సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 29, 2020 , 23:46:09

డీసీసీబీ అభివృద్ధే లక్ష్యం

డీసీసీబీ అభివృద్ధే లక్ష్యం
  • రైతులకు మెరుగైన సేవలు
  • రూ.400 కోట్ల నుంచి రూ.1180 కోట్లకు...
  • ఉమ్మడి జిల్లాలో పెరిగిన శాఖలు
  • డీసీసీబీనూతన చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధే లక్ష్యం.., ఐదేండ్ల కాలంలో రైతులకు ఉత్తమ బ్యాంకు సేవలు అందించాం. ప్రజలు, రైతుల సహకారంతో బ్యాంకు సేవలను మరింత విస్త్రృతం చేస్తామని డీసీసీబీ నూతన చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని డీసీసీబీ కార్యాలయంలో శనివారం ఆయన రెండోసారి చైర్మన్‌ పదవి చేపట్టారు. ఈ సందర్భంగా చిట్టి దేవేందర్‌రెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

- సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ


సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధే తన లక్ష్యమని, ఐదేండ్లలో బ్యాంకు సేవలను రైతులకు అందించి ఆదుకున్నామని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలోని డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో నూతన పాలకవర్గం ఎన్నికలు డీసీవో, ఎన్నికల అధికారి ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు. అధిష్టానం ఎన్నికల పరిశీలకులుగా రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్‌తో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పేర్లను షీల్డ్‌ కవర్‌లో పంపారు. డైరెక్టర్లందరి ఏకాభిప్రాయంతో చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యంను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. కొత్త పాలకవర్గం చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన చిట్టి దేవేందర్‌రెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ. 


సమస్తే తెలంగాణ: బ్యాంకు అభివృద్ధిపై మీ అభిప్రాయం ఎలా ఉంది?

డీసీసీబీ చైర్మన్‌ :  జిల్లా సహకార బ్యాంకు అంటేనే రైతులు, ప్రజల్లో అపోహలు ఉండేవి. తాను 2015 ఏప్రిల్‌ 13వ తేదీన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు తన ముందు ఎన్నో రకాల సమస్యలను బ్యాంకు అధికారులు, సిబ్బంది పరిష్కరించేందుకు ముందుంచారు. బ్యాంకును లాభాల బాటలో తెచ్చేందుకు బ్యాంకు సిబ్బంది, అధికారులు సహకారం అందించాలని కోరారు. అందరి సహకారంతో సహకార బ్యాంకు అంటే రైతులు, ప్రజలకు సేవాలందించే బ్యాంకుగా తయారు చేయడం సంతోషంగా ఉంది.


న.తె : బ్యాంకు రుణాలపై స్పందన ఏమిటి?

చైర్మన్‌ : సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించినా అప్పు తీరేది కాదని ఆందోళన చెందేవారు. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న ఖాతాదారులు తిరిగి బ్యాంకు వైపు చూడని దాఖాలాలు గుర్తించాం. సహకార బ్యాంకులో రుణాలు తీసుకుంటే సమస్యలు వస్తాయని, అధికారుల సహాయంతో ఖాతాదారులకు నచ్చజెప్పి తిరిగి రుణాలు చెల్లించే విధంగా చైతన్యం చేశాం. దీంతో సహకార బ్యాంకు సేవలపై దృష్టి సారించిన రైతులు, ఖాతాదారులు స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, విద్యారుణాలు, ఇంటి నిర్మాణ రుణాలు, మహిళా సంఘాల రుణాలు (ఎస్‌ఎచ్‌జీ), జేఎల్‌జీ రుణాలు, మార్టీగేజ్‌ రుణాలు, వ్యాపార రుణాలు, చిన్న సంస్థలకు రుణాలు, ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇచ్చే వరకు బ్యాంకు సేవలను పెం చాం. మెండి బకాయిలపై దృష్టి సారించి రూ.30 కోట్ల రూణాలు వసూళ్లు చేసిన ఘనత మా హయాంలో జరుగడం సంతోషంగా భావిస్తున్నా.


న.తె : రూ.450 కోట్ల నుంచి లాభాల బాట ఎలా పట్టించారు?

