ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 22, 2020 , 23:50:57

రేపటి నుంచి పట్టణ ప్రగతి

రేపటి నుంచి పట్టణ ప్రగతి

 హుస్నాబాద్‌ టౌన్‌ : సమస్యలను గుర్తించడం.. సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించడమా..ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకువచ్చి పరిష్కరించడమా.. ఆయా పనులు సంబంధిత శాఖలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వడమా..ఇలా అన్నింటిని గుర్తించి, పరిష్కరించే దిశగా పట్టణ ప్రగతి సాగనున్నది. ప్రభుత్వం ఈనెల 24నుంచి అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతికి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న తరుణంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా, జిల్లా అదనపు కలెక్టర్‌ ముజమిల్‌ఖాన్‌ను సైతం నియమించారు. 

 

ప్రత్యేక ప్రణాళికలు..

పట్టణంలోని ఆయా వార్డులకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను మున్సిపల్‌ ప్రత్యేకాధికారితోపాటు ఆయా వార్డులకు సంబంధించిన ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రూపొందించాల్సి ఉంటుంది.  పట్టణంలోని ఇరువైవార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించే విషయంలో ప్రాధాన్యతను సైతం తీసుకోని ప్రణాళికను రూపొందించనున్నారు.  తడి, పొడిచెత్త బుట్టలు పంపిణీ చేయడం, చెత్తను డంపింగ్‌ యార్డులోకి తరలించే పనిని ఏవిధంగా చేపట్టాలనే విషయాలతోపాటు విద్యుత్‌, రహదారులు, మురికి కాల్వలు పలు సమస్యలను   గుర్తించి వార్డుల వారీగా ప్రణాళికను తయారు చేయనున్నారు. ప్రతివార్డులో హరితహరాన్ని  పక్కాగా చేపట్టేందుకుగాను స్థలాలను సైతం గుర్తించనున్నారు.

 

నిరక్షరాసుల లెక్క.. 

ఆయా వార్డుల్లో నిరక్షరాసులెందరున్నారనే విషయాన్ని గుర్తించే పనిని సైతం ఇందులో చేపట్టనున్నారు.  వేలిముద్రల వేసే వారి జాబితాను ప్రత్యేకంగా తయారుచేయాలనే ఆదేశాలు జారీఅయ్యాయి.  అందులో మహిళలెందరు, పురుషులెందరనే విషయాన్ని  నమోదు చేస్తారు.  కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారంచుట్టనున్నారు. 

 

ప్రతి వార్డుకు ప్రత్యేకాధికారి..

 ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేకాధికారి సంబంధిత కౌన్సిలర్‌తో పాటు వార్డుల వారీగా మహిళా, యువత, సీనియర్‌ సిటిజన్‌ తదితరులతో ఏర్పాటు చేసిన కమిటీలతో ప్రత్యేకాధికారి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని వార్డులకు ప్రత్యేకాధికారుల నియామకాన్ని సైతం అధికారులు పూర్తిచేశారు. 


logo