మంగళవారం 02 జూన్ 2020
Siddipet - Mar 22, 2020 , 23:46:49

జనత.. ఏకత

జనత.. ఏకత

  • జనతా కర్ఫ్యూ విజయవంతం
  • కలిసికట్టుగా కరోనాపై సమరం
  • స్వచ్ఛందంగా ప్రజల స్వీయ నిర్బంధం
  • జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మానుష్యం
  • ఇండ్లకే పరిమితమైన ప్రజానీకం
  • దేవాలయాలు, మసీదులు, చర్చిల మూసివేత
  • ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల నిలిపివేత
  • వైద్యులు, పోలీసులకు చప్పట్లతో కృతజ్ఞతలు

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రజానీకం ఏకమైంది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్నది. మహమ్మారి వైరస్‌పై కలిసికట్టుగా సమరశంఖం పూరించింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించారు. కలెక్టర్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు కృతజ్ఞతగా సాయంత్రం 5 గంటలకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమతమ ఇండ్లలోంచి బయటకొచ్చి, చప్పట్లు కొట్టి, కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల వద్ద జరిగిన కృతజ్ఞతా కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, డీఎంహెచ్‌వో మనోహర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రాజీవ్‌ రహదారి బోసిపోయి కనిపించింది. దుద్దెడ టోల్‌గేట్‌ నిర్మానుష్యంగా మారిపోయింది. కాగా, ఈ నెల 31 వరకు సీఎం కేసీఆర్‌ లాక్‌ డౌన్‌ ప్రకటించారు. ఇదే పద్ధతిని మార్చి 31 వరకు కొనసాగించాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ప్రజలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో తన స్వగృహంలో ఉన్నారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పోలీసులకు కృతజ్ఞతగా సాయంత్రం 5 గంటలకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇండ్లలోంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల వద్ద జరిగిన కృతజ్ఞతా కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, డీఎంహెచ్‌వో మనోహర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నీ వ్యాపార, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, తదితర అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్‌ చేశాయి. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతో పాటు గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల ప్రధాన పట్టణాలతో పాటు ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని ప్రధాన దేవాలయాలైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, వర్గల్‌ సరస్వతీ ఆలయం, సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయాలు, మసీదులు, చర్చిలు అన్నీ మూసి వేశారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఆవరణలో ప్రధాన అర్చకులు నేతృత్వంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని రాత్రి నిర్వహించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఎవరైన రోడ్లపైకి వస్తే వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అత్యవసర పని మీద వచ్చారా.. ఇంకా ఇతర పనుల మీద వచ్చారా.. వారిని వారి ఇండ్లలోకి పంపించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యారు. అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో 5 బస్సులను సిద్ధం చేసి ఉంచారు. ప్రైవేటు వాహనాలు ఏ ఒక్కటి కూడా రోడ్డు పైకి రాలేదు. వారి వారి వాహనాలను వారి ఇంటి ముందే పార్కు చేసి జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రాజీవ్‌ రహదారి బోసిపోయి కనిపించింది. దుద్దెడ టోల్‌గేట్‌ నిర్మానుష్యంగా మారిపోయింది. పోలీసులు నిరంతరం ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి అధికారులు కౌన్సిలింగ్‌ ఇచ్చి హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచారు. 


logo