గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 25, 2020 , 23:05:50

ష్‌.. గప్‌ చుప్‌

ష్‌.. గప్‌ చుప్‌

  • లాక్‌డౌన్‌- డే 3 సక్సెస్‌
  • నిర్మానుష్యంగా పల్లెలు, పట్టణాలు 
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూతబడిన దుకాణాలు 
  • ఇండ్లల్లోనే శార్వరి నామ ఉగాది ఉత్సవాలు  
  • ఆలయాల్లో పూజారుల పంచాంగ శ్రవణం 
  • ముళ్ల కంచెలతో గ్రామాల దిగ్బంధం  
  • రహదారులపై పోలీసుల చెక్‌పోస్టులు, తనిఖీలు 

కరోనాని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగింది. పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించారు. వరుసగా మూడోరోజు దుకాణాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. ఇండ్లల్లోనుంచి జనం బయటకు రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. తమ గ్రామంలోకి ఎవరూ రావొద్దంటూ అన్ని గ్రామాల పొలిమేరల్లో రోడ్డుకడ్డంగా ముళ్లకంచెలు పెట్టి ప్లకార్డులు ఏర్పాటు చేశారు. శార్వరి నామ ఉగాది నేపథ్యంలో ఉదయం పరిమిత సంఖ్యలో జనం రోడ్లపైకొచ్చి సరుకులు కొనుగోలు చేశారు. ఆలయాలు పూర్తిగా మూతబడడంతో ఇండ్లల్లోనే పండుగ జరుపుకున్నారు. పలు ఆలయాల్లో పూజారులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. నిత్యావసరాల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించి వస్తువులను కొనుగోలు చేశారు. రహదారులపై చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు అనవసరంగా వచ్చిన వాహనాలను సీజ్‌ చేశారు.  

మెదక్‌ ప్రతినిధి,నమస్తేతెలంగాణ: హుస్నాబాద్‌ జోన్‌నెట్‌వర్క్‌: హుస్నాబాద్‌ పట్టణంతో పాటు డివిజన్‌లోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్న మూడో రోజైన బుధవారం కూడా జనం బయటకు రాలేదు. ఉగాది పండుగను సైతం ఇంటిలోనే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.  ఏసీపీ ఎస్‌ మహేందర్‌ లాక్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. పలు పెట్రోల్‌ బంకులు, కిరాణా దుకాణాల్లోకి వెళ్లి కరోనా వైరస్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా డివిజన్‌లోని నాలుగు మండలాల్లో 23గ్రామాల ప్రజలు తమ గ్రామానికి ఎవరూ రావొద్దని దారులకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశారు. హుస్నాబాద్‌ మండలంలో 4, అక్కన్నపేటలో 4, కోహెడలో 8, బెజ్జంకిలో 7గ్రామాలను ఆయా గ్రామాల ప్రజలు దిగ్భంధంలో ఉంచుకున్నారు. 

ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యవేక్షణ

దుబ్బాక జోన్‌నెట్‌వర్క్‌: నియోజకవర్గంలో గత మూడు రోజులుగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది.   బుధవారం మధ్యాహ్నం దుబ్బాక పట్టణంలో పలు వార్డుల్లో లాక్‌డౌన్‌ పరిస్థితులను శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ , దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షించారు. రేకులకుంట మల్లికార్జున దేవాలయం వద్దకు వెళ్లి  అక్కడి పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రేకులకుంట  ఆలయానికి భక్తులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆలయ పూజారులకు, అధికారులకు ఆయన సూచించారు. నియోజకవర్గంలో 32 గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి.  రాయపోల్‌ మండలంలో 19 గ్రామాలు స్వీయ నిర్భందంలోకి వెళ్లాయి.   మిరుదొడ్డి మండలంలో 13 గ్రామాలు,  దౌల్తాబాద్‌ మండలంలో 12, దుబ్బాకలో నాలుగు గ్రామాలు, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో లచ్చపేట, ధర్మాజీపేట, చెల్లాపూర్‌ వార్డులు స్వీయ నిర్బంధం పాటించాయి. తొగుటలోని ఎల్లారెడ్డిపేట, ఎల్‌ బంజేరుపల్లి, వెంకట్‌రావుపేట, తుక్కాపూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చే దారులకు ముళ్ల కంచెలు, రాళ్లు రప్పలు వేసి ఇతరులు గ్రామాల్లోకి రాకుండా దిగ్భంధం చేశారు. ఎస్‌ఐ సామ శ్రీనివాస్‌రెడ్డి రోడ్డు మీద వెల్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దౌల్తాబాద్‌ మండలం తిరుమలాపూర్‌లో గత రెండు రోజుల కిందట కరీంనగర్‌ నుంచి వచ్చిన ఓ దంపతులకు స్వీయ గృహ నిర్బంధం పాటించాలని అధికారులు సూచించారు.  మిరుదొడ్డిలో ఎంపీపీ గజ్జెల సాయిలు అవగాహన కల్పించారు. 

విజయవంతంగా కొనసాగుతున్న  లాక్‌డౌన్‌..

చేర్యాల, నమస్తే తెలంగాణ/ మద్దూరు/ కొమురవల్లి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. మూడోరోజు లాక్‌డౌన్‌ సందర్భంగా చేర్యాల మండలంలోని వీరన్నపేట, పెదరాజుపేట, మద్దూరు మండలంలోని వల్లంపల్లి, బైరాన్‌పల్లి, బెక్కల్‌, జాలపల్లి, మరుమాముల, కమలాయపల్లి, గాగిళ్లాపూర్‌, వంగపల్లి, కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట, గౌరాయపల్లి, మర్రిముచ్చాల, రాంసాగర్‌, ఐనాపూర్‌, రసులాబాద్‌ గ్రామాల్లో ప్రజలు వారి గ్రామాలకు వచ్చే రోడ్లపై ముళ్లకంచెలు, ట్రాక్టర్లు, మొద్దులను అడ్డంగా పెట్టారు. చేర్యాల సీఐ రఘు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు మోహన్‌బాబు, నరేందర్‌రెడ్డి అనవసరంగా రోడ్డు పైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తిరిగి పంపిస్తున్నారు. అలాగే పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించారు.  చిట్యాలలో సర్పంచ్‌ ఎర్రవెల్లి రామ్మోహన్‌రావు గ్రామంలో పర్యటిస్తూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని ప్రచారం చేశారు. మద్దూరులోని రెడ్యానాయక్‌తండా పంచాయతీ పరిధిలోని , నర్సాయపల్లిలో మహిళలు వేపచెట్టుకు నీళ్లుపోసి పూజలు చేశారు. logo