మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 20, 2020 , 01:30:36

ఉగాది పండుగకు కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

ఉగాది పండుగకు కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం


కొండపాక : నూతన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బుధవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.

 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మార్చి 15వ తేదీ లోపు భవన నిర్మాణానికి సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని నూతన జిల్లాలో ప్రారంభం అవుతున్న మొదటి సమీకృత కలెక్టరేట్‌ సిద్దిపేట కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న కొద్దిపాటి పనులకు సంబంధించిన వివరాలను అధికారులకు ఫోన్‌ చేసి ఆరాతీశారు. భవన నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఈ సుదర్శన్‌, డీఈ రవి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. 

 

ఎల్‌ఐసీ ద్వారానే రైతుబీమా అమలు

సిద్దిపేట టౌన్‌ : సీఎం కేసీఆర్‌ వేసే ప్రతి అడుగు.. రైతు సంక్షేమం కోసమే.. రైతుకు ధీమా ఇచ్చేందుకు రైతుబీమా పథకాన్ని అమలు చేస్తూ.. రూ.5 లక్షల బీమా చేయించారు.. ఎన్ని బీమా కంపెనీలు ఉన్నప్పటికీ ఎల్‌ఐసీనే నమ్మి రైతులందరికీ ప్రభుత్వం బీమా చేయించడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేట కమర్షియల్‌ కాలనీలో బుధవారం ఉదయం శాశ్వత ఎల్‌ఐసీ జిల్లా భవన నిర్మాణానికి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. అనంతరం ఎల్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌ మినీ ఐపీ, ఎల్‌ఐసీ ప్రముఖ ప్రతినిధులు సావిత్రీ రామారావుకు సిద్దిపేట గొల్లభామ చీరలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా విపంచి కళాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.  


రైతు.. ఏ కారణంగా చనిపోయినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా వస్తుందని, వారం రోజుల్లో నామిని ఖాతాలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా తక్కువ రోజుల్లో బీమా సోమ్ము అందజేయాలని ఎల్‌ఐసీ యజమాన్యా నికి  సూచించారు. త్వరలో ఆటోడ్రైవర్ల కు పాలసీ తెస్తామని, ఇందుకు ఎల్‌ఐసీ సహకరించాలని కోరారు. ఎల్‌ఐసీ పాలసీలను ప్రజలు భద్రతగా భావిస్తున్నారని తెలిపారు. ఏజెంట్లు బా గా పని చేస్తున్నారని అభినందించారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ శాశ్వత భవనం పట్టణ, జిల్లా ప్రజలకు  ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏ ఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, ఎల్‌ఐసీ ఏజెంట్లు, నాయకులు పాల్గొన్నారు.


logo