మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 19, 2020 , 00:05:13

డీ-4 కాల్వ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

డీ-4 కాల్వ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

కొండపాక : కరువు మండలమైన కొండపాకను సస్యశ్యామలం చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయ సాధనకు అడ్డంకులు తొలగిపోయాయి.  తపాస్‌పల్లి డీ-4 కెనాల్‌ మార్గం సుగమమైంది. కొండపాక మండలంలోని 8 గ్రామాల చెరువులతో పాటు సిద్దిపేట నంగునూరు మండలాలకు చెందిన పలు గ్రామాల చెరువులను గోదావరి జలాలతో నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 44 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. అయితే కాలువ నిర్మాణంలో అడ్డంకులు రావడంతో కొంత జాప్యం ఏర్పడింది. అప్పటి భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో మండలంలోని 4 గ్రామాల చెరువులకు ఢీ-4 కాలువ ద్వారా గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల రైతాంగం తమ గ్రామాల్లోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తపాస్‌పల్లి రిజర్వాయర్‌ సాగునీటి సాధన సమితిని ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు గత ప్రణాళిక ప్రకారం ఢీ-4 కాలువ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. 


ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం కాలువ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. కాగా, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి మంగళవారం కాలువ నిర్మాణ పనులను పరిశీలించి, కాలువ నిర్మాణం జరగాల్సి ఉన్న గ్రామాల్లోని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన చెరువులను గోదావరి జలాలతో నిండుకుండలా మారుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మర్పడగ, ఖమ్మంపల్లి, రాంపల్లి, దర్గా గ్రామాలను సందర్శించారు. నిర్మాణ పనులు నిలిచిపోయిన చోట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. డీ-4 కాలువ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ ర్యాగల్ల దుర్గయ్య, సురేందర్‌రావు, పలు గ్రామాల సర్పంచ్‌లు ఉన్నారు.


logo