శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Mar 13, 2020 , 00:04:09

సిద్దిపేటకు సొబగులు

సిద్దిపేటకు సొబగులు
  • కొత్త అందాలతో చౌరస్తాలు ముస్తాబు
  • కనువిందు చేయనున్న పట్టణ జంక్షన్లు
  • ముమ్మరంగా సుందరీకరణ పనులు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : జిల్లాకేంద్రం సిద్దిపేట పట్టణంలోని జంక్షన్లు నూతన అందాలు సంతరించుకుంటున్నా యి. చౌరస్తాలను  ముస్తాబు చేసి పట్టణాన్ని మరింత సుందరంగా తయారు చేసేందుకు సిద్దిపేట పట్టణాభివృద్ధ్ది సంస్థ (సుడా) ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టణంలో మొత్తం 8 చౌరస్తాలను సుందరీకరించాలని సుడా ప్రతిపాదనలు తయారు చేసింది. అందులో భాగంగా మొదటగా బీజేఆర్‌ చౌరస్తా, ముస్తాబాద్‌ చౌరస్తా, ఎక్బాల్‌ మినార్‌ ఈగల్‌ స్టాచ్యులకు అందాలను అద్దుతున్నారు.  


 సిద్దిపేటను అందంగా ముస్తాబు చేసి ఆహ్లాదకరమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్న మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా.. మున్సిపాలిటీ, సుడాలు పట్టణాన్ని సుందరీకరిస్తున్నాయి. ఇప్పటికే పట్టణంలోని పాత బస్టాండ్‌ నుంచి హైదారాబాద్‌ రోడ్డు, మెదక్‌  రోడ్లలో మువ్వన్నెల జెండా రంగులతో రోప్‌లైట్లను బింగించారు. దీంతో రాత్రి పూట ఈ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదే క్రమంలో పట్టణంలో అన్ని జంక్షన్లను సుందరీకరించాలన్న లక్ష్యంతో సుడా ఆధ్వర్యంలో సిద్దిపేట జంక్షన్లను అందంగా తయారు చేయనున్నారు.


 బీజేఆర్‌ చౌరస్తా 

పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో స్థానిక బ్లాక్‌ ఆఫీస్‌ వద్ద గల డా. బాబు జగ్జీవన్‌రామ్‌ (బీజేఆర్‌) చౌరస్తా  ఆధునికర ణ రూ.22లక్షలతో పనులను చేపట్టారు. సర్కిల్‌లో డాల్ఫిన్‌, సీతాకోకచిలుక, నెమలి బొమ్మల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ల్యాండ్‌ స్కేప్‌ గ్రాస్‌తో పచ్చదనం సంతరించుకునేలా ఏర్పాటు చేసి, సర్కిల్‌ చుట్టూ రేడియం వర్క్‌ చేయనున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ల ద్వారా నీటిని వివి ధ రంగులు కనిపించేలా విరజిమ్ముతూ చౌరస్తాను అందంగా ఆకర్షణీయంగా తయారు చేయనున్నారు.


ఎక్బాల్‌ మినార్‌

సిద్దిపేటలోని మెదక్‌ రోడ్డులో ఉన్న ఎక్బాల్‌ మినార్‌ సర్కిల్‌ను రూ.12 లక్షలతో ఆధునీకరిస్తున్నారు. ఇక్కడ కేటిల్‌లో నుంచి చాయ్‌ని  కప్పు సాసర్‌లో పోస్తున్న ఆకృతిని ఏర్పాటు చేస్తున్నారు. మినార్‌ను ఆధునీకరించి ఆకర్షించే విధంగా షైనింగ్‌తో కూడిన రంగులను వేయనున్నారు. చుట్టూ ఇనుప రాడ్ల తోపాటు ఫెన్సింగ్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.


ముస్తాబాద్‌ చౌరస్తా ఇందిరాగాంధీ సర్కిల్‌ 

మెదక్‌ రోడ్డులోని ముస్తాబాద్‌ చౌరస్తాలో ఇందిరాగాంధీ సర్కిల్‌ను రూ.8 లక్షలతో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ సర్కిల్‌లో.. కుండలో నుంచి నీరు బయట పడుతున్నట్లుగా కనిపించేలా డిజైన్‌ రాక్‌ను ఏర్పాటు చేశారు.  అలాగే, నీటిని విరజిమ్మే విధంగా ప్రత్యేకంగా ఫౌంటేన్లు అమర్చారు. సర్కిల్‌ చుట్టూరా ప్రత్యేక డిజైన్‌తో ఇనుప కడ్డీలు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్లను వేయనున్నారు.


logo