

చేర్యాలలో..

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ చేర్యాల, మద్దూరు, కొమురవెల్లిలో నాలుగో రోజు విజయవంతంగా కొనసాగుతున్నది. మండలంలోని వీరన్నపేటలో  సర్పంచ్‌ కొండపాక భిక్షపతి చెక్‌పోస్టు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే బైఠాయించి టెంటు వేసుకొని అనసవరంగా సంచరిస్తున్న వ్యక్తుల పేర్లు నమోదు చేసుకుని అధికారులకు తెలియజేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి గృహ నిర్బంధంలో ఉన్న 19 మందికి తహసీల్దార్‌ శైలజ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మోహన్‌బాబు, ఆర్‌ఐ శ్రీకాంత్‌ తదితరులు నిత్యావసర వస్తువులు అందజేశారు. పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నివారణపై పోలీసులు, వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 5వ వార్డులో కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌ ఆద్వర్యంలో ఇంటింటికీ శానిటైజర్లు అందజేశారు. మండలంలోని కాశెగుడిసెల గ్రామంలోకి ఎవరూ రావొద్దని సర్పంచ్‌ షేక్‌ ఫకీర్‌ ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ పెట్టి ప్రజలను వేడుకున్నారు. సీఐ రఘు, ఎస్‌ఐ మోహన్‌బాబు పట్టణంతో పాటు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలు రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆకునూరు గ్రామంలో కూస లక్ష్మి, నర్సయ్య దంపతులు తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో 108 వాహనంలో సిబ్బంది చేర్యాల దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరిగి వారిని గ్రామానికి పంపించారు.  

గ్రామాల్లో పర్యటించిన డీఎల్‌పీవో..

మండలంలోని లద్నూర్‌, మద్దూరు వల్లంపట్ల గ్రామాల్లో డీఎల్‌పీవో రాజీవ్‌కుమార్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న శానిటేషన్‌ పనులను ఆయన పరిశీలించి సర్పంచ్‌, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. వల్లంపట్ల గ్రామంలో ఎంపీటీసీ గూళ్ల సత్యకళ ఆధ్వర్యంలో వాటర్‌ ట్యాంకర్‌, సబ్బులు, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బధంలో ఉన్న వ్యక్తులకు రెవెన్యూ అధికారులు నిత్యావసర వస్తువులు అందజేశారు. 


logo