గురువారం 04 జూన్ 2020
Siddipet - Mar 16, 2020 , 23:16:05

నీటి బొట్టు ఒడిసి పట్టు

నీటి బొట్టు ఒడిసి పట్టు

నీళ్లుంటేనే ప్రగతి. వాటితోనే ఆర్థికాభివృద్ధి. దీని ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. ప్రాజెక్టులతోపాటు వాగుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నచోట చెక్‌డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ చెక్‌డ్యాంలను నిర్మించవచ్చో అని సర్వే నిర్వహించారు. సర్వే ఆధారంగా పెద్దపెద్ద వాగులపై 39 చోట్ల చెక్‌డ్యామ్‌లను నిర్మించ వచ్చని గుర్తించి సర్వే సారాంశాన్ని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో తొలివిడుతలో 18 చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.101.09 కోట్లు నాబార్డు నిధులను మంజూరు చేసింది. వీటివల్ల సుమారు 6,398 ఎకరాలు సాగులోకి రానున్నాయి. హుస్నాబాద్‌ ప్రాంతంలో చెక్‌డ్యాంల నిర్మాణం ప్రారంభం కాగా, మిగతాచోట్ల అగ్రిమెంట్లు, టెండర్లు, వివిధ దశల్లో ఉన్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా ఇప్పటికే నాలుగు విడుతల్లో చెరువులను పునరుద్ధరించడంతో నీటి సామర్థ్యం భారీగా పెరగడంతోపాటు భూగర్భజలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. జిల్లావ్యాప్తంగా 3484 చెరువులను పునరుద్ధరించారు.

  • విరివిగా చెక్‌డ్యాంలు నిర్మించాలని నిర్ణయం
  • వాగులపై 39 చోట్ల నిర్మించవచ్చని నిర్దారణ
  • తొలివిడుతలో 18 చెక్‌డ్యాంలకు రూ.101.09 కోట్లు
  • నాబార్డు నిధులతో నిర్మాణం..వివిధ దశల్లో పనులు
  • వీటి కింద 6,398 ఎకరాల ఆయకట్టు
  • ఇప్పటికే మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ
  • భారీగా పెరిగిన భూగర్భజలాలు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రస్తుతం ఉన్న వాతావరణ, సహజవనరులపై ఉన్న ఒత్తిడిలో జలం, జలవనరుల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రభుత్వం తమ భౌగోళిక ప్రాంతంలో కురిసే వానతో వచ్చే నీటిని, ఆయకట్టు ద్వారా వచ్చే రీజనరేషన్‌ జలాలను ఒడిసి పట్టి, సంరక్షించి, లక్షల ఎకరాల మాగాణి చేసేందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో భారీ ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులతో పాటు వాగులు, వంకలపై చెక్‌డ్యాంలు నిర్మించాలని తలపెట్టింది. జిల్లాలో ప్రధానమైన అక్కెనపల్లి పెద్దవాగు, మోయతుమ్మెద వాగు, సిద్దిపేట వాగు, కుడ్లేరు వాగు, నక్కవాగు, దొమ్మాటవాగు తదితర వాగులున్నవి. ఈ వాగులపై చెక్‌డ్యాల నిర్మాణానికి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 4 నుంచి 8వ ఆర్డర్‌ వాగులపై 39 చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించవచ్చని నిర్ధారించింది. తొలి విడుతో రూ.101.09 కోట్లతో 18 చెక్‌డ్యాంలను నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మిగతావి త్వరలోనే మంజూరు కానున్నాయి. ఈ చెక్‌డ్యాంలను తొలుత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలని తలపెట్టారు. తాజాగా నాబార్డు నిధుల ద్వారా నిర్మాణాలను చేపడుతున్నారు. 18 చెక్‌డ్యాంల కింద 6,398 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. సిద్దిపేట నియోజకవర్గంలోని అక్కెనపల్లి పెద్ద వాగు, సిద్దిపేట వాగుపై నాలుగు చెక్‌డ్యాంలను, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్లమ్మ వాగు, మోయతుమ్మెద వాగులపై 8, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలోని మోయతుమ్మెద, పిల్లివాగులపై 3, గజ్వేల్‌ నియోజకవర్గంలోని జగదేవ్‌పూరు మండలంలో ఇటిక్యాల వద్ద కుడ్లేరువాగుపై 1, దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మోతె వద్ద కుడ్లేరు వాగుపై 1, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల మండలంలోని దొమ్మాట వాగుపై కొత్త దొమ్మాట వద్ద 1 చెక్‌డ్యాం నిర్మించనున్నారు. రెండో దశలో మిగిలిన చెక్‌డ్యాంలకు నిధులు త్వరలోనే మంజూరు కానున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో హుస్నాబాద్‌లో చెక్‌డ్యాం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చోట్ల పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువలును పునరుద్ధరణ చేపట్టడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 3484 చెరువులను పునరుద్ధరించారు. దీని కింద లక్షా 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 100 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు జిల్లాలో 225 ఉన్నాయి. శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు కింద 5,100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవలనే సుమారు రూ.22 కోట్ల పనులు చేపట్టారు.

తొలి విడుతలో రూ.101.09 కోట్లు

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని ప్రధానమైన వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు తొలివిడుతగా రూ. 101.09 కోట్లను మంజూరయ్యాయి. ఈ నిధులతో 18 చెక్‌డ్యాంలను నిర్మించనున్నాం. త్వరలోనే మరిన్ని చెక్‌డ్యాలంకు నిధులు మంజూరు కానున్నాయి. మిషన్‌ కాకతీయ ద్వారా జిల్లాలోని చెరువులను పునరుద్ధరణ చేసుకోవడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఆ ఫలితాలు రైతులకు అందుతున్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి చెరువు, కుంటను, చెక్‌డ్యాంను నింపుతాం.

- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

తొలి విడుత 18 చెక్‌డ్యాంలు 

జిల్లాలో 4 నుంచి 8వ ఆర్డర్‌ వాగులపై 39 చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించవచ్చని నిర్ధారించాం. ఆయా వాగులపై ఎక్కడెక్కడ నిర్మాణం చేపట్టవచ్చో సర్వే నిర్వహించి, గుర్తించాం. జిల్లాలో 39 చెక్‌డ్యాంలకు గాను 18 తొలి విడుతలో మంజూరయ్యాయి. హుస్నాబాద్‌లో చెక్‌డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగతావి అగ్రిమెంట్లు, టెండర్లు వివిధ దశల్లో ఉన్నాయి.

- వీ శ్రీనివాస్‌, ఈఈ, నీటి పారుదల శాఖ


logo