శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Mar 18, 2020 , 22:19:33

స్వచ్ఛందంగా ఖాళీ

స్వచ్ఛందంగా ఖాళీ

  • స్వతహాగా ఇండ్లు ఖాళీ చేస్తున్న నిర్వాసిత కుటుంబాలు
  • కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకుంటున్న గ్రామస్తులు
  • బైలాంపూర్‌, మామిడ్యాలలో 200 డీసీఎంలు ఏర్పాటు
  • కొత్త ఇండ్లు బాగున్నాయని కితాబు 
  • నీళ్లు వస్తున్నాయంటే ఇండ్లు పోయిన బాధ లేదు..
  • సీఎం కేసీఆర్‌ సంకల్పం గొప్పదన్న నిర్వాసితులు  
  • నేడు మరిన్ని కుటుంబాలు ఖాళీ
  • స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌, ఆర్డీవో 

‘భూములు, ఇండ్లు పోతున్నయంటే భయమైంది. ఊరు వదిలి పోవాలంటే ఎట్లనో ఉండే. నీళ్లు వస్తున్నాయంటే ఊరి పోయిన బాధ పోయింది. పంటలు పండించుకోవచ్చు. సీఎం కేసీఆర్‌ సారు మమ్ముల్ని మంచిగా చూసుకుంటున్నడు. ఇండ్లకు, భూములకు పైసలిచ్చిండ్రు. కొత్తగా కట్టిన ఇండ్లు మస్తున్నయి. అన్ని సౌలత్‌లు కల్పించిన్రు. ఇంతకంటే ఏం కావాలె’ అని కొండపోచమ్మ జలాశయం ముంపునకు గురవుతున్న బైలాంపూర్‌, మామిడ్యాల గ్రామస్తులు పేర్కొన్నారు. త్వరలో కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు రానుండడంతో నిర్వాసితులు స్వచ్ఛందంగా ములుగు మండలం తునికిబొల్లారంలో నిర్మించిన ‘కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ’కి తరలుతున్నారు. బుధవారం రెండు గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలు నూతన ఇండ్లకు వెళ్లాయి. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డితోపాటు రెవెన్యూ అధికారులు కాలనీలో ఇండ్ల కేటాయింపుతోపాటు ఇతర సౌకర్యాలు పర్యవేక్షించారు. గురువారం మరో 200 పైగా కుటుంబాలు ఖాళీ కానున్నాయి. 

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : కొండపోచమ్మ రిజర్వాయర్‌ ముంపు గ్రామాలు బైలాంపూర్‌, మామిడ్యాల గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు బుధవారం తమ సామగ్రి సదురుకొని, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలివెళ్లారు. మూడు రోజులుగా ఆయా కుటుంబాలు కాలనీలో ఇండ్లు ఎంపిక చేసుకొని గృహ ప్రవేశాలు చేసిన విషయం తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి త్వరలో గోదావరి నీళ్లు తరలించడం కోసం ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో ముంపు గ్రామాల ఖాళీ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే తానేదార్‌పల్లి తండ గ్రామాలకు చెందిన కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ తరలివెళ్లారు. మామిడ్యాల, బైలాంపూర్‌ గ్రామాస్తులు కూడా తమ గ్రామాలను ఖాళీ చేసే పనుల్లో ఉన్నారు. బుధవారం బైలాంపూర్‌లో 20 డీసీఎంలు, మామిడ్యాలలో 19 డీసీఎంతో ఆయా కుటుంబాలు తమ సామగ్రిని సదురుకొని, ఇండ్లు ఖాళీ చేసి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలివెళ్లారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఆర్డీవో విజయేందర్‌తో పాటు రెవెన్యూ అధికారులు కాలనీలో ఇండ్ల కేటాయింపులు ఇతర సౌకర్యాలను పర్యవేక్షించారు. కొత్తగా ఇండ్లలోకి వస్తున్న ముంపు గ్రామాల కుటుంబాలకు అధికారులు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే విద్యుత్‌, నల్లా, డ్రైనేజీ, రోడ్ల సౌకర్యాలన్ని పూర్తి కాగా ముంపు గ్రామాల కుటుంబాలు నేరుగా ఇండ్లలో చేరుతున్నారు.

నేడు మరిన్ని కుటుంబాలు..

బైలాంపూర్‌, మామిడ్యాల గ్రామాలకు చెందిన 200లకు పైగా కుటుంబాలు గురువారం తమ ఇండ్లను ఖాళీ చేయనున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికే కొంత మంది ఖాళీ చేసినట్లు తాము కూడా ఖాళీ చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్‌ తమకు అందించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ బాగుందని, అలాగే గ్రామంలోని ఇండ్లకు ఇతర స్థిర, చర ఆస్తులకు పరిహారం అందిందని తెలిపారు. గ్రామాల్లోని అన్ని ఇండ్ల కుటుంబాలు రెండు, మూడు రోజుల్లో ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, గురువారం బైలాంపూర్‌కు 100, మామిడ్యాలకు 100 డీసీఎంలు ఇండ్ల సామాన్ల తరలింపునకు ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

రైతుల దేవాలయం కొండపోచమ్మ.. 

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా అనేక జిల్లాల బీడు భూములు సస్యశ్యామలం అవుతాయి. సీఎం కేసీఆర్‌ ఈ గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం సాహసోపేతమైన సంకల్పం. తమ గ్రామాలు ముంపు గురైన రైతుల కోసం త్యాగం చేశామన్న ఆనందం మాకుంది. మా గ్రామస్తులకు సీఎం కేసీఆర్‌ అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే అన్ని సౌకర్యాలను సమకూర్చారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ గొప్ప రైతు దేవాలయంగా మారుతుంది. 

- మధుసూదన్‌రెడ్డి, బైలాంపూర్‌ 

కాలనీ బాగుంది..

కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ బాగుంది. విశాలమైన రోడు,్ల అన్ని సౌకర్యాలు కల్పించారు. విశాలమైన విస్తీర్ణం ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఏ ఊరికి ఆ ఊరు ఇండ్లు కేటాయించడం బాగుంది. గ్రామాల్లోని ఇండ్లన్ని స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ మాకు అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ త్వరగా నిండాలని కోరుకుంటున్నాం. 

- దుంబాల లింగారెడ్డి, ఎంపీటీసీ, బైలాంపూర్‌

ఇండ్లు ఖాళీ చేస్తున్నాం..

మా ఇంటిని ఖాళీ చేసి కొత్త కాలనీకి పోతున్నాం. సామాన్లు అంతా సదురుకున్నాం. డీసీఎంలో పెట్టుకొని కొత్త ఇంటిలోకి జారేసుకున్నాం. కాలనీ బాగుంది. అందరూ మళ్లీ ఒక్క దగ్గర ఉండడం మంచిగానిపిస్తుంది. మా ఊరు ముంపు గురైన మేమందరం మళ్లీ ఒకే వద్ద కలిసి ఉంటాం. సీఎం కేసీఆర్‌ కాలనీలో అన్ని సౌకర్యాలు చేయించిండు.

- యంజాల లక్ష్మి, బైలాంపూర్‌


logo