సోమవారం 25 మే 2020
Siddipet - Mar 15, 2020 , 02:07:00

కాళేశ్వర గంగ పరుగు పెట్టంగా..

కాళేశ్వర గంగ పరుగు పెట్టంగా..

బీడుభూములను పచ్చని పైర్లుగా మార్చే గోదారమ్మ అన్నపూర్ణ జలాశయంలోకి పరుగులు పెడుతున్నది. సిద్దిపేట-రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో నిర్మించిన ఈ జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. బుధ, గురువారాల్లో 1వ మోటరు ద్వారా నీటిని ఎత్తిపోయగా, శనివారం తెల్లవారుజామున 4వ మోటరు వెట్న్‌ చేసి నీటిని ఎత్తిపోశారు. నాల్గవ పంపు వెట్న్‌ దిగ్విజయం కావడం, 1వ పంపు విజయవంతంగా నడుస్తుండడంపై కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్‌, ఎస్‌ఈ ఆనంద్‌, సలహాదారు పెంటారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన 2,3వ మోటర్లను ఒకట్రెండు రోజుల్లో రన్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. రెండు మోటర్ల సాయంతో నీటిని ఎత్తిపోస్తుండడంతో అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. జలాశయాన్ని తిలకిం చేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

  • అన్నపూర్ణ జలాశయంలోకి గోదావరి పరవళ్లు
  • క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
  • 4వ పంపు వెట్న్‌ విజయవంతం
  • నడుస్తున్న ఒకటవ, నాల్గవ పంపులు
  • ఎత్తిపోతలను పరిశీలించిన ఈఎన్సీ హరిరామ్‌, ఎస్‌ఈ ఆనంద్‌, ఉన్నతాధికారులు
  • నీటిని చూసి మురిసిపోతున్న అన్నదాతలు
  • అన్నపూర్ణ నిండిన వెంటనే రంగనాయకసాగర్‌కు..

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదారమ్మ పరుగులు పెడుతున్నది. రోజురోజుకు రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతున్నది. శనివారం తెల్లవారుజామున నాల్గో పంపు వెట్న్‌ విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద నిర్మించిన సర్జిపూల్‌(మహాబావి) వద్ద నాల్గో పంపును రన్‌ చేశారు. వెట్న్‌ విజయవంతం కావడంతో ఈఎన్సీ హరిరామ్‌, ఎస్‌ఈ ఆనంద్‌, లిప్టు ఇరిగేషన్‌ అడ్వయిజర్‌ పెంటారెడ్డి ఇతర అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి 11 గంటల వరకు నాల్గో పంపును రన్‌ చేశారు. ఉదయం 11 గంటల నుంచి ఒకటో పంపు నడుస్తున్నది. దీంతో క్రమక్రమంగా అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతున్నది. మిగిలిన రెండు, మూడు పంపులను ఒకటి రెండు రోజుల్లో రన్‌ చేసేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఒక పంపు నుంచి 2828 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక పంపు నిరంతరాయంగా నాలుగు రోజుల పాటు నడిస్తే ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తుంది. కాగా, త్వరలోనే రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు. ఈ రిజర్వాయర్‌ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనంతగిరి, సిద్దిపేట జిల్లాలోని కొచ్చగుట్టపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల వారికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని నిర్మించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట శివారులో కొచ్చగుట్టపల్లి గ్రామస్తులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించారు. ఈ గ్రామంలో మొత్తం 104 కుటుంబాలుండగా, ఇప్పటికే 66 మంది కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి వచ్చి చేరాయి. మిగతా వారు ఒకటి రెండు రోజుల్లో ఖాళీ చేసి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకోనున్నారు.


అన్నదాతల్లో హర్షాతిరేకాలు 

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు వచ్చి చేరుతుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఎక్కడో పుట్టిన గోదావరి జలాలు 490 మీటర్ల ఎత్తులో ఉన్న రిజర్వాయర్‌లోకి గలగల వస్తుంటే రైతన్నలు సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చేసిన కృషి ఇవాళ రైతుల కండ్ల ముందు కనబడుతున్నది. బీడువారిన పొలాలను పచ్చని పంటలతో కళకళలాడే రోజులొచ్చాయని రైతులు ఆనందపడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తండోపతండాలుగా రిజర్వాయర్‌కు వచ్చి గోదావరి జలాలు తిలకిస్తున్నారు. ఏండ్ల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు రైతాంగం కృతజ్ఞతలు తెలుపుతున్నది.


గోదావరి నీళ్లను చూస్తామనుకోలె..

గోదావరి నీళ్లను మా దగ్గర చూస్తామనుకోలె. గోదావరి నీళ్లు మా గ్రామానికి రావడం సంతోషంగా ఉంది. భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగ పండుతయి. యాడన్నో ఉండే గోదారి తల్లి మా దగ్గరకు వస్తున్నది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం.

- బొంతల రాజిరెడ్డి, రైతు, గుండారం, బెజ్జంకి మండలం


కేసీఆర్‌ సార్‌కు  మేం రుణపడి ఉంటాం..

మా గ్రామానికి గోదావరమ్మను తెచ్చిన సీఎం కేసీఆర్‌ సార్‌కు మేం రుణపడి ఉంటాం. కాలువ కింద మా ఎనిమిదెకరాల పొలం పారుద్ది. నీళ్లు లేక ఇన్ని రోజులు అరిగోస పడ్డాం. మాది గడ్డ భూములుకావడంతో నీళ్లు లేవు. మాకు నీళ్లియ్యడం సంతోషంగా ఉంది.

- గాజర్ల రత్నయ్య, రైతు, గుండారం, బెజ్జంకి మండలం


నీళ్లందడం సంతోషమైతాంది..

అన్నపూర్ణ ప్రాజెక్ట్‌ పారుకం కాలువ కింది నాకు రెండు ఎకరాల భూమి ఉంది. నీళ్లు లేక సరిగా పంటలు పండలె.. ఇప్పుడు మా భూమిపోంటే కాలువ పొయి, మాకు సాగు నీళ్లు రానున్నాయి. నీళ్లు మా చెరువులోకి వస్తున్నాయని చెపుతుంటే సంతోషంగా ఉంది. ఇగ నీళ్లొస్తే మా జాగలో బంగారం పండిస్తాం. మెట్ట భూములకు సాగు నీరు ఇచ్చిన ప్రభుత్వాని కృతజ్ఞతలు.

- బోనగిరి లచ్చవ్వ, రైతు, బెజ్జంకి


logo