గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 02, 2020 , 23:48:23

పరిశీలన

పరిశీలన

మార్పు వచ్చేలా పట్టణ ప్రగతి పనులు జరగాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. చేర్యాలలో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. గజ్వేల్‌, సిద్దిపేట తరహాలో చేర్యాలను మార్చాలని, ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపడితే కూల్చివేయాలని ఆదేశించారు. 

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం పట్టణాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా చేర్యాలలో కలెక్టర్‌ పర్యటించారు. ప్రధాన కూడలి పెంపు పనులతో పాటు మరుగుదొడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. పెద్దమ్మగడ్డ శివారులో నిర్మించనున్న డంపింగ్‌యార్డ్‌, వైకుంఠధామాల నిర్మాణ స్థలాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ ప్రగతి పనులను సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రాధాన్య క్రమంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. పట్టణ ప్రగతితో పట్టణంలో మార్పు అనేది రావాలన్నారు. కొత్త పాలక మండలిపై ప్రజలకు నమ్మకం ఏర్పడేలా కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. పట్టణంలో కొత్త పనులు మొదలైతేనే ప్రజలు పన్నులు కట్టే అవకాశం ఉందన్నారు.


ఆ దిశగా ప్రగతి పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కౌన్సిలర్లు, అధికారులపై ఉందన్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలని, అవసరమైతే ప్రైవేటు భూములను కొనాలన్నారు. చేర్యాల పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. ప్రధానంగా చేర్యాల పట్టణంలోని సుమారు 6కిలోమీటర్ల ప్రధాన రహదారిని మూడ్రోజుల పాటు శుభ్రం చేసేందుకు ఉపాధిహామీ కూలీలను వినియోగించుకోవాలని ఎంపీడీవో రాంప్రసాద్‌ను ఆదేశించారు. దీనికోసం ఉపాధి కూలీకి అదనంగా ప్రతిరోజు రూ.వంద చొప్పున ఇచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్‌, సిద్దిపేట పట్టణాల తరహా చేర్యాలను అందంగా రూపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పట్టణంలో ఇండ్ల నిర్మాణాల కోసం గతంలో ఇచ్చిన పంచాయతీ అనుమతులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు జరిగితే కూల్చి వేస్తామన్నారు. పట్టణంలోని కుడి చెరువులోని అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఒక వేళ అక్రమ నిర్మాణాల మీద ఉపేక్షిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేయనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ముజాంబిల్‌ ఖాన్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రవణ్‌కుమార్‌, చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ రెడ్డి, తహసీల్దార్‌ శైలజ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


logo