శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 28, 2020 , T00:12

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం
  • ట్రైనీఐపీఎస్‌ అఖిల్‌మహాజన్‌

కొండపాక: ప్రజలకు పూర్తిస్థాయి భద్రత భరోసాలను కల్పించడమే పోలీసుల పని అని ట్రైనీ ఐపీఎస్‌ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. గురువారం కుకునూరుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొబ్బొయిపల్లి, చిన్న కిష్టాపూర్‌ గ్రామాలను ఆయన సందర్శించి గ్రామస్తులకు రోడ్‌ సేఫ్టీ, ఉమెన్‌ సేఫ్టీ, ఆన్‌లైన్‌ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులతో కలిసి గ్రామాల్లో తిరిగి గ్రామంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ మోటార్‌ సైకిల్‌ వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించవద్దని, మహిళల, బాలికల రక్షణ గురించి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు.

పోలీస్‌ ద్వారా తక్షణ సహాయం గురించి డయల్‌ 100 కాల్‌ చేసి సేవలు, వినియోగించుకోవాలని సూచించారు. రోడ్లపై ధాన్యం పోసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలిపారు. మద్యం బెల్టు షాపులను నడపవద్దని, గుట్కాలు అమ్మొద్దని అన్నారు. పరిచయం లేని వ్యక్తులకు మీ యొక్క ఫోన్‌,  ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌ 7901100100 సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో బొబ్బాయిపల్లి సర్పంచ్‌ కోల శ్రీనివాస్‌, చిన్న కిష్టాపూర్‌ సర్పంచ్‌ కరోల్ల కనకయ్య, ఉప సర్పంచ్‌లు ఉపేందర్‌, రామచంద్రారెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామప్రజలు పాల్గొన్నారు. 


logo