ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 07, 2020 , 03:52:08

చెరువులకు పునరుజ్జీవం

చెరువులకు పునరుజ్జీవం
  • రూ.8.90 కోట్లతో చెరువులు, కుంటల మరమ్మతులు పూర్తి

 హుస్నాబాద్‌టౌన్‌: కాకతీయుల కాలంలో ఊరుచుట్టూ నీటితో హుస్నాబాద్‌ పట్టణం ఒక ద్వీపంలా వెలిగేది. ఊరుచుట్టూ జలకళతో కళకళలాడిన హుస్నాబాద్‌ పట్టణంలోని పలు చెరువులు, కుంటలు తూముల లీకేజీలు, పూడుకపోయిన కాల్వలు, తుప్పుపట్టిన గేట్లతో ఏండ్లతరబడి నీరు వృథాగా పోయి వ్యవసాయానికి సాగునీరు కరువైపోయింది. సాగునీటి వనరులతో రైతాంగం వ్యవసాయం చేసుకునే విధంగా ఎదుగాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హుస్నాబాద్‌లోని పలు చెరువులు, కుంటలు తిరిగి జీవం పొసుకోవడంతో ఆయా చెరువులు, కుంటలు జలకళతో కళకళలాడుతున్నాయి.  


 హుస్నాబాద్‌లో 20కిపైగా కుంటలు.. 

వందల ఏండ్లక్రితం కాకతీయుల కాలంలో హుస్నాబాద్‌లో సాగునీటిని నిల్వచేసే చెరువులు, కుంటలు నిర్మించారు. ఒక కుంటనుంచి మరో కుంటకు నీరు వెళ్లేలా గొలుసుకట్టుచెరువులు, కుంటలను నిర్మించి ఈ ప్రాంతంలో సాగునీటి వనరులకు జీవం పొశారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఎల్లమ్మచెరువు, బట్టువాని కుంట, తీగలకుంట, పటేల్‌కుంట, కొత్తచెరువు, సావులకుంట, ఎర్రకుంట, దారమోని కుంట, మాదిగకుంట , నారాయణకుంట, పల్లెచెరువు, దామెరకుంట, చింతలోని వొర్రె, కేడమోల్లకుంట, చింతలకుంట, చిన్నపాలేరుకుంట, మొండికుంట, దామెరకుంటతోపాటు 20కిపైగా చెరువులు, కుంటలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి.  


 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జీవం పొసుకున్న చెరువులు, కుంటలు.. 

మనిషి జీవనానికి ఆధారమైన చెరువులు, కుంటలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తిరిగి జీవం పోసుకున్నాయి. చెరువులు, కుంటల లీకేజీలు, తూముల మరమ్మతులను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెరువులు, కుంటల పునరుజ్జీవనానికి మిషన్‌కాకతీయకింద కోట్లరూపాయలు వెచ్చించి సాగునీటి వనరులను రక్షించి హుస్నాబాద్‌ ప్రాంత రైతుల వ్యవసాయంపై ఆశలు చిగురింపజేసింది. ఇలా పట్టణంలోని ఎల్లమ్మచెరువును మినీట్యాంక్‌ బండ్‌గా మార్చేందుకుగాను రూ. 6.55కోట్లు కేటాయించగా, చింతలకుంటకు రూ. 12.42లక్షలు, చిన్నపాలేరుకుంటకు రూ.12.65లక్షలు, మాదిగ కుంటకు రూ. 12.01లక్షలు, పల్లెచెరువుకు రూ. 58.28లక్షలు, పెద్దకుమ్మరికుంటకు రూ. 15.92లక్షలు, నారాయణకుంటకు రూ. 18.39 లక్షలు, కొత్తచెరువుకు రూ. 1.06కోట్లను కేటాయించడంతో అన్నికుంటలు మరమ్మతులు పూర్తి కావడంతో వర్షాకాలంలో భారీగా నీరుచేరడంతో రైతులతోపాటు వాటిపై ఆధారపడి జీవనం సాగించే వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతున్నది. 

  మరమ్మతులు పూర్తి చేశాం.. 


పట్టణంలోని 8చెరువులు, కుంటలను రూ. 8.90కోట్లతో తిరిగి మరమ్మతులు చేయించాం. ఎల్లమ్మచెరువును మినీట్యాం క్‌బండ్‌గా మార్చడం, పల్లెచెరువు, కొత్తచెరువుతోపాటు పలుకుంటలను మరమ్మతులు చేశాం. వానకాలంలో ఆ చెరువులు, కుంటలు నీరుచేరడంతో భూగర్భజలాలు పెరిగి రైతాంగానికి మేలు జరుగుతున్నది. 

- శ్రీధర్‌ ,  నీటిపారుదలశాఖ ఏఈ


  కుంటలు బాగుపడ్డాయి.. 

చిన్నప్పుడు నేను చూసిన కుంటలు చాలా పోయినయి. సుట్టూ సెరువులు, కుంటలు ఉన్నప్పుడు నీల్లమీదనే ఉండేటివి. గట్లాంటి వాటిని కొన్నింటిని తీసి బిల్డింగ్‌లు కట్టిండ్రు. ఉన్నకుంటలకు తట్టెడు మట్టిపొయ్యలే.. గిప్పుడు తెలంగాణ సర్కారు వచ్చినంకనే మళ్లీ గీకుంటలు బాగుచేసిండ్రు. వానలు పడి కుంటలల్ల నీల్లు, బావులు, బోర్లలో నీల్లు ఉబ్బినయి.

- ఎలకంటి రాజిరెడ్డి, రైతు హుస్నాబాద్‌టౌన్‌ 


logo