బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 21, 2020 , 00:15:15

స్టీల్‌ సంకల్పం

స్టీల్‌ సంకల్పం

  • సిద్దిపేటలో ప్లాస్టిక్‌పై ఉద్యమం 
  • ప్లాస్టిక్‌ వస్తువుల నియంత్రణకు స్టీల్‌బ్యాంక్‌లు 
  • నామమాత్ర ధరకు కిరాయికి ఇచ్చేలా ఏర్పాట్లు 
  • తొలుత 1, 22 వార్డుల్లో,  క్రమంగా అన్ని వార్డుల్లో అమలు 
  • మంత్రి హరీశ్‌రావు చొరవతో ప్రజల్లో మార్పు 

పలు వినూత్న కార్యక్రమాలకు వేదికైన సిద్దిపేటలో ప్లాస్టిక్‌పై ఉద్యమం మొదలైంది. వివాహాలు, విందులు, వినోదాలు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ వస్తువులకు బదులు స్టీల్‌ పాత్రలు వాడేలా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో రెండు వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు. మంత్రి సొంత ఖర్చుతో తొలుత 1, 22 వార్డుల్లో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకుల్లోని వస్తువులను నామమాత్రపు ధరకు కిరాయికిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల వారికి అప్పగించారు. ఒక్కో బ్యాంకులో 1000 ప్లేట్లు, 500 గ్లాసులు, 250 టీ గ్లాసులు, 20 బేసిన్‌ తట్టలు, 15 బకెట్లు, 15 జగ్గులు, సరిపడా గంటెలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రెండు వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు కాగా, మిగిలిన 32 వార్డుల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్‌ మనిషి నిత్య జీవితంలో ఒక భాగమై ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేయడం కోసం వినియోగించే ముడిపదార్థాలలో  క్యాన్సర్‌ కలుగజేసే పదార్థాలుంటాయి. దీంతో ప్లాస్టిక్‌ వాడకంతో క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్‌ సంచులు భూమిలో కరిగిపోకుండా  పర్యావరణానికి ముప్పులా మారింది.  దీనిని నివారించటమే లక్ష్యంగా పెండ్లిలు ఇతర శుభ కార్యాలలో ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులకు బదులు స్టీల్‌ పాత్రలను వాడాలనే ఉద్దేశంతో స్టీల్‌ పాత్రలతో కూడిన స్టీల్‌ బ్యాంక్‌ను సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేయనున్నారు. ముందుగా పైలట్‌ ప్రాజెక్టు కింద 1, 22 వ వార్డుల్లో మంత్రి హరీశ్‌రావు స్వయంగా స్టీల్‌ పాత్రలను కొని ఇచ్చారు. శుభకార్యాలకు  స్టీల్‌ సామగ్రిని అద్దెకు ఇవ్వటం ద్వారా వాటిని వాడేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారనే లక్ష్యంతో స్టీల్‌బ్యాంక్‌లను ఏర్పాటు చేయడం కాకుండా స్టీల్‌ బ్యాంక్‌ల గురించి మంత్రి హరీశ్‌రావు ప్రతి సమావేశంలో ప్రజలకు వివరిస్తున్నారు. మిగతా 32 వార్డుల్లో 45రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు.

 స్టీల్‌ బ్యాంకుల్లో పాత్రలు...

వార్డుల్లో ఏర్పాటు చేసే స్టీల్‌ బ్యాంక్‌లలో 1000 ప్లేట్ల్లు, 500 గ్లాసులు, 250 టీ గ్లాసులు, ఇరువై బేసిన్‌ తట్టలు, పదిహేను బకెట్లు, పదిహేను జెగ్గులు, శుభాకార్యాలకు సరిపోను గంటెలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ భాద్యతను స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల వారికి అప్పగించనున్నారు. నామమాత్రపు ధరకు వీటిని ప్రజలకు అందించనున్నారు.

ప్లాస్టిక్‌ నియంత్రణకు అవకాశం..

ప్లాస్టిక్‌ వస్తువులను నియంత్రణ చేయాలనే లక్ష్యంతో 1వ వార్డులో మంత్రి హరీశ్‌రావు సహకారంతో మొదటి సారిగా స్టీల్‌బ్యాంకును ఏర్పాటు చేయడం సంతోషకరం. ఏర్పాటు చేసిన స్టీల్‌బ్యాంకులోని పాత్రలను ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా అద్దెకు ఇచ్చాం. పెండ్లిల్లు, శుభకార్యాలకు వార్డులో వినియోగంలోకి తీసుకువస్తాం. ప్లాస్టిక్‌ నివారణ కోసం కృషిచేస్తాం. 

- బర్ల మల్లికార్జున్‌ (కౌన్సిలర్‌ 1వ, వార్డు) 


logo