గురువారం 04 జూన్ 2020
Siddipet - Mar 26, 2020 , 23:27:46

మూడు వారాలు జాగ్రత్తగా ఉందాం..

మూడు వారాలు జాగ్రత్తగా ఉందాం..

  • విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు బయటకు రావొద్దు
  • కరోనా నియంత్రణకు సర్కారు పకడ్బందీ చర్యలు 
  • సీఎం కేసీఆర్‌ ప్రతిక్షణం పర్యవేక్షణ  
  • లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలి  
  • రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం 
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని చర్యలను తీసుకుంటున్నది. విదేశాల నుంచి వచ్చిన వారిని తమఇండ్ల నుంచి 14 రోజులపాటు బయటకు రానివ్వొద్దు, ప్రధాని, సీఎం కేసీఆర్‌ చెప్పిన సూచనలు ప్రతిఒక్కరూ పాటించాలి. ఇప్పటికి రాష్ట్రంలో కరోనా వైరస్‌ అదుపులో ఉన్నది. అయినా అందరం ఇండ్లల్లోనే ఉండి మహమ్మారిని పారదోలుదాం. ప్రతిఒక్కరూ ఇండ్లల్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ సక్సెస్‌ చేస్తున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. గురువారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం, ఉన్నత పాఠశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను సందర్శించి వ్యాపారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నపిల్లలను బయటకు రానివ్వద్దు. మూడువారాల పాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనాపై ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కొన్నిచోట్ల గుంపులు గుంపులుగా ఉంటున్నారని, దయచేసి ఈ రెండు మూడువారాలు ఎవరికి వారు దూరంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పచ్చిమిర్చి కిలోకు రూ.100, టమాట రూ.50 పలుకుతుందని, వ్యవసాయశాఖ సమన్వయంతో సరుకులకు అనుగుణంగా వాహనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల నుంచి రైతు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించి నేరుగా బోయినపల్లి మార్కెట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరువు తదితర పట్టణాల్లో కూరగాయల డిమాండ్‌ ఉందన్నారు. రైతాంగానికి ఇబ్బందులు లేకుండా వారికి ప్రత్యేక పాసులు అందిస్తామన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సరుకు రవాణా ఆగిపోవడం వల్ల పట్టణాల్లో కూరగాయల ధరలు పెరిగి, గ్రామాల్లో తగ్గుముఖం పట్టాయన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిరాం, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులున్నారు. కాగా, సిద్దిపేటలోని తన నివాసం నుంచి మంత్రి ఉమ్మడి జిల్లా నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలు చేయడంతోపాటు వారివారి ప్రాంతాల్లో చేపడుతున్న చర్యల గురించి ఆరాతీశారు.  

పాస్‌లున్నవారిని పంపించండి 

హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వస్తుండగా శామీర్‌పేట వద్ద గుమిగూడిన ప్రయాణికులను చూసి మంత్రి కారు ఆపి వారితో మాట్లాడారు. మీరు ఎక్కడికి వెళ్లాలని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు వెళ్లనివ్వడం లేదని చెప్పగా, వెంటనే వారివారి ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. దీంతో ప్రయాణికులు మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు.  logo