గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 10, 2020 , 00:18:30

రైలు కల తీరుతున్న వేళ

రైలు కల తీరుతున్న వేళ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలుకూత త్వరలో వినబడనుంది. గజ్వేల్‌ ప్రాంతవాసుల చిరకాల వాంఛ రైలు ప్రయాణం అతిత్వరలో నెరవేరనుంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌-కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల రైల్వేట్రాక్‌ నిర్మాణానికి 2016లో శంకుస్థాపన జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను పరుగు పెట్టించింది. మనోహరాబాద్‌-గజ్వేల్‌, గజ్వేల్‌-సిద్దిపేట, సిద్దిపేట-సిరిసిల్ల, సిరిసిల్ల-కొత్తపల్లి వరకు నాలుగు భాగాలుగా పనులు విభజించారు. తొలుత మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మాణం పూర్తికాగా, కింది, పై వంతెనలు చివరిదశలో ఉన్నాయి. ఆధునిక హంగులతో గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ నిర్మాణం పూర్తికావొస్తున్నది. ఇప్పటికే మూడుసార్లు నిర్వహించిన ట్రయల్న్‌ విజయవంతమైంది. తాజాగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించడంతో అన్ని పనులు పూర్తిచేసి నెలాఖరులోపు ముఖ్యమంత్రి కేసీఆర్‌చే ప్రారంభింపజేసేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  


గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా కొత్తపల్లి వరకు రైల్వే ట్రాక్‌ నిర్మాణానికి మంజూరు లభించింది. 2016 ఆగస్టు 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ కోమటిబండ వద్ద రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత, నిధుల కేటాయింపు పెరుగడంతో పనుల్లో కూడా వేగం పుంజుకుంది. రాష్ట్రంలో రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినా సీం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారు. రూ.1160కోట్ల అంచనాతో 151 కిలో మీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణాన్ని నాలుగు విడుతల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి విడుతలో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు, రెండో విడుతలో గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు, మూడో విడుతలో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు, నాల్గో విడుతలో సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు పనులు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన నిధులతో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32కిలో మీటర్ల ట్రాక్‌ నిర్మాణం పూర్తి కాగా, పలు ప్రాంతాల్లో ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలు కూడాగజ్వేల్‌ వరకు పూర్తయ్యాయి. గజ్వేల్‌ వరకు మూడు స్టేషన్ల పనులు కొనసాగుతుండగా, ఈ నెలాఖరులోగా పూర్తికానున్నాయి. ఇంకా సిద్దిపేట వరకు భూసేకరణ కూడా దాదాపు పూర్తి కావస్తున్నది. 


సీఎం కేసీఆర్‌ కృషితో పనుల్లో వేగం

జిల్లాలో ఏ గ్రామానికి ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేకపోగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ పట్టుబట్టి, కేంద్రంపై ఒత్తిడి పెంచి, కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైలు మార్గానికి మంజూరు సాధించి, నిధులు రాబట్టుతున్నారు. రైలు సౌకర్యం ఏర్పడితే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వెళ్లడానికి గజ్వేల్‌ ప్రజలకు మరింత రవాణా, ప్రయాణభారం తగ్గుతుంది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాలకు రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ గజ్వేల్‌ డివిజన్‌లో 22 గ్రామాల గుండా వెళ్తుంది. వర్గల్‌ మండలం అనంతగిరిపల్లి నుంచి నాచారం, బేగంపేట, ఎల్కల్‌, వీరనగర్‌, బంగ్లావెంకటాపూర్‌, గిరిపల్లి, జాలిగామ, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్‌, క్యాసారం, దాచారం, రిమ్మనగూడ, కొడకండ్ల, రామచంద్రాపూర్‌, కుకునూర్‌పల్లి, మేధీనీపూర్‌, లకుడారం, తిప్పారం, విశ్వనాథ్‌పల్లి, వెలికట్ట, దుద్దెడ గ్రామాల మీదుగా రైల్వేలైన్‌ వెళ్తున్నది.


నిర్మాణం పూర్తికాస్తున్న రైల్వే స్టేషన్‌

గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు మూడు రైల్వేస్టేషన్లు నిర్మిస్తున్నారు. గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ కోసం 45ఎకరాలు కేటాయించగా, నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. గజ్వేల్‌లో అధునాతన భవన సముదాయంతో రైల్వే స్టేషన్‌ నిర్మాణమవుతున్నది. ఇందులో ప్రయాణికుల కోసం ప్రత్యేక సీటు,్ల విశ్రాంతి గదులు, టికెట్‌ కౌంటర్లు, టాయింలెట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. విశాల పార్కింగ్‌, స్టేషన్‌ నుంచి జాలిగామ, గజ్వేల్‌ రోడ్డు వరకు ప్రత్యేక రోడ్డును నిర్మిస్తున్నారు. అలాగే గజ్వేల్‌, ధర్మరెడ్డిపల్లి రోడ్డు వైపు రింగు రోడ్డు జంక్షన్‌ వరకు ప్రత్యేక రోడ్డుకు చర్యలు చేపట్టారు. నాచారం, బేగంపేటలో రైల్వేస్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది.


నిధుల కేటాయింపుతో పనుల్లో పరుగు

2020-21 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌లో కేంద్రం మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వే లైన్‌ కోసం రూ. 235 కోట్లు కేటాయించగా ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడుత గజ్వేల్‌ వరకు రైల్వే పనులు ట్రాక్‌, స్టేషన్లు, ఆర్‌యూబీ, ఆర్వోబీ నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో విడుత పనుల్లో భాగంగా గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, దుద్దెడ వరకు రైల్వే ట్రాక్‌ టెండర్‌ కూడా ఇటీవలే ముగిసింది.


త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం 

గజ్వేల్‌ వరకు అన్ని పనులు పూర్తికావడంతో పాటు ఫిబ్రవరి 7 నుంచి మూడు సార్లు గూడ్స్‌ రైలు ఇంజిన్‌తో ట్రయిల్‌ రన్‌లు పూర్తయ్యాయి. స్పీడ్న్‌ సర్వే త్వరలో చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. అనుమతి లభించిన తర్వాత, ఈ నెలఖరు లోపు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నారు.


సీఎం కేసీఆర్‌ కృషితోనే ఇంత త్వరగా..

సీఎం కేసీఆర్‌ కృషితోనే గజ్వేల్‌కు ఇంత త్వరగా రైలు సౌకర్యం వస్తున్నది. సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ నిర్మాణానికి మంజూరు లభించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగినా, ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇంత తొందరగా గజ్వేల్‌కు రైలు సౌకర్యం వస్తుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించడంతో పనులు మరింత వేగవంతమవుతాయి.

- మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి


logo