శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 05, 2020 , 23:39:33

కరువు నేలపై జలసిరులు

కరువు నేలపై జలసిరులు

చేర్యాల, నమస్తే తెలంగాణ : కరువు ప్రాంతాలైన చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు గోదావరి జలాలు రావ డంతో జీవకళ వస్తుంది. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం రెండోదశలో రూ.1500కోట్లతో నిర్మించిన తపాస్‌పల్లి రిజర్వాయర్‌ ద్వారా గోదావరి జలాలు చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లోని చెరువుల్లోకి చేరుకుంటున్నాయి. ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండడం తో చేర్యాల ప్రాంతం కరువును జయించి కోనసీమగా మారుతున్నది. రిజర్వాయర్లు నింపి, కాల్వల ద్వారా చెరువులు నిం పాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో చేర్యాల ప్రాంతంతోపాటు కొండపాక, జనగామ జిల్లా బచ్చన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలాల్లో జల ఫలాలు రైతాంగానికి అందుతున్నాయి. కాగా, తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి పూర్తిస్థాయి గోదావరి జలాలు చేరుకున్నప్పటికీ నీటిని విడుదల చేయలేదు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లోని చెరువులకు పంపింగ్‌ చేయిస్తున్నారు. ఐదేండ్లుగా చెరువుల్లోకి గోదావరి నీటిని నింపుతుండడంతో ఈ ప్రాంతంలో వలసలు తగ్గడంతో పాటు ఆత్మహత్యలు తగ్గి రైతు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. 


67 వేల ఎకరాల ఆయకట్టుకు జలాలు

 కొమురవెల్లి మండలం ఐనాపూర్‌-తపాస్‌పల్లి గ్రామాల శివార్ల మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను 0.03టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. రిజర్వాయర్‌ కింద 67వేల ఎకరా ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా గోదావరి జలాలను చెరువులకు పం పింగ్‌ చేసి నింపుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఘణనీయంగా పెరిగాయి. ఐదు సంవత్సరాలుగా ఇక్కడి రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నారు.

   

జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, బచ్చన్నపేట మండలాల్లోని 200 చెరువులు నింపడంతో పాటు చారిత్రత్మాకమైన కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్‌ పెద్ద చెరువు, చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి మారెడ్డి చెరువు, వీరన్నపేట మిధునమ్మ చెరువు, మద్దూరు మండలంలోని కమలాయపల్లి చెరువు, గాగిళ్లాపూర్‌ చెరువుతోపాటు ఆయా గ్రామాల్లో కాల్వలకు అనుసంధానంగా ఉన్న చెరువులను నింపుతుండడంతో ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య తీరింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగరంలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు నుంచి వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు అక్క డి నుంచి జనగామ జిల్లాలోని గండిరామారం రిజర్వాయర్‌కు అనంతరం బొమ్మకూరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలు ప్రత్యేక మోటర్ల ద్వారా వస్తాయి. అక్కడి నుంచి బొమ్మకూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు రెండు పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ప్రారంభమైన నీటి పంపింగ్‌ మార్చి నెల వరకు కొనసాగుతుండడంతో ఒక్కో చెరువును రెండుసార్లు గోదావరి నీటిని నింపుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 75 శాతం జలాలు రావడంతో నిండుకుండలా రిజర్వాయర్‌ ఉంది. పంపుల మరమ్మతులతోపాటు దేవాదుల ప్రాజెక్టు వద్ద ఇన్‌టెక్‌ వెల్స్‌లో టెక్నికల్‌గా ఏదైనా సమస్య తలేత్తితే తప్పా తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటి పంపింగ్‌ నిత్యం కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


ఈ ఏడాది 200 చెరువులకు గోదావరి జలాలు  

తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు పూర్తిస్థ్ధాయిలో గోదావరి జలా లు రావడంతో  చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువులకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఐదేం డ్లుగా ఆయా గ్రామాల్లోని చెరువులను ప్రాధాన్యత పరంగా గోదావరి జలాలు నింపుతున్నారు. ప్రస్తుతం పైపులైన్లతో  15 మిలియన్ల క్యూబిక్‌ ఫీట్ల నీరు సరఫరా అవుతున్నది. నాలుగు మండలాల్లో మొత్తం 200 చెరువులకు 2015-16లో 18 చెరువులు, 2016-17లో 22 చెరువులు, 2017-18లో 35 చెరువులు, 2018-19లో 32 చెరువులు, ఈ సంవత్సరం 93 చెరువులను ఇప్పటి వరకు గోదావరి జలాలతో నింపారు. చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగి బోర్లు నీళ్లు పోస్తుండడంతో రైతుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.


మల్లన్న భక్తులకు గోదావరి జలాలు

కొమురవెల్లి మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నీటి సమస్యలు తలెత్తకుండా మల్లన్న చెరువును  నింపుతున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు నీటి సమస్య తలెత్తకుండా మల్లన్నచెరువును గోదావరి జలాలతో నింపారు.


పెరిగిన సాగు విస్తీర్ణం

చెరువులు నింపడంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి బీడు భూములు సాగులోకి వచ్చాయి. నాలుగేండ్ల క్రితం చేర్యాల మండలంలో రబీలో వరి సాగు 4 వేల కరాలు ఉండ గా, ఈ ఏడాది 8 వేల ఎకరాలకు చేరినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో సైతం సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. దేవాదుల వద్ద గోదావరిలో నీటి లభ్యతను బట్టి మరో 15 రోజులు రిజర్వాయర్‌కు నీటి పంపింగ్‌ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 


logo