శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 22, 2020 , 02:33:46

జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వైభవం

జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వైభవం

సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న ది. మహాశివరాత్రిని పురస్కరించుకొని సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి శివరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించింది. అందుకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం వేదికైంది. వేలాది కిలో మీటర్ల దూరంలో కొలువైన మంచు లింగాన్ని సిద్దిపేటలో అబ్బురపర్చే సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసి ప్రజలు, భక్తులకు మధురానుభూతి కలిగించారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో రెండో రోజు మధుసూదననంద స్వామి చేతుల మీదుగా రుద్రాభిషేకం, శతాధిక సుగంధ ద్రవ్యాలు, పంచ గంగా, సాగర, మానస సరోవరం జలాలతో స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. విద్యాశంకర భారతి స్వామితో రుద్రహవనం, పూర్ణాహుతి, ఆశీర్వాదం అందజేశారు. కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామితో సహస్ర దీపార్చన, లక్ష బిల్వార్చన, అనుగ్రహ భాషణం, ఆశీర్వచనాలు అందజేశారు. హనుమత్‌ దీక్షా పీఠాధిపతులు దుర్గాప్రసాద్‌ చేతుల మీదుగా మహాలింగార్చన నిర్వహించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి.. శివపార్వతుల కల్యాణాన్ని  నిర్వహించారు. షట్‌స్థల బ్రహ్మ 108 గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి చేతుల మీదుగా లింగోద్భవ అభిషేకం, లక్షపుష్పార్చన నిర్వహించారు. అనంతరం భక్తులు, ప్రజలతో సా మూహిక లింగోద్భవ అభిషేకాన్ని జరిపించారు. ప్రత్యేకంగా శివానంద లహరి జాగరణ కార్యక్రమాన్ని శనివారం తెల్లవారుజాము వరకు జరిపారు. మైదాన ఆవరణలో నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కనుల పండుగగా నిర్వహించారు. శివతత్వం, శివరాత్రి విశిష్ఠతను కుప్పా శ్రీపాదశర్మ, చెప్పెల హరినాథశర్మ ప్రబోధించారు.

మార్మోగిన శివనామస్మరణ 

ఓంకార నాదం, శివనామస్మరణలతో సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం మార్మోగింది. తెల్లవారు జాము నుంచే అమర్‌నాథుని మంచులింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులు, ప్రజలు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం ప్రత్యేకంగా నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ స్వా మి వారి దర్శనం కలిగేలా చూశారు. కాశీ నుంచి తీసుకొచ్చిన లక్ష రుద్రాక్షలను భక్తులకు అందించారు. 

మంచు లింగాన్ని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగిన శివరాత్రి మహోత్సవాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అమర్‌నాథుని మంచు లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.logo