ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 21, 2020 , 23:02:59

స్వీయ నిర్బంధం

స్వీయ నిర్బంధం

  • నేడు జనతా కర్ఫ్యూ  
  • ఇండ్లలో నుంచి బయటకు రావొద్దు 
  • కరోనాపై రాష్ట్ర సర్కారు సమరభేరి
  • జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్‌ 
  • వ్యాపార, వాణిజ్య సంస్థలు, దేవాలయాలు, మార్కెట్లు బంద్‌ 
  • అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి 
  • కర్ఫ్యూను సక్సెస్‌ చేయండి : మంత్రి హరీశ్‌రావు పిలుపు 
  • జిల్లా కేంద్రంతోపాటు 3 డివిజనల్లో కంట్రోల్‌ రూమ్‌లు
  • కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08457-230000
  • కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వెల్లడి

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగించింది. రాష్ట్రం నుంచి వైరస్‌ తరిమికొట్టేందుకు హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఏ ఒక్కరు కూడా ఇండ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని సూచించింది. నేటి ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవ సరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి మాత్రమే సోకుతున్నందన ఒకరికొకరు దూరంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూం (నెంబర్‌ : 08457-230000)ను సంప్రదించాలని సూచించారు. 

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు నేడు మనమం తా జనతా కర్ఫ్యూలో పాల్గొందాం.. ఎవరికీ వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉం దాం. ఏ ఒక్కరూ కూడా గడప దాటి బయటకు రావొద్దు. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఇంటిలోనే ఉందాం. అత్యవసర పని అయితే తప్పా బయటకు రావొ ద్దు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, దేవాలయాలు, బస్సులు, ఇతరత్రా అన్ని బంద్‌ ఉంటున్నాయి. పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. పిల్లలు, వృద్ధులను బయటకు రానివ్వొద్దు.కరోనా మహమ్మారికి ఎలాంటి మందులు లేవు. దానిని తరిమికొట్టే మందు మన చేతులోనే ఉంది. కరోనా వైరస్‌పై జిల్లా అధికార యంత్రాం గం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, ఇతర అధికారులకు కృతజ్ఞతగా నేటి సాయంత్రం 5 గంటలకు ప్రజలు వారి ఇంటి గేటు వద్దకు వచ్చి చప్పట్లు కొట్టాలి. యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. ఫలితంగా ప్రజల్లో అవగాహన వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నా రు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చే శారు. విదేశాల నుంచి ఈ మధ్య కాలంలో ఎవరెవరు వచ్చారనే అనే వివరాలు సేకరించారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 192 మంది దుబాయ్‌, ఇతర దేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీరిలో 139 మంది 14 రోజులలోపు విదేశాల నుంచి వచ్చిన వారిగా గుర్తించి వారిని హౌస్‌ క్వారంటైన్‌లో ఉంచారు. ఇద్దరికీ ల క్షణాలు ఉన్నాయనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా ఒకరికి నెగెటివ్‌ రాగా, మరొకరి రిపోర్టు రావాల్సి ఉంది. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతో పాటు మూడు డివిజన్‌ కేంద్రాల్లో జిల్లా స్థాయి అధికారులతో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్‌ కేంద్రాల్లో ఈ కంట్రోల్‌ రూంలు పనిచేయనున్నాయి. కలెక్టరేట్‌లో ఇద్దరు అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామ్మిల్‌ఖాన్‌, సిద్దిపేటలో డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, గజ్వేల్‌లో డీపీవో సురేశ్‌బాబు, హుస్నాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చరణ్‌దాస్‌ కంట్రోల్‌ రూంలను పర్యవేక్షించనున్నారు. ప్రతి రోజు మండల స్థాయిలోని అధికారులతో వీడియో, టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి వివరాలు సేకరిస్తారు. 

గ్రామ స్థాయిలో సర్వే 

ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు ఎవరెవరు వచ్చారు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో గ్రామ స్థాయిలో సర్వే చేపడుతున్నారు. ఈ సర్వే లో స్థానిక ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు సర్వే చేపట్టి వారికి ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్‌లో వివరాలను పొందుపరుస్తారు. ముఖ్యంగా దుబాయ్‌, గల్ఫ్‌, ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలు తీసుకుంటారు. సర్వేలో భాగంగా అనారోగ్యంగా ఎవరైనా ఉంటే వారు ఎన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ గృహ నిర్బంధంలో ఉండేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ప్రతి కేసుకు ఒక అధికారిని నియమించి ఆ వ్యక్తి పూర్తి వివరాలు రోజు వారీగా సేకరించి అతని ఆరోగ్య పరిస్థితిని జిల్లా అధికారులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ దవాఖానల్లో ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. 

ఏ ఒక్కరూ గడప దాటొద్దు 

జనతా కర్ఫ్యూలో భాగంగా ఏ ఒక్కరూ కూడా గడప దాటొద్దు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణి జ్య సంస్థలు, బస్సులు అన్ని బంద్‌ ఉంటున్నా యి. ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో ప్రజలు రోడ్లపైన ఎక్కడా చూసిన మాస్క్‌లు ధరించి కనిపిస్తున్నారు. దేవాలయాలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, పర్యాటక ప్రాంతాలు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇతరత్రా అన్నీ కూడా మూసే ఉంటా యి. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా మహమ్మారిని తరిమికొడుదాం. 

కరోనాను జయిద్దాం 

జనతా కర్ఫ్యూను 24 గంటల పాటు పాటిద్దాం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం సాగించి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం. సీఎం కేసీఆర్‌ పిలుపుతో ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంటిలోనే గడిపి, సమాజానికి సేవ చేద్దాం. స్వీయ నియంత్రణతో కరోనా వైరస్‌ అడ్డుకోవచ్చు. కరోనా వైరస్‌ విజృంభణను అడ్డుకోవడానికి మనమందరం బాధ్యతగా స్వీయ నియంత్రణ పాటిద్దాం. సీఎం కేసీఆర్‌ నిరంతరం సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే వైరస్‌ను అరికట్టగలం. నిత్యం సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రపర్చుకోవాలి. విదేశాల నుంచి వచ్చే వారి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడం మనందరి బాధ్యత. ప్రజలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ వారి వారి పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి.

- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 


logo