గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 02, 2020 , 23:59:15

అక్రమ లేఅవుట్లపై కొరడా

అక్రమ లేఅవుట్లపై కొరడా
  • అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత
  • సబ్‌రిజిస్ట్రార్లకు మున్సిపల్‌ కమిషనర్ల లేఖలు
  • ఆయా మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లు అధికం
  • అక్రమాల నివారణకే నూతన పురపాలక చట్టం
  • అక్రమ లేఅవుట్లతో సర్కారు ఆదాయానికి గండి
  • సామాజిక అవసరాలకు స్థలాలివ్వని వ్యాపారులు
  • అనధికార లేఅవుట్లను తొలగిస్తున్న యంత్రాంగం
  • రియల్‌ వ్యాపారుల్లో మొదలైన వణుకు

అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అక్రమ లేఅవుట్లలో కొన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని మున్సిపల్‌ కమిషనర్లు రాసిన లేఖలు ఆయా సబ్‌రిజిస్ట్రార్లకు అందడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో రియల్‌ వ్యాపారుల్లో వణుకు మొదలుకాగా, ప్లాట్లు కొన్న వారిలో అయోమయం నెలకొన్నది. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో కొంతకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారం రియల్‌ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు. లేఅవుట్‌ అప్రూవల్‌, నాలా కన్వర్షన్‌ లేకుండా స్థలాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రతి మున్సిపాలిటీ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతుంది. పైగా సామాజిక అవసరాలకు భూమి వదలకుండా స్థలాలు విక్రయిస్తుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నూతన పురపాలక చట్టం ప్రకారం అక్రమ వెంచర్లు ఎన్ని ? ఎన్ని ఎకరాల్లో చేశారన్న దానిపై అధికారులు వివరాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు సబ్‌రిజిస్ట్రార్లు అందజేస్తున్నారు. 


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని పట్టణాల్లో అక్రమ లేఅవుట్లకు చెక్‌ పెట్టారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు లేఖలు పంపారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఓ వైపు పట్టణాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా క్రయ, విక్రయాలు పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చింది. అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో వీటిని గుర్తిస్తున్నారు.


జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లో కొంత కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిగా వెంచర్లు చేస్తున్నారు. లేఅవుట్‌ అప్రూవల్‌, నాలా కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లను ప్రజలకు అంటగడుతున్నారు. జిల్లాలో అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. అనుమతులు లేకుండా మున్సిపాలిటీల పరిధిలో వెంచర్లు చేయడంతో ప్రతి మున్సిపాలిటీ లక్షల్లో ఆదాయం కోల్పోతున్నది. ప్రతి లేఅవుట్‌లో 10శాతం మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు ఆట స్థలం కేటాయించాలి. ఇవేవి లేకుండానే వెంచర్లు చేస్తున్నారు. కనీసం మురికినీటి కాలువలు, సామాజిక అవసరాలకు స్థలాలను విడిచిపెట్టడం లేదు. అనుమతులు లేని ప్లాట్లను కొనడంతో సమస్యలు వస్తున్నాయి. ఎక్కడికక్కడనే స్థలాలను విభజించి అమ్మడం, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించడం పరిపాటిగా మారింది. దీంతో అక్రమ వెంచర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. అన్నింటా కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం జరుగాలని ఆదేశించింది. దీంతో ఏయే మున్సిపాలిటీల్లో ఎన్ని అక్రమ వెంచర్లున్నాయి? ఎన్ని ఎకరాలలో ఉన్నాయి? అనే వివరాలు సేకరించే పనిలో అధికారులున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వెంచర్లను తొలగిస్తున్నారు. అనుమతులు లేని వాటిలో చేపట్టిన నిర్మాణాలను కూలగొడుతున్నారు.


అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత 

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 187.34 ఎకరాల్లో 37, గజ్వేల్‌ -ప్రజ్ఞాపూర్‌ పరిధిలో 140 ఎకరాల్లో 22, చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 18, దుబ్బాక పరిధిలో 9.2 ఎకరాల్లో ఒకటి, హుస్నాబాద్‌లో 3 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని కమిషనర్లు ఆదేశించారు. వాస్తవంగా హుస్నాబాద్‌, దుబ్బాకలో అక్రమ లేఅవుట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ స్థానిక అధికారులు వాటిని గుర్తించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. హుస్నాబాద్‌లో పెద్ద మొత్తంలో వెంచర్లున్నాయి. ఇప్పటి వరకు వాటి లెక్కల తీయలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతుంది.


సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో..

సిద్దిపేట స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ పరిధి రంగధాంపల్లిలో సర్వేనంబర్‌ 893/2లో 3 ఎకరాలు, 1048లో ఎకరం, 2016లో 1.80 ఎకరాలు, 2002లో 1.20 ఎకరాలు, 1989లో 32 గుంటలు, మిట్టపల్లి రెవెన్యూలోని కొంత భాగంలోని సర్వే నంబర్‌ 819లో 2ఎకరాలు, 1088లో 11ఎకరాలు, 1089లో 2ఎకరాలు, 65లో 2ఎకరాలు, 105లో 5ఎకరాలు, 615లో 2ఎకరాలు, 172/3, 172/9లో 50ఎకరాలు, 1091లో 14ఎకరాలు, లింగారెడిపల్లిలో సర్వే నంబర్‌ 895, 896, 897, 898లో 11.18 ఎకరాలు, 939, 101, 811, 191, 120లో 7ఎకరాలు, 926, 927, 928లో 5.30 ఎకరాలు, 945లో 3.37 ఎకరాలు, 895,899లో 8.38 ఎకరాలు, 975లో 2 ఎకరాలు, 977,981లో 1.15 ఎకరాలు, 773లో 1.10 ఎకరాలు, 575లో ఎకరం, 575, 986లో 4ఎకరాలు, 990, 991లో 2.14ఎకరాలు, 979లో 2ఎకరాలు, 1096, 1097, 1098, 1100, 1101లో 3ఎకరాలు, 1126లో 1.03 ఎకరాలు, 530, 531లో 4ఎకరాలు, పొన్నాల రెవెన్యూ పరిధిలోని కొంత భాగంలోని సర్వే నంబరు 42లో 4ఎకరాలు, 5లో 2ఎకరాలు, 48లో 4ఎకరాలు, 50లో 2ఎకరాలు, 56లో 2ఎకరాలు, 38లో 4ఎకరాలు, 19లో 6.17ఎకరాలు, 18లో 5ఎకరాలు, 7ఏలో 1.20 ఎకరాలు, 49లో 5ఎకరాలు, 50 సర్వే నంబర్‌లో 5ఎకరాలు.


గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలో.. 

సర్వే నెం.546లో 3ఎకరాలు, 439, 440, 472, 485లో 8ఎకరాలు, 548లో 3 ఎకరాలు, 48లో ఎకరం, 211/అలో 2ఎకరాలు, 564/పీ, 569/పీలో 7.20 ఎకరాలు, 437లో 25గుంటలు, 229లో 1.38 ఎకరాలు, 191/పీ, 192/పీలో 3.20 ఎకరాలు, 191/పీ, 193, 194లలో 1.30ఎకరాలు, 160లో 2ఎకరాలు, 220లో ఎకరం, 323/పీలో 1.20 ఎకరాలు, 542లో 2.20ఎకరాలు, 150లో 6ఎకరాలు, 272/ఈలో 2.20ఎకరాలు, 328లో 3.20ఎకరాలు, 289, 290, 295లో 5.19 ఎకరాలు, 34, 35లో 2ఎకరాలు, 49లో ఎకరం. 


రిజిస్ట్రేషన్లు ఆపాలని లేఖ ఇచ్చాం..

అక్రమ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చాం. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని ఎవరు మోసపోవద్దు. ప్లాట్లను కొనేటప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయా? లేవా? చూసిన తర్వాతే కొనాలి. ఇప్పటికే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా సర్వే నంబర్లలో అక్రమ లేఅవుట్లను గుర్తించాం. అనుమతులు లేకుండా ఎవరైనా కొత్త లేఅవుట్లు పెడితే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ కమిషనర్‌


కొత్త చట్టం ప్రకారమే చేయాలి 

గతంలో అక్రమంగా వెలిసిన వెంచర్లలోని ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవచ్చని వెంచర్ల యజమానులు ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ప్లాట్లు కొనే వారు అప్రమత్తంగా ఉండాలి. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం అన్ని అనుమతులుంటేనే లేఅవుట్‌ చేయడానికి పర్మిషన్‌ ఉంది. కొత్త చట్టం ప్రకారం మున్సిపల్‌ పరిధిలోని లేఅవుట్లలో రోడ్లతో పాటు పార్కింగ్‌ స్లాట్స్‌ ఏర్పాటు చేయాలి.

- కృష్ణారెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ 


logo