సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 29, 2020 , 00:33:35

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నిక నేడే

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నిక నేడే
  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక లాంఛనమే..
  • గోవా టూర్‌ నుంచి ఎన్నిక కేంద్రానికి డైరెక్టర్లు
  • ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార వ్యవసాయ మార్కెట్‌ సొసైటీల ఎన్నికలు నేడు జరుగనున్నాయి. చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలు లాంఛనమేనని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న డైరెక్టర్ల ఎన్నికలకు ఒకరు చొప్పున నామినేషన్లు దాఖలు చేయడంతో 20 డైరెక్టర్లకు గాను 18 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. డీసీసీబీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఆ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డీసీఎంఎస్‌ పాలకవర్గానికి 7 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా ఏకగ్రీవమైన వారు గోవా టూర్‌లో ఉన్నారు. నేడు ఉదయం నేరుగా ఎన్నికల కేంద్రానికి హాజరుకానున్నారు. అధిష్టానం ఖరారు చేసిన వారికే చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు దక్కుతాయని టీఆర్‌ఎస్‌ నాయకుల సమాచారం. ఈ ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, ఉదయం 11:30 పరిశీలన జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని పోటీ అనివార్యమైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడిస్తారు. ఒక వేళ అధిష్టానం చైర్మన్‌, వైస్‌చైర్మన్ల పేర్లను షీల్డ్‌ కవర్‌లో పంపిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు ఆస్కారం లేదని అధికారులు వివరించారు. అధిష్టాన నిర్ణయానికి డైరెక్టర్లందరూ కట్టుబడి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.


logo