ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 24, 2020 , 00:29:32

నేటి నుంచి పట్టణ ప్రగతి

నేటి నుంచి పట్టణ ప్రగతి
 • మార్చి 4వ తేదీ వరకు నిర్వహణ
 • ఐదు మున్సిపాలిటీలల్లో కలిపి మొత్తం రూ.23.01 కోట్లు
 • ఒక్కో వార్డుకు ప్రత్యేకాధికారి నియామకం
 • ప్రతి వార్డులో 4 రకాల కమిటీలు
 • ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున మొత్తం 60 మంది
 • పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రగతి కార్యక్రమం
 • పది రోజుల్లో చేపట్టే ప్రణాళిక సిద్ధం
 • ఫిబ్రవరి, మార్చి మాసాలకు రూ.4.25 కోట్లు విడుదల
 • మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉన్నవి రూ.18.76 కోట్లు

పల్లెప్రగతితో చాలావరకు సమస్యలు పరిష్కారమవ్వడంతో గ్రామాలు సుందరంగా తయారయ్యాయి. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణ పరిశుభ్రత, పచ్చదనమే లక్ష్యంగా నేటి నుంచి వచ్చేనెల 4 వరకు పదిరోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పదిరోజులపాటు ఏ పనులు చేపట్టాలి..? ప్రాధాన్యత క్రమంలో ఏవి చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నూతన పురపాలక చట్టం ప్రకారం పనిచేయకుంటే ప్రజాప్రతినిధులైన, అధికారులైన పదవులు పోతాయని హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా నర్సరీల ఏర్పాటు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనడం, కరెంటు సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, వైకుంఠ ధామాలు, పాడుబడిన ఇండ్ల కూల్చివేతతోపాటు ఆయా మున్సిపాలిటీల్లో నిరక్షరాస్యుల జాబితా తయారు చేయనున్నారు. పనుల పర్యవేక్షణకు వార్డుకో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ప్రతి వార్డులో 4 రకాల కమిటీలు వేయగా, ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున 60 మంది ఉంటారు. నిధులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఫిబ్రవరి, మార్చి మాసాలకు రూ.4.25 కోట్లు విడుదల చేసింది. 

- సిద్దిపేట ప్రతినిధి,నమస్తేతెలంగాణ


 సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతి స్ఫూర్తి తో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పట్టణ ప్రగతిని నేటి నుంచి మార్చి 4 వరకు జిల్లాలో చేపట్టనున్నారు. ఈ పది రోజుల్లో ఏఏ పనులు చేపట్టాలో.. పట్టణ ప్రగతిపై పంచాయతీ రాజ్‌ సమ్మేళనాలు నిర్వహించి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. జనాభాకు అనుగుణంగా నర్సరీలను ఏర్పాటు చేయడం, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు, పాడుబడిన ఇండ్లు కూల్చివేత పనులు చేపట్టడం తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేయనున్నారు. వార్డుకో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ప్రతి వార్డులో 4 రకాల కమిటీలను వేశారు.  


  జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు నూతనంగా ఏర్పాటైన 4 రకాల కమిటీల సభ్యులు సన్నద్ధమయ్యారు. ఒక్కో వార్డుకు ప్రత్యేకాధికారిని నియమించారు. ప్రత్యేకాధికారి నేతృత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు ఆ వార్డులో పర్యటిస్తారు. ఒక్కో వార్డుకు యువత, మహిళలు, వయోవృద్ధులు, ఇతర ప్రముఖులతో 4 రకాల కమిటీలను వేశారు. ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున 60 మంది సభ్యులు ఉంటారు. వీరంతా తొలి రోజు ఆ పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే వీరి ముందున్న కర్తవ్యం. ప్రధానంగా ఈ పది రోజుల్లో మున్సిపాలిటీలో అన్ని హంగులు ఉన్నాయా.. లేవా..? నర్సరీలు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని కావాలి..? చెత్త సేకరణకు ఎన్ని వాహనాలు వాడుతున్నారు.. ఇంకెన్ని వాహనా లు అవసరం..? ఇండ్లలో తడి, పొడి చెత్త సేకరణకు వేర్వేరు బుట్టలు ఉన్నాయా? లేవా? అని పరిశీలించడం, ఆయా వార్డుల్లో ఇంకా ఏం పనులు చేపట్టాల్సి ఉంది? వార్డుల వారీగా స్థానిక కౌన్సిలర్లను కలుపుకొని కలెక్టర్‌ పట్టణ ప్రణాళికను తయారు చేస్తారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రతిపాదికన ప్రత్యేకాధికారిని నియమించారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో 4 రకాల కమిటీలను ఏర్పాటు చేశారు. 


