గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Mar 15, 2020 , 02:11:59

నేత్రపర్వం

నేత్రపర్వం

నాచగిరి లక్ష్మీనర్సింహుడి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శనివారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. నాచగిరి శ్రీక్షేత్ర పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామితో కలిసి ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ధ్వజారోహణం ఘట్టం జరగనున్నది.

  • నృసింహుడి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • నేడు ధ్వజారోహణం
  • రేపు దేవతామూర్తుల కల్యాణం

వర్గల్‌: రాష్ట్రంలోనే రెండో యాదాద్రిగా పేరుగాంచిన నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి చేతుల మీదుగా లక్ష్మీసమేత ఉత్సవ మూర్తులకు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణామాచార్యుల నేతృత్వంలో వేద పండితులు పూజాక్రతువులు జరిపారు. ఉత్సవాల ప్రారంభ పూజలో ముఖ్యఅతిథిగా నాచగిరి శ్రీక్షేత్రపీఠాధిపతి శ్రీ మధుసూదనానందసరస్వతీస్వామి హాజరయ్యారు.


నిత్య పూజలు.. నివేదనలు

నాచగిరి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఉదయమే లక్ష్మీసమేత దేవతామూర్తుల మేలుకొల్పుతో పూజాధిక్రతువులు ఆరంభమయ్యాయి. స్వస్తి పుణ్యాహవచనం, మృత్యంగ్రణం, నీరాజనం, మంత్రపుష్పం, చంద్రహవనోత్సవపేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీక్షేత్ర పీఠాధిపతి మధుసూదనానందసరస్వతీస్వామి పాల్గొన్నారు.


నేడు ధ్వజారోహణం.. రేపు కల్యాణం

సోమవారం రాత్రి నాచగిరి లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. వివాహ తంతును పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ధ్వజారోహణం ఘట్టం నిర్వహించన్నుట్లు ఆలయవర్గాలు తెలిపాయి. సమస్త దేవతలకు కల్యాణ ఆహ్వానం పంపే ప్రక్రియనే ధ్వజారోహణం అంటారని వేద పండితులు ఉద్ఘాటించారు.


logo