బుధవారం 30 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 26, 2020 , 23:18:34

బియ్యం కోసం బారులు

బియ్యం కోసం బారులు

  • ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రారంభమైన ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ
  • మెదక్‌జిల్లాతో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల షురూ
  • సిద్దిపేటలో త్వరలో ప్రారంభం
  • పెద్దసంఖ్యలో తరలివచ్చిన లబ్ధిదారులు
  • సామాజిక దూరం పాటించిన ప్రజలు
  • పంపిణీ ఆపాలంటూ సాయంత్రం ఉత్తర్వులు
  • ఇంటికే రేషన్‌ పంపేందుకు అధికారుల యోచన
  • తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రేషన్‌ కోసం రావొద్దని అధికారుల విజ్ఞప్తి

కరోనా వైరస్‌ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడొద్దని  సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల   ఉచితంగా12 కిలోల బియ్యం పంపిణీ  గురువారం  ప్రారంభమైనది. మెదక్‌ జిల్లాతో  పాటు సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఈ పంపిణీ ప్రారంభంకాగా సిద్దిపేటలో త్వరలో ప్రారంభం కానున్నది. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఈ పంపిణీని ప్రారంభించారు. రేషన్‌ షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేయడంతో పాటు శానిటైజర్‌లను అందుబాటులో ఉంచారు. అయితే కొన్నిచోట్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలిరావడం అధికారుల దృష్టికి వచ్చింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువమంది ఒకేచోటకు రావడం క్షేమం కాదని,  లబ్ధిదారుల ఇంటికే రేషన్‌ పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసమని వెంటనే బియ్యం పంపిణీని ఆపివేయాలని ఆదేశాలిచ్చారు. సీఎం హామీ ఇచ్చిన మేరకు రూ.1500 లబ్ధిదారులకు ఇచ్చే విషయంలోను అవలంభించాల్సిన పద్ధతుల గురించి అధికారులు ఆలోచిస్తున్నారు. లబ్ధిదారులందరికీ ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేసే ప్రక్రియ పకడ్బందీగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎవ్వరికీ  ఇబ్బందులు  రాకుండా ఈ  ప్రక్రియను కొనసాగించేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వారు తెలిపారు. 

మెదక్‌ నెట్‌వర్క్‌: జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేసే భాగంలో ఈ నెల 31 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పేదలకు తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌ జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, గుమ్మడిదల మండలాల్లో బియ్యం పంపిణీ ప్రారంభించారు. మెదక్‌ జిల్లాలో కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌లు పర్యవేక్షించారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మనోహరాబాద్‌ మండలంలో జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌ ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించారు. ముందుగా టోకెన్లు ఇచ్చి వరుస క్రమంలో సామాజిక దూరాన్ని పాటించి లబ్ధిదారులందరికీ బియ్యాన్ని పంపిణీ చేయాలని రేషన్‌ డీలర్లకు కలెక్టర్‌ సూచించారు. శానిటైజర్లను రేషన్‌ దుకాణాల వద్ద అందుబాటులో ఉంచారు. మెదక్‌ జిల్లాలో 2,13,736 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 1,99,830 తెల్ల రేషన్‌కార్డులు, 13,820 అంత్యోదయ కార్డులు, 86 అన్నపూర్ణ కార్డులు ఉన్నారు. జిల్లా మొత్తంగా 9 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం లబ్ధిదారులకు ఉచితంగా అందనున్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో 3,72,864 కార్డుదారులకు బియ్యం సరఫరా

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ఆహార భద్రత కార్డులు కలిగిన లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 3,72,864 కార్డు దారులకు బయోమెట్రిక్‌ విధానంతో సరఫరా చేయానున్నారు. దీంతో 12,43,315 మంది లబ్ధిదారులు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత బియాన్ని తీసుకొనున్నారు. ఇప్పటికే జిల్లాకు 15,132.688 మెట్రిక్‌ టన్నుల బియ్యం సంబంధిత గోదాముల్లో నిల్వచేశామని అధికారులు తెలిపారు. జిల్లాలోని 26 మండలాల్లో 845 రేషన్‌ దుకాణాలతో 3,45,660 ఆహార భద్రత కార్డులు, 27,099 అంత్యోదయ ఆహార భద్రత కార్డులు, 105 అన్నపూర్ణ కార్డుల లబ్ధిదారులకు 12 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. కాగా, సదాశివపేట పట్టణం గుమ్మడిదల మండలంలో గురువారం బియ్యం సరఫరా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదాశివపేట పట్టణంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన సహకారంతో, గుమ్మడిదలలో తాసిల్దార్‌ భిక్షపతి రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు అందజేశారు. 

సిద్దిపేట జిల్లాలో నేటి నుంచి పంపిణీ 

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలకు ఆహార పదార్థాల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించడంతో బియ్యం పంపిణీ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న 680 రేషన్‌ షాపులకు బియ్యాన్ని సరఫరా చేసింది. బియ్యం సరఫరా కోసం గోదాముల్లో బఫర్‌ నిల్వలు ఉండడంతో వాటి నుంచి 10,600 టన్నుల బియ్యాన్ని పంపిణీ కోసం ఆయా రేషన్‌ షాపులకు దిగుమతి చేసి, పంపిణీకి సిద్ధం చేసింది. సిద్దిపేట జిల్లాలో 2,88,919 రేషన్‌ కార్డులు ఉండగా, 9,09,583 యూనిట్స్‌ ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 18,836 ఉండగా 51,275 యూనిట్లు ఉన్నాయి. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులో 2,69,989 కార్డులు ఉండగా, 8,58,167 యూనిట్లు ఉన్నాయి. అన్నపూర్ణ కార్డులు 96 యూనిట్లు ఉన్నాయి. వీరందరికీ ఆయా రేషన్‌ షాపుల ద్వారా బియ్యాన్ని అందజేయనున్నారు.  

రేషన్‌ బియ్యం సరఫరా నిలిపివేతకు ఆదేశాలు 

ఉచిత రేషన్‌ బియ్యం సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగా మెదక్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీని నిలిపివేస్తున్నాం. గుంపులు గుంపులుగా వచ్చి రేషన్‌ సరుకులు తీసుకుంటున్నుట్లు ప్రభుత్వం గమనించింది. దీంతో ప్రభుత్వమే ప్రతి ఇంటికి సరఫరా చేయాలా లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా అనేది నిర్ణయించనున్నది. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నాం.

- మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌logo