శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 10, 2020 , 00:11:59

దాతృత్వమూర్తులు పూర్వ విద్యార్థులు

దాతృత్వమూర్తులు పూర్వ విద్యార్థులు

రాయపోల్‌ : సర్కారు బడి సదువులకు సక్కదనం తెస్తున్నారు. ఆ పాఠశాలలో  చదివిన పూర్వ విద్యార్థులు తాము నడియాడిన పరిసరాలు, పాఠలు చెప్పిన గురువులను గుర్తు తెచ్చుకొని, ఉన్నంతలో ఎంతో కొంత పాఠశాల పురోగతికి సహాయం అందిస్తున్నారు. ఒక బ్యాచ్‌ వారు అందజేసిన సహాయానికి, మరో బ్యాచ్‌ విద్యార్థులు ఆర్థిక సాయం అందించి, అన్ని హంగులు కల్పిస్తున్నారు. అక్షరాలు నేర్పిన బడికి మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ పూర్వ విద్యార్థులు బడి రుణం తీర్చుకుంటున్నారు. రాయపోల్‌లో 1956లో ప్రభుత్వ పాఠశాల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని, వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. కాగా, ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని, పాఠశాలకు ఏదో ఒక రకంగా చేయూతను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే 1992-93 బ్యాచ్‌ విద్యార్థులు రూ.60వేల విలువ గల గ్రీన్‌ బోర్డులను అందించారు. 1991-92 బ్యాచ్‌ విద్యార్థులు రూ.35వేల వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. 


1994-95 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధికి రూ.25 వేలు సహాయం చేశారు. పూర్వ విద్యార్థులు మామిడి మోహన్‌రెడ్డి రూ.20వేలను అందించడంతో పాటు పాఠశాలకు డాయస్‌ను నిర్మిస్తున్నారు. రవీందర్‌రెడ్డి రూ.27వేలు, రాజిరెడ్డి రూ.10వేలు, గల్వ యాదవరెడ్డి రూ.10వేలు, ఇప్ప దయాకర్‌ రూ.15వేలు, పూర్వ విద్యార్థి బాగన్నాగారి ఉదయకిరణ్‌రెడ్డి జిరాక్స్‌ మిషన్‌, మధు ఎల్‌ఈడీ టీవీని అందించారు. సత్తుగారి రవి స్పోర్ట్స్‌ డ్రేసులు అందించారు. జనార్దన్‌ పోడియాన్ని బహూకరించారు. గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు యాదవరెడ్డి, నర్సింగరావు, తిమ్మక్కపల్లి రమేశ్‌, అశోక్‌రెడ్డి, రాజు తదితరులు పాఠశాల అభివృద్ధికి చేయూత అందిస్తున్నారు. రాయపోల్‌ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు తోచిన విధంగా సహాయం చేయడంతో పాఠశాలలో సకాల వసతులు సమకురుతున్నాయి.


logo