ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 21, 2020 , 00:05:25

పండుగల గృహప్రవేశాలు

పండుగల గృహప్రవేశాలు

  • కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో పండుగ వాతావరణం 
  • 260 ఇండ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు 
  • కొత్త ఇండ్లను చూసి మురిసిపోయిన నిర్వాసితులు 
  • ప్రభుత్వం అండగా నిలిచిన తీరుపై హర్షం
  • ఖాళీ అవుతున్న బైలాంపూర్‌, మామిడ్యాల గ్రామాలు 

ములుగు: ప్రాజెక్టు నిర్మాణంలో ఊరుపోయిందన్న బాధ ఉన్నా.. అంతకుమించిన వసతులతో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో పండుగ వాతావరణంలో నిర్వాసితులు గృహ ప్రవేశాలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా భూ ములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలిచిన న్యాయమైన నష్ట పరిహారంతో పాటు ములుగు మండల పరిధిలోని తునికిబొల్లారంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తమ కొత్త కాలనీని, కల్పించిన సౌకర్యాలను చూసి నిర్వాసితులు మురిసిపోయారు. ప్రభుత్వం అండగా నిలిచిన తీరుపై సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల కంటే సీఎం కేసీఆర్‌ నిర్మించిన ఇచ్చిన నూతన కాలనీ ఎంతో బాగున్నదని కితాబునిస్తూ తమ కొత్త గ్రామానికి ‘కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ’గా ముఖ్యమంత్రి పేరును నామకరణం చేసుకున్నారు. శుక్రవారం భైలాంపూర్‌, మామిడ్యాల గ్రామాలకు చెందిన 260మంది సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. గృహ ప్రవేశాలకు హాజరైన అధికారులకు, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులు ఘనస్వాగతం పలికారు. మామిడ్యాల, తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా, భైలాంపూర్‌ గ్రామాలకు చెందిన సుమారు 910మంది తమ గ్రామాలను ఖాళీ చేసి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా గృహ ప్రవేశాలు చేసిన ప్రతి ఇంటిని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి సందర్శించి లబ్ధిదారులను పలుకరించారు. నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని నిర్మించి అందులో హైస్కూల్‌, దుకాణ సముదాయాలు, అంగన్వాడీ కేంద్రాలు, వర్గాల వారీగా దేవాలయాల నిర్మాణాలను చేపట్టింది. కాగా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకున్న నిర్వాసితులు తమ గ్రామాలను ఖాళీ చేసి సామగ్రిని తరలిస్తున్నారు.

 సకల వసతులతో కాలనీ ఏర్పాటు చేశాం..

ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు గౌరవంగా జీవించేలా దేశంలోనే ఆదర్శంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సకల వసతులను కల్పించిందని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నిర్వాసితుల గృహ ప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నిరుపేదలు గౌరవంగా బతుకాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని అన్నారు. కాలనీలో నివసించే ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి మౌలిక వసుతులు కల్పించామని తెలిపారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలకు సాగునీరు అందించడం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. మరోవారం రోజుల్లో కొండపోచమ్మ రిజర్వాయర్‌కు కాళేశ్వరం జలాలను తరలించేందుకు కసరత్తు  ముమ్మరం చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించిన నిర్వాసిత కుటుంబాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యాదగిరిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటనర్సింలు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దుంబాల లింగారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


logo