గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 16, 2020 , 23:36:00

కల్యాణ వైభోగమే

కల్యాణ వైభోగమే
  • నేత్రపర్వంగా నరసింహుడి లగ్గం
  • వేడుకను చూసేందుకు తరలివచ్చిన భక్తులు
  • ధగధగలాడిన నాచగిరి క్షేత్రం
  • పట్టువస్ర్తాలు సమర్పించిన వంటేరు
  • నేడు హంసవాహనంపై ఊరేగింపు

వర్గల్‌: నాచగరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. లక్ష్మీసమేత నృసింహుడి లగ్నమహోత్సవంతో భక్తజనం పులకించింది. పచ్చటి తోరణాలు, పూలహారాలతో దేవతామూర్తుల మండపం దేదీప్యమానంగా మారింది. నాచగిరీశుడి నామస్మర, కరతాళ ధ్వనులతో విజయాచలకొండ మార్మోగింది. స్వామివారికి ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు.

కాంతులమయం.. శ్వేతగిరిక్షేత్రం

లక్ష్మీనరసింహస్వామి కల్యాణం సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి కట్ట సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ ధగధగలాడేలా విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. శంకు, చక్రాలతో సహా పలు అవతారాలలో కొలువుదీరిన దేవతాప్రతిమలు ఏర్పాటు చేశారు.

వేదపారాయణం.. పాపహరణం..

లక్ష్మీనరసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం ఆలయంలో స్వామివారి మేలుకొల్పుతో ప్రత్యేక పూజలు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్ర్తోక్తంగా ఆరంభమయ్యాయి. వేదపండితుల లక్ష్మీనరసింహస్వామి వేద పఠనం సర్వపాపహరణంగా తలపించింది. విశేష అభిషేకాలు, స్వస్తిపుణ్యహవచనం, బలిహరణ, ఆరగింపు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించారు. లక్ష్మీసమేత నరసింహస్వామిని వాహన సేవలో ఊరేగింపుగా కల్యాణ వేదికపై అధిష్ఠించారు.

నేడు హంసవాహనంపై ఊరేగింపు

నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు మంగళవారం రాత్రి నూతన లక్ష్మీసమేత నరసింహస్వామి వార్లను తొలివాహన సేవగా హంసవాహనంపై పురవీధుల్లో ఊరేగించనున్నారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.


logo