మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 22, 2020 , 23:48:13

కరోనాపై ‘జనతా’యుద్ధం

కరోనాపై ‘జనతా’యుద్ధం

సిద్దిపేట జోన్‌ నెట్‌వర్క్‌ : నియోజకవర్గం కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, నారాయణరావుపేట మండలాల్లో జనతా కర్ఫ్యూను ప్రజలు పాటించారు. నియోజకవర్గంలోని అన్ని మారుమూల గ్రామాల్లోను ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిపై దండయాత్ర చేస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్వచ్ఛంధంగా స్వీయ నిర్బంధం పాటించారు. సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు  కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఇండ్లకే పరిమితమైయ్యారు. పోలీసులు ఉదయం 5.30 గంటలకే వీధుల్లోకి వచ్చి తమ విధులను నిర్వర్తించారు. పోలీసులకు పలువురు యువకులు వాటర్‌ బాటిళ్లు, జ్యూస్‌లు, బిస్కెట్లను అందించారు. సాయంత్రం 5 గంటలకు ప్రజలు ఇంటి గేటు ఎదుట  చప్పట్లు కొడుతూ వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. 

విజయవంతమైన జనత కర్ఫ్యూ

సిద్దిపేట అర్బన్‌ :  మందపల్లిలో సర్పంచ్‌ కొమ్మురాజయ్య ఉదయం 5 గంటలకే మైక్‌లో జనత కర్ఫ్యూలో భాగంగా ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు.  ఎన్సాన్‌పల్లిలో  ఫౌల్ట్రీఫాంలో వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తున్న సిబ్బందిని పరీక్షించారు. తడ్కపల్లి, బూరుగుపల్లి, వెల్కటూరు, ఎల్లుపల్లి, నాంచారుపల్లి, బక్రిచెప్యాల తదితర అన్ని గ్రామాల్లో జనత కర్ఫ్యూ విజయవంతమైంది. సిద్దిపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా వస్తున్న వారిని పోలీసులు ఆపి వెనుకకు పంపించారు. 

విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలి 

నంగునూరు : విదేశాల నుంచి వచ్చిన వారు తమ పేరును నమోదు చేసుకొని వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అశోక్‌, నంగునూరు వైద్యాధికారి రాధిక సూచించారు. కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో నంగునూరు మండలంలోని బద్దిపడగ, జేపీ తండా గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు విదేశాల నుంచి ఆదివారం తెల్లవారుజామున వచ్చారని తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకొని వారి వివరాలు సేకరించారు. 15 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.  కార్యక్రమంలో రాజగోపాల్‌పేట పీహెచ్‌సీ వైద్యులు ప్రవీణ్‌, పీహెచ్‌ఎన్‌ సుందరి, హెల్త్‌ సిబ్బంది మహేందర్‌, భాస్కర్‌, సర్పంచ్‌ భిక్షపతినాయక్‌ పాల్గొన్నారు. logo