ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 22, 2020 , 23:55:45

నయనానందం

నయనానందం

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రా ష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కొమురవెల్లి క్షేత్రం కిక్కిరిసింది. పెద్దపట్నం ఆద్యంతం జయ జయ ధ్వానాల మధ్య వైభవంగా సాగింది. శివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు జాగరణ చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మతో కొలువైన మల్లికార్జున స్వామి వారికి తలనీలాలు సమర్పించి, కోనేరులో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండి రాత్రి పొద్దుపోయే వరకు స్వామి వారి దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గుట్టపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. స్వామివారిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దర్శించుకొని, పూజలు చేశారు.


కనుల పండువగా..

ఒగ్గు పూజారుల నేతృత్వంలో పెద్ద పట్నం కార్యక్రమాన్ని నయనానందకరంగా నిర్వహించారు. కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవాన్ని, స్థల పురాణాన్ని ఒగ్గు పూజారులు జానపద పాటలు పాడుతూ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి సందర్బంగా లింగోద్భవ కాలం రాత్రి 12గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపుం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించారు. అనంతరం ఒగ్గు పూజారులు రాత్రి 12గంటలకు మొదటగా కోనేరులో గంగస్నానం, పన్నెండున్నరకు బియ్యాన్ని సుంకు పట్టడడం, ఒంటి గంటకు మైలుపోలు, అనంతరం రాత్రి 2గంటల ప్రాంతంలో ఒగ్గు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో పంచరంగులు కుంకుమ(ఎరుపు), పసుపు, తెలుపు(బియ్యం పిండి), ఆకుపచ్చ(తంగెడు పిండి), గులాలు తదితర వాటి చూర్ణాలను కలిపి ముగ్గులుగా వేసి పట్నంగా తయారు చేశారు. అనంతరం స్వామి వారికి బోనం నివేదనగా చెల్లించగానే, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి, పట్నం దాటారు. వెంటనే భక్తులు పెద్దపట్నం దాటి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.


భారీగా భక్తుల రాక

పెద్దపట్నం కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 30 వేల మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో భక్తులు పెద్దపట్నం తిలకించేందుకు వీలుగా ఆలయ డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్‌, పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ సంతోష్‌ చర్యలు తీసుకున్నారు. కార్యక్రమాల్లో  కమిటీ సభ్యులు నర్సింహులు, అమర్‌, మల్ల య్య, నాగిరెడ్డి, బాల్‌రెడ్డి, ఏఈవోలు సుదర్శన్‌, శ్రీనివాస్‌, పర్యవేక్షకులు శేఖర్‌, సిబ్బంది, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. 


logo