శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 23, 2020 , 23:28:15

సకలం బంద్‌

సకలం బంద్‌

 • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌  
 • మూతబడిన దుకాణాలు, వ్యాపార సంస్థలు 
 • రెండోరోజు ఇండ్లకే పరిమితమైన జనం 
 • తెరిచి ఉన్న నిత్యావసరాల దుకాణాలు  
 • ఆర్టీసీ, ప్రైవేటు సర్వీసులు బంద్‌, వెలవెలబోయిన రోడ్లు 
 • రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ 
 • ఉదయం 6 నుంచి 10 వరకు ఇంటికొక్కరికే అనుమతి 
 • నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు
 • కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు మూసివేత

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార,వ్యాణిజ్య సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. సోమవారం ఉదయం దుకాణాలు తెరవగానే కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనేందుకు బారులు తీరారు. అధిక ధరలకు విక్రయించకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. తాజాగా సాయంత్రం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఇండ్లల్లో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలు, మందులు, పాల దుకాణాలు తెరిచిఉంటాయి. ఆ సమయంలో ఇంటికొక్కరే వెళ్లాల్సి ఉంటుంది. అంతకుమించి వెళితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. మెదక్‌ జిల్లాలో కరోనా లక్షణాలున్న ఇద్దరిని సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. జహీరాబాద్‌ వద్ద కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేశారు.  

సంగారెడ్డి ప్రధాన/మెదక్‌/సిద్దిపేట ప్రతినిధులు, నమస్తే తెలంగాణ :  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆదివారం జనతా కర్ఫ్యూను సక్సెస్‌ చేసిన ప్రజలు సోమవారం నుంచి బయట తిరుగడం కనిపించింది. లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించాలన్న సర్కారు నిబంధనలు కఠినతరం చేసింది. అనవసరంగా ఇక మీదట ఎవరూ రోడ్లపైకి రావద్దని, గుంపులుగా కనిపించవద్దని ఆదేశించింది. కేవలం ఒకరు మాత్రమే బైక్‌పై, సొంత కారులో ఇద్దరు మాత్రమే మార్కెట్లు, సమీపంలోని మందులు, ఇతర నిత్యవసరాల కొనుగోలు వెళ్లాలని, ఇతర ప్రైవేట్‌ వాహనాలు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు కూడా ప్రకటించారు. 

ప్రజలంతా ఇండ్లకే పరిమితం 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా నిలిపివేశారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు రొటేషన్‌ పద్ధతిలో మాస్క్‌లు ధరించి ఉ ద్యోగులు విధులు నిర్వర్తించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఇప్పటి వరకు సుమారు 452 మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిని గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పడంతో పాటు అవసరమైన వారిని క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా మండలాల్లోని స్థానిక వైద్యాధికారులతో కలిసి పోలీసులు అనుమానితుల ఇండ్లకు వెళ్లి కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలకేంద్రాలు, కిరాణా దుకాణాలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే 44వ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. సబ్బండ వర్గాలు జనతా కర్ఫ్యూలో పాల్గొని ‘కరోనా’ మహమ్మారిని పారద్రోలుతామని ప్రతినభూనారు. ఉన్నత అధికారులతో కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు.

మెదక్‌లో ఇద్దరు అనుమానితులు

 • గాంధీ దవాఖానకు తరలింపు 
 • డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు వెల్లడి

మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం రాగా, వారిని గాంధీ దవాఖానకు తరలించినట్లు మెదక్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అలాగే,  చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి పరిధి నడిమి గిరిజన తండాకు చెందిన ఓ పెండ్లికి రాజస్థాన్‌ నుంచి నలుగురు వ్యక్తులు రాగా, వారికి క్వారంటైన్‌ స్టాంపులు వేసి ఇంట్లోనే ఉండాలని సూచించారు. అదే విధంగా ఎస్‌.కొండాపూర్‌కు చెందిన వ్యక్తి దుబాయి నుంచి, పాపన్నపేట మండలం గాంధారిపల్లిలో ఒకరు దుబాయి నుంచి రాగా, అధికారుల బృందం ఆయా గ్రామాలకు వెళ్లి స్టాంపులు వేసి, ఇంట్లోనే ఉండాలని వారికి సూచించారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామానికి త్రిపుర నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి స్టాంపు వేశారు. 


logo