పట్టణ ప్రగతిలో.. రోజు వారీగా చేపట్టే కార్యక్రమాలు

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌ -ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లో నేటినుంచి 10 రోజుల పాటు మొదటి విడుత పట్టణ ప్రగతి కా ర్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.   24వ తేదీ తొలిరోజు మురుగునీటి కా ల్వలు, ఓపెన్‌ ప్లాట్లను శుభ్రం చేయడం. 25న మురుగునీటి కాలువల నుంచి తీసిన చెత్తను తరలించడం. మిగిలిన మురుగునీటి కాలువలను శుభ్రం చేయ డం. ఎలక్ట్రిక్‌ మీటర్ల మరమ్మతులు, మోటరు కెపాసిటర్లు మార్చడం తదితర పనులు చేపడుతారు. 26న పనికిరాని కలుపు మొక్కలను తొలిగించడం,  మిగిలిన మురుగునీటి కాల్వలను శుభ్రం చేయుట,  తీసిన చెత్తను పారబోయడం, వీధులను శుభ్రం చేసే పనులను చేపడుతారు. 27న వీధులను శుభ్రం చేయడం, ముళ్లపొదలను తొలిగించడం, పనికిరాని బావులు, బోర్లను పూడ్చివేయడం. 28న  వార్డుల్లో గుంతలు ఉన్న రోడ్లను మట్టితో పూడ్చడం, రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలిగించడం, ప్రతి శుక్రవారం యాంటీ లార్వాల్‌ బంతులను వదిలే పనులు చేపడుతారు. 29న విద్యుత్‌ తీగలను సరిచేయుట, విద్యుత్‌ స్తంభాలను మార్చడం, పబ్లిక్‌ ప్రదేశాలను, సంస్థలు, కమ్యూనిటీ ప్రాంతాలను శుభ్రం చేస్తారు. మార్చి 1న శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలిగించటం, అక్రమ లేఅవుట్ల సంఖ్య వాటి విస్తీర్ణంతో సహ గుర్తించడం, అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటారు. 2వ తేదీన విద్యుత్‌ దీపాల మరమ్మ తులు, రోడ్లపై గుంతలను పూడ్చుడ, 3వ తేదీన ప్లాస్టిక్‌ సేకరణ, 4వ తేదీన  తడి, పొడి చెత్త సేకరణ పనులు చేపడుతారు.


సిద్ధంగా రూ. 23.01 కోట్లు 

 జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి, మార్చి నెలలకు జనాభా ప్రతిపాదికన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు నెలలకు సంబంధించిన రూ. 4.25 కోట్లు, సిద్దిపేట మున్సిపాలిటీకి రూ. 2.02కోట్లు, గజ్వేల్‌ మున్సిపాలిటీకి రూ. 76 లక్షలు, దుబ్బాక మున్సిపాలిటీకి రూ. 59లక్షలు, హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి రూ. 44లక్షలు, చేర్యాల మున్సిపాలిటీకి రూ. 44లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. మున్సిపాలిటీల్లో సిద్ధంగా ఉన్న నిధులు రూ.18.76కోట్లు, వీటిలో సిద్దిపేట మున్సిపాలిటీలో రూ. 1.50కోట్లు, గజ్వేల్‌ మున్సిపాలిటీలో రూ. 8.99కోట్లు, దుబ్బాక మున్సిపాలిటీలో రూ. 39లక్షలు, హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో రూ. 7.74కోట్లు, చేర్యాల ము న్సిపాలిటీలో రూ. 14 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఇటివల విడుదల చేసిన నిధులు, ఇదివరకే రడీగా ఉన్న నిధులతో పాటు  మొత్తం కలిపి రూ. 23.01 కోట్లు ఉన్నాయి. వీటన్నీంటిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో వినియోగించునున్నారు. 


ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దుదాం 

పట్టణ ప్రగతిలో భాగంగా ఆయా పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మంచి పట్టణం అంటే ఎలా ఉండాలి? ప్రతి రోజు చెత్త, ము రుగు నీటిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచడం, పరిశుభ్రమైన మంచినీటి సరఫరా, గుంతలు, బొందలు, గోతులు లేని రహదారులు, పచ్చదనంతో కలకలలాడాలి. చెత్త నిర్మూలనకు డంపింగ్‌ యార్డు ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, జనాభాను అనుసరించి శుభ్రమైన వెజ్‌, నాన్‌వెజ్‌, పండ్లు, పూల మార్కెట్లను ఏర్పాటు చేయడం, క్రీడాప్రాంగణాలతోపాటు ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి.


 మున్సిపల్‌ చట్టంలో ముఖ్యమైనవి.. 

 • పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా మ్యాచింగ్‌ గ్రాంట్‌ మున్సిపల్‌కు రానుంది. 
 • ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఏర్పాటు.  
 •  గ్రీన్‌ సెల్‌ ఏర్పాటు చేసి వార్షిక బడ్జెట్‌లో 10 శాతం ప్రత్యేక నిధులు కేటాయించడం. 
 • 75 చదరపు గజాల విస్తీర్ణంలో నివాస నిర్మాణాలకు ఏ అనుమతి అవసరం లేదు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసి రూ.1 నామమాత్రం సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది. 
 • బహుళ అంతస్తుల భవనాలు, 500 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలోని నిర్మాణానికి 21 రోజుల్లోగా ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతి ఇవ్వాలి. బిల్లింగ్‌ ఆమోద ప్రక్రియకు (టీఎస్‌బీపీఎస్‌ఎస్‌) అనుమతులన్నీ ఒకచోటే జారీ చేయబడుతాయి. 
 •  అక్రమ నిర్మాణాలను మున్సిపల్‌ కమిషనర్‌, కలెక్టర్‌కు తెలియజేసిన పౌరులకు ప్రోత్సాహం. 
 • తాత్కాలిక లేఅవుట్లకు స్వీయ ధ్రృవీకరణపై ఆన్‌లైన్‌ ద్వారా 21 రోజుల్లో అనుమతి. 
 • ప్రతి లేఅవుట్‌లోనూ లే అవుట్‌ యజమాని, ఉమ్మడి పార్కింగ్‌ స్థలానికి కొంత స్థలాన్ని కేటాయించాలి. 
 • లేఅవుట్‌ పూర్తి చేసిన తరువాత ఖాళీ స్థలాల్లో, రోడ్లకు కేటాయించిన భూమిని పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్‌ చేయాలి. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పడినలే అవుట్‌ ఆమోద కమిటీ తాత్కాలిక లేఅవుట్లను పరిశీలించి, శాశ్వత అనుమతిని ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. పారిశుద్ధ్యం 

 • రహదారుల పక్కనున్న పొదలు, తుప్పలు, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కల తొలింగింపు. అలాగే, జిల్లేడు, సర్కారు, తుమ్మ చెట్ల తొలగించుట. 
 • రోడ్ల వెంబడి భవన నిర్మాణ వ్యర్థాల తొలిగింపు. 
 • మురుగు కాల్వలు శుభ్రపర్చుట, పూడికతీత. 
 • ఖాళీ స్థలాలను శుభ్రం చేయుట.
 • పార్కులు, సముదాయక స్థలాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్యకేంద్రాలు, బస్‌స్టాప్‌లు, విద్యుత్‌, దహన వాటికలు, మార్కెట్లు, ప్రజాసదుపాయాల స్థలాలు శుభ్రం చేయుట.
 • వార్డుల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగింపు. 
 • పాడుబడిన బోరు బావులను మూసి వేయుట. 
 • ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు. 


హరిత ప్రణాళిక 

 •  ఇంట్లో పెంచుకునే, అవెన్యూ బ్లాక్‌, కమ్యూనిటీ సంస్థలు, బహిరంగ స్థలాల్లో నాటడానికి అవసరమయ్యే మొక్కలపై సర్వే. 
 • వార్డుల్లో నర్సరీలు  ఏర్పాటు చేయాలి. వార్డుల్లో  స్థలం లేకపోతే పట్టణ శివారులో నర్సరీని ఏర్పాటు చేసి, ఆ వార్డుకు మొక్కలను సైప్లె చేయాలి. 
 • ఇంతకు ముందు నాటిన మొక్కలను సంరక్షించడంతోపాటు వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అవసరం మేర కత్తిరించి ట్రీగార్డులతో రక్షణ కల్పించాలి. 
 • వార్డుల్లో నర్సరీ ఏర్పాటు చేయకపోతే సమీప గ్రామ పంచాయతీల్లో ఉపాధి పథకంలో ఏర్పాటు చేయాలి. 


 పట్టణ ప్రగతి కార్యాచరణ ప్రణాళిక 

 • శ్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు. 
 • విద్యుత్‌ దహన వాటిక, ప్రస్తుత పరిస్థితి, వైకుంఠ ధామం యొక్క ఆవశ్యకత. 
 • సమీకృత మార్కెట్‌, పార్కులు, ఆటస్థలాలు, హరిత ఉద్యానవనాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు. 
 • డంపింగ్‌ చేసే స్థలాలు, ఎఫ్‌ఎస్‌టీపీ స్థలాల కేటాయింపు, స్థలాలను స్వాధీన పర్చుకునుట. 
 • చెత్త సేకరణకు రవాణా నిమిత్తం అవసరమైన వాహనాలను కొనుగోలు చేయడం. 
 • నీటి మడుగుల్లో నీరు శుభ్రం చేయలేని స్థలాల్లో వారానికి ఒకసారి యాంటీ లార్వా బాల్స్‌ వేయడం. 
 • డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు స్థలం గుర్తించి స్వాధీనం చేసుకోవడం. 
 • ఆటో, రిక్షాస్టాండ్‌, వీధి వ్యాపారుల జోన్‌ ఏర్పాటు. 


 విద్యుత్‌ 

 • వార్డుల్లో వంగిన, తుప్పు పట్టిన ఇనుప స్తంభాలను మార్చడం. వదులుగా ఉన్న వైర్లను మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ చర్యల ఏర్పాటు.
 • పార్కులు, ప్రజా మరుగు దొడ్లు, కూడళ్లు, చౌరస్తాల్లో వీధి దీపాల ఏర్పాటు.


logo