మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 23, 2020 , 23:33:33

బియ్యం, నగదు ఫ్రీ

బియ్యం, నగదు ఫ్రీ

  • ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఇంటికి రూ.1500 
  • మార్గదర్శకాలు రూపొందిస్తున్న యంత్రాంగం 
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 35,547 క్వింటాళ్ల బియ్యం పంపిణీ 

సంగారెడ్డి ప్రధాన/మెదక్‌/సిద్దిపేట ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ ఇంటికి పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో రోజువారీగా కూలీపనిచేసుకుని జీవనాలు సాగించే కుటుంబాలు ఇబ్బంది పడతాయని భావించింది. ఈ మేరకు ఆహార భద్రత కార్డులున్న ప్రతి కుటుంబానికి ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.1500 అందించాలని సర్కారు నిర్ణయించింది. పూర్తిగా ఉచితంగానే అందించనున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం బియ్యం, డబ్బులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది.

సంగారెడ్డికి రూ.55.92 కోట్ల నగదు..

సంగారెడ్డి జిల్లాలో 372864 రేషన్‌కార్డులుండగా, 27099 అత్యోదయ, 3,45,660 ఆహార భద్రత, 105 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఈ మేరకు జిల్లాలో మొత్తం కార్డుల్లో 12,43,315 మంది సభ్యులుండగా, వీరందరికి 12 కిలోల చొప్పున 14,919.780 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నది. అలాగే, ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున చెల్లించడానికి మొత్తం రూ.55.92 కోట్లు అవసరం. జిల్లాకు సరిపడా బియ్యం అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సిద్ధం చేశారన్నారు.

సిద్దిపేటలో 2,88,919 కార్డులు

సిద్దిపేట జిల్లాలో 2,88,919 రేషన్‌ కార్డులున్నాయి. ప్రతి నెలా 5814 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 680రేషన్‌ షాపుల ద్వారా ఆయా గ్రామాల్లోని కార్డుదారులకు అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యాన్ని, ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున అందించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం మూసి వేయడంతో గర్భిణులు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారి ఇండ్ల వద్దకే వెళ్లి పౌష్ఠికాహారం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ విధివిధానాలు రాగానే గ్రామాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మెదక్‌ జిల్లాలో 2,13,789 కార్డులు

మెదక్‌ జిల్లాలో 2,13,789 రేషన్‌ కార్డులుండగా, కుటుంబానికీ రూ.1500 చొప్పున రూ.32,05,93,500 నగదు అందనున్నది. ఒకరికి 12కిలోల చొప్పున జిల్లాలో 9 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం బియ్యం, నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 


logo