శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 24, 2020 , 00:27:48

కరొనా పుకార్లు చికెన్‌ ధర ఢమాల్‌

కరొనా పుకార్లు చికెన్‌ ధర ఢమాల్‌
  • కోళ్లకు కరోనా వైరస్‌ అంటూ వదంతులు
  • తగ్గిన చికెన్‌, కోడిగుడ్ల అమ్మకాలు
  • అమాంతం పడిపోయిన ధరలు
  • లబోదిబోమంటున్న వ్యాపారులు
  • ఉమ్మడి జిల్లాలో రోజుకు రూ.కోటిన్నర వరకు నష్టం

చైనాలో కరోనా వైరస్‌ విజృంభించి వేలాదిమంది మరణిస్తుండడంతోపాటు పశుపక్షాదులు మృత్యువాతపడుతున్నాయి. మనవద్ద కూడా కోళ్లకు కరోనా వైరస్‌ సోకుతున్నదని వదంతులు వ్యాపిస్తుండడంతో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నది. చికెన్‌, కోడిగుడ్ల కొనుగోళ్లు తగ్గడంతో ధరలు అమాంతం పడిపోయాయి. జిల్లాలో వ్యవసాయం తర్వాత కోళ్ల పరిశ్రమ లక్షలాదిమందికి ఉపాధినిస్తున్నది. కొనుగోళ్లు తగ్గడంతో ఫారాల నిర్వహణ భారంగా మారిందని యజమానులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.కోటిన్నర వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.  - తొగుట 


తొగుట: కరోనా వైరస్‌తో చైనాలో వందల సంఖ్యలో మనుషులు మరణించడంతో ఇక్కడ కరోనా వైరస్‌ మీద సోషల్‌మీడియాలో పోస్టు రావడంతో ఎక్కువ శాతం ప్రజలు చికెన్‌, కోడిగుడ్లు తినడం మానివేశారు. దీంతో కోడితో పాటు గుడ్డు రేటు పడిపోవడంతో కోళ్ల పరిశ్రమ నష్టపోతున్నది.   కోళ్ల పరిశ్రమపై కరోనా వైరస్‌ పుకార్లు శికార్లు చేయడంతో ములిగే నక్కపై తాటి పండు పడినట్లు కోళ్ల పరిశ్రమ యజమానులు విలపిస్తున్నారు. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ రాదని చెబుతున్నా, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జిల్లాలో కోళ్ల పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉంది. జిల్లాలో  45లక్షల లేయర్‌ కోళ్లఫారాలు, 55 లక్షల బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు, 6 లక్షల బ్రీడర్స్‌ ఉన్నాయి. లక్ష కోళ్లకు రోజుకు 12 టన్నుల దాణా అవసరం ఉంటుంది. దాణా రేట్లు బాగా పెరిగిపోవడంతో కోళ్ల పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాణా కోసం వినియోగించే జొన్నలు, సోయాబిన్‌లు క్వింటాలుకు రూ. 1900, రూ. 4000 ధర పలుకుతుండటంతో నిర్వహణ వ్యయం పెరుగుతున్నది. సోషల్‌ మీడియాలో  15 రోజుల కింద చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని  పుకార్లు వచ్చాయి. అప్పటి నుంచి రోజు రోజుకు కోడి, గుడ్డు ధరలు పడిపోయాయి. పేపర్‌ రేటు కన్నా రేట్లు పడిపోయాయి. పేపర్‌లో కోడికి కిలోకు రూ.54 ఉంటే రైతుకు రూ.37 మాత్రమే చెల్లిస్తున్నారు. గుడ్డు ధర రూ.3 పడిపోయింది. రూ.3  అయినా కొనే వారు లేకపోవడంతో లక్షల కోడిగుడ్లు  ఫారాల గోడౌన్లలో నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు ఎగుమతి చేయడానికి కోళ్ల పరిశ్రమ యజమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడ్డు ధర 4.25, కోడి కిలోకు ధర రూ.75-80 ఉంటేనే యజమానికి గిట్టుబాటు అవుతుంది.  పది రోజుల్లో కోళ్ల పరిశ్రమకు కరోనా పుకార్లకు దాదాపు రూ.15 కోట్ల నష్టం వాటిల్లిందని అంచన.  


పుకార్లను నమ్మవద్దు : పశువైద్యుడు బాలసుందరం

కోళ్లను తింటే కరోనా వైరస్‌ సోకుతుంది అన్న పుకార్లను నమ్మవద్దు. కోడి నుంచి కరోనా వైరస్‌ వ్యాపించినట్లు దాఖలాలు లేవు. ఎవరో ఆకతాయులు చేసిన పుకార్ల మూలంగా కోళ్ల పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. 


తీవ్రంగా నష్టపోతున్నాం : పౌల్ట్రీ యజమాని శ్రీకాంత్‌రెడ్డి

సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల మూలంగా కోళ్ల పరిశ్రమకు ఊహించని నష్టం వాటిల్లింది. కోడిగుడ్లు తీసుకునే వారు లేకపోవడంతో లక్షల గుడ్లు గోడౌన్లలో నిలిచిపోయాయి. ధర తక్కువ కావడంతో పాటు కొనుగోళ్లు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. సోషల్‌ మీడియాలో దుష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. 


logo