చైర్మన్‌:  తాను పదవీ బాధ్యతలు తీసుకున్న రోజున బ్యాంకు లావాదేవీలు రూ.450 కోట్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. బ్యాంకును అభివృద్ధి చేసేందుకు ఎన్నో విధాలుగా ఆలోచించి సహకార బ్యాంకు సేవలను ప్రజల్లోకి విస్తృతం చేస్తే లాభాల్లోకి వస్తుందని గుర్తించా. అందుకోసం సీఎం కేసీఆర్‌ సమక్షంలో డీసీసీబీ చైర్మన్ల సమావేశంలో తనకు వచ్చిన ఆలోచనలను అమలు చేసేందుకు మంత్రి హరీశ్‌రావు సహకారంతో ముఖ్యమంత్రిని కలిశా. బ్యాంకు అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునే బాధ్యత నీపై ఉందని, బ్యాంకుకు లాభాలు వచ్చే విధంగా నిబంధనలు తయారు చేసుకొని ప్రజల్లోకి వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని అని ముఖ్యమంత్రి తనతో చెప్పారని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సహకార బ్యాంకు అభివృద్ధి కోసం సీఈవో, జీఎం, డీజీ ఎం, ఏజీఎంలతో సమావేశాలు ఏర్పాటు చేసి బ్యాంకు లాభాల్లోకి తెచ్చేందుకు సలహాలు తీసుకొని ముందుకు వెళ్లా. ప్రస్తుతం రూ. 1180 కోట్లతో లావాదేవీలు చేస్తూ అభివృద్ధి సాధించాం. మరో ఐడేండ్లపాటు సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో పదవి రావడం బ్యాంకు సేవలన విస్తృత పరిచి 25 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తా.


న.తె : శాఖల ఏర్పాటుతోబ్యాంకు అభివృద్ధికి తోడ్పడిందా?

చైర్మన్‌ : ఉమ్మడి జిల్లాలో కేవలం 21 శాఖలతో లావాదేవీలు చేస్తున్నాయి. బ్యాంకు అభివృద్ధికి మరిన్ని శాఖలు పెంచితే క్షేత్రస్థాయిలో సేవలు పెరిగి నమ్మకం కలుగుతుందని గుర్తించా. అందుకోసం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాల మరో 23 బ్రాంచీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకొని అన్ని బ్రాంచీలను ఆధునీకరించి కంప్యూటరైజేషన్‌ చేశాం. పెంచిన శాఖలను అనుగుణంగా ఉద్యోగులను పెంచేందుకు ఐబీపీఎస్‌తో నియమాకాలు చేపట్టాం. దీర్ఘకాలికంగా ఒకే దగ్గర పనిచేసే ఉద్యోగులకు పదోన్నతి కల్పించి బదిలీలు చేశాం. బ్యాంకు సిబ్బంది సూచనలు, సలహాలతో సహకార బ్యాంకు, కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నా. 


న.తె : బ్యాంకు సేవలకు అవార్డులు అందుకున్నారా?

చైర్మన్‌ : సహకార బ్యాంకు చరిత్రలో ఖాతాదారులు, రైతులకు అందించిన సేవలకు ఉమ్మడి జిల్లా బ్యాంకుకు రెండు అవార్డులు వచ్చాయి. రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఉన్న బ్యాంకును మూడో స్థానంలోకి తీసుకురావడం తన కృషి ఫలితమేనని గర్వపడుతున్నా. రైతులకు పీఏసీఎస్‌ సొసైటీలతో పంట కాలానికి ముందు ఎరువులు నిల్వ ఉంచి సరఫరా చేయడం, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అప్పులు ఇవ్వడం, దీర్ఘకాలిక రుణా లు అందజేయడంలో ఇతర బ్యాంకులకు దీటుగా సేవలు అందించాం.


బ్యాంకు సేవలు గుర్తించి నాబార్డు, టీఎస్‌ క్యాబ్‌ ప్రశంసించి తన పదవి కాలంలో రెండు అవార్డులు బ్యాంకుకు రావడం సంతోషంగా ఉంది. డీసీడీసీ బ్యాంకు అధికారులు, సిబ్బం ది, డైరెక్టర్ల సహకారంతో గత పాలకవర్గంలో అభివృద్ధికి సహకరించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


logo