ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 04, 2020 , 00:56:21

డెడ్‌లైన్‌ మార్చి 31

డెడ్‌లైన్‌ మార్చి 31

కంది : కొత్తగా బీఎస్‌-4 వాహనం కొని ఉండి ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదా.. మీరు బీఎస్‌-3, బీఎస్‌-4 ద్విచక్ర, త్రిచక్ర, ఫోర్‌ వీలర్‌ వాహనాలను కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదా.. అయితే మీరు వెంటనే ఆ పని చేయకపోతే మీ వాహనం స్క్రాప్‌ కిందకే పరమితమవుతుంది. సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన సూచనల ప్రకారం ప్రస్తుతం మార్చి 31 నాటికి అన్ని బీఎస్‌-3, బీఎస్‌-4 రకాల వాహనాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించుకోవాలి. లేకపోతే ఆ వాహనాలను నడిపేందుకు అనుమతులు ఇకపై ఇవ్వరు. ఒకవేళ మీరు వాహనాలు రోడ్డుపై నెంబర్‌ లేకుండానే నడుపాలని చూసినా ఆ వాహనాలను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేయనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ప్రాంతాల్లో మొత్తం 23,504 వాహనాలు కొత్తగా కొని ఇంకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోలేనట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా, అది కూడా మార్చి 31 డెడ్‌లైన్‌ తేదీ నాటికి పూర్తి చేసుకోవాలని అన్ని వాహనదారులకు నేరుగా ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. సమాచారం అందని వారిని గుర్తించి వారికి సంబంధిత డీలర్ల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఎలాంటి బీఎస్‌-4 వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయబోమని ఆర్టీఏ ఉమ్మడి మెదక్‌ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్‌ శివలింగయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


ఈ నెల 31 వరకు..

కొత్తగా కొన్న బీఎస్‌-4 వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 31 నాటికి పూర్తి చేసుకోవాలి. గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వాహనాలకు రోడ్డుపై తిరిగే అనుమతిని ఆర్టీఏ అధికారులు నిషేధించనున్నారు. కొత్తగా వాహనం కొని ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారు వెంటనే మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు డెడ్‌లైన్‌ను   ప్రకటించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పాత బీఎస్‌-4 వాహనాలకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయబోమని, అవి స్క్రాప్‌ కిందికే లెక్క కడుతామని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 23,504 వాహనాలను ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉండగా, ఇందులో 70-80 శాతం ద్విచక్ర వాహనాలే ఉండడం గమనార్హం. అవి కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారీగా అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, తెలియని వారికి ఈ విషయాన్ని తెలియజేయాలని ఆ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.


గడువులోగా పూర్తి చేసేలా చర్యలు

సుప్రీం కోర్టు ఆదేశాల మే రకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పాత బీఎస్‌-4 వాహనాలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగదు. మార్చి 31లోపే అందరూ తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఆ వాహనాలను రోడ్డుపై తిరిగేందుకు అనుమతించాం. రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వాహనాలను గడువు తేదీ తర్వాత వాటిని ప్రత్యేక వాహనాల తనిఖీల ద్వారా గుర్తించి సీజ్‌ చేస్తాం. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 23,504 వాహనదారులు తమ వాహనాలకు ఇంకా ఈ ప్రక్రి య పూర్తి చేసుకోలేదు. గడువు  లోపు అన్ని వాహనాలకు వంద శాతం రిజిస్ట్రేషన్‌ పూర్తి అయ్యేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆ వాహనదారులకు ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా సమాచారం అందించాం. అవసరమైతే అర్ధరాత్రి వరకు ఆయా పరిధి కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగిస్తాం.

- శివలింగయ్య, ఉప రవాణాశాఖ కమిషనర్‌


logo