బుధవారం 03 జూన్ 2020
Siddipet - Mar 09, 2020 , 00:11:14

పట్నమేసి.. మొక్కు తీర్చి..

పట్నమేసి.. మొక్కు తీర్చి..
  • వైభవంగా మల్లన్న ఎనిమిదో వారం
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం
  • సుమారు 40వేల మందికి పైగా దర్శనం
  • కొమురవెల్లి మల్లన్న దర్శనంతో భక్తుల పరవశం
  • మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి భారీగా తరలి వస్తున్నారు. 8వ ఆదివారం సందర్భంగా 40వేల మంది భక్తులు మల్లన్నస్వామికి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోశ్‌ తెలిపారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలోని గదులు, ప్రైవేట్‌ గదులను కిరాయికి తీసుకుని బస చేస్తున్నారు. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్ర లేచి కోనేరులో పవిత్ర స్నానం అచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే, కొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు ఒడి బియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అమర్‌, నర్సింహులు, బాల్‌రెడ్డి, నాగిరెడ్డి, మల్లయ్య, ఐలయ్య, ఏఈవోలు సుదర్శన్‌, శ్రీనివాస్‌, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, ప్రధానార్చకుడు మల్లికార్జున్‌, సిబ్బంది, పూజారులు సేవలందించారు.


logo