మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 20, 2020 , 01:35:50

మహాశివరాత్రి మహోత్సవం

మహాశివరాత్రి మహోత్సవం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ సిద్దిపేట టౌన్‌ : పట్టణం శివనామస్మరణతో మార్మోగనుంది. అమర్‌నాథ్‌ యాత్ర చేయలేని భక్తులకు అమరేశ్వరుడి దర్శన భాగ్యం కలిగేలా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో భారీ సెట్టింగ్‌లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. హిమాలయాల పర్వతాలు, అమర్‌నాథ్‌ గుహ, మంచులింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలను అక్కడకి వెళ్లి దర్శించుకున్న అనుభూతిని కలిగేలా చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో శ్రీయాయవరం చంద్రశేఖర శర్మ సిద్దాంతి పర్యవేక్షణలో సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఏర్పాట్లను చేసింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. మహాశివరాత్రి జాగరణకు ఏర్పాట్లు సైతం చేశారు. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు మాధవానంద సరస్వతిస్వామి, మధుసూదననంద స్వామి, విద్యాశంకర భారతిస్వామి, కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి,  దుర్గాప్రసాద్‌, షట్‌స్థల బ్రహ్మ 108 శ్రీగురుసిద్ద మణికంఠ శివాచార్య మహాస్వామి హాజరుకానున్నారు. కాగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన కళాకారులు మంచుకొండ లు, గుహలాంటి భారీ సెట్టింగ్‌. గోశాల, వినాయక మండ పం, క్యూలైన్లు, జాగారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమర్‌నాథ్‌ యాత్రలో భాగంగా వచ్చే పహెల్‌గాం, చందన్‌వడి, శేష్‌నాగ్‌, పంచతరణి ప్రదేశాల నమూనాలతోపాటు ఆ ప్రాంతాల్లోని విశిష్టత తెలిపేలా ప్రత్యేకంగా సెట్టింగ్‌లు ఉన్నాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజున పార్వతి పరమేశ్వరుల కల్యాణం నిర్వహించేందుకు నిర్వాహకులు బుధవారం అర్చకులకు పుస్తెమట్టెలను అందజేశారు. 


అమర్‌నాథ్‌ నుంచి తెచ్చిన త్రిశూలం 

అమర్‌నాథ్‌ ఆలయం నుంచి తెచ్చిన త్రిశూలాన్ని సిద్దిపేటలోని శరభేశ్వర ఆలయంలో ఉంచారు. మంచు లింగంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలను శివరాత్రి రోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దేశంలో అత్యంత ఎత్తైన (11 ఫీట్ల ఎత్తు, వెడల్పు 6 ఫీట్లు)  మంచు శివలింగాన్ని నిర్మిస్తున్నారు. వీటితోపాటు దేశ నలుమూలల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. గుహకు కుడివైపు అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలు, ఎడమ వైపున ద్వాదశ జ్యోతిర్లింగాలను ఉంచారు.


శివరాత్రి జాగారానికి ప్రత్యేక ఏర్పాట్లు 

శివరాత్రి రోజు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు శివరాత్రి విశిష్టతను వివరించేలా 400 మంది కళాకారుల ప్రదర్శన. శివతత్వం, శివరాత్రి మహాత్యంపై ప్రవచనాలు శ్రీకుప్పా శ్రీపాదశర్మ (దత్తక్షేత్రం వ్యవస్థాపకుడు, క్షేత్రరాంపూర్‌), చెప్పెల హరినాథశర్మ (విజయదుర్గ సమేత సం తాన మల్లికార్జున క్షేత్రం) బోధిస్తారు.


ప్రతి భక్తుడికి పూజ చేసే భాగ్యం 

ప్రతి భక్తుడితో శతాధిక సుగంధ ద్ర వ్యాలు, పంచగంగా, సాగర, మానస సరోవరం జలాలతో స్వామివారికి అభిషేకం, బిల్వార్చన చేయిస్తారు. రుద్రాక్ష, రక్షాకంకణం, ఐశ్వర్య కాయిన్‌, ప్రసాదం ఇస్తారు. 


కార్యక్రమాలు... 

సిద్దిపేటలో మహాశివరాత్రి మహోత్సాలను వైభవంగా జరిపేందుకు ధార్మిక ఉత్సవ సమితి నేతృత్వంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నేడు 20న (గురువారం) ఉదయం 6 గం టలకు గోప్రవేశం, గణపతి పూజ, గోపూజ, అంకురార్పణ, మండపరాధన, లక్ష రుద్రాక్షలతో శివుడికి అభిషేకం. మాధవానంద సరస్వతీస్వామి అనుగ్రహ భాషణం, ఆశీర్వాదం.  21న సంతతధారా రుద్రాభిషేకం, శతాధిక సుగంధ ద్రవ్యా లు, పంచగంగా, సాగర, మానస సరోవరం జలాలతో రుద్రాభిషేకం. అమ్మవారికి కుంకుమార్చన, మధుసూదననంద స్వామి అనుగ్రహ భాషణం, ఆశీర్వాదం. విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో రుద్రహవనం - పూర్ణాహుతి, కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో సహస్ర దీపార్చన, లక్ష బిల్వార్చన, రాత్రి 7గంటలకు మహాలింగార్చన (365 మృ త్తికా లింగాలకు) దుర్గాప్రసాద్‌(హనుమత్‌ దీక్షా పీఠాధిపతు డు) అనుగ్రహ భాషణం, రాత్రి పార్వతి పరమేశ్వరుల కల్యా ణం, బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి వాఖ్యానం, లింగోద్భవ సమయంలో షట్‌స్థల బ్రహ్మ 108 శ్రీ గురుసిద్ద మణికంఠ శివచార్య మహాస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, భక్తులచే సామూహిక లింగోద్భవ అభిషేకం. 22న మంటపారాధన, అభిషేకం, అన్నపూజ, దేవతోద్వాసన పూజలు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 


 మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు 

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. హిమాలయాలు, అమర్‌నాథ్‌ ద్వాదశ జ్యోతిర్లింగాల భారీ సెట్టింగ్‌లు వేశారు. భక్తులకు మంచు లింగం, అమర్‌నాథ్‌ నుంచి తీసుకవచ్చిన త్రిశూలం, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి భక్తుడు శివలింగానికి అభిషేకం, బిల్వార్చన చేసేలా ఏర్పా ట్లు చేయడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు పీఠాధిపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.  

- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 


